AP Cabinet Decisions : ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం రెండున్నర గంటల పాటు సాగింది. దీనిలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గిరిజన ప్రాంతాల్లో పీఎం ఆవాస్ యోజన గిరిజన గృహ పథకం అమలు చేసేందుకు చంద్రబాబు కేబినెట్ ఆమోదం తెలిపింది. పీఎం ఆవాస్ యోజన 1.0 కింద గృహాల నిర్మాణానికి మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గత ఐదేళ్లలో నిర్మాణం ప్రారంభానికి నోచుకోని ఇళ్లను రద్దు చేసే అంశంపై కేబినెట్‌లో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని మంత్రి ఆవాస్ యోజన 1.0 కింద రాష్ట్రంలో నిర్మాణ దశలో ఉన్న ఇళ్లను కొనసాగించి పూర్తి చేసేందుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపినట్లు మంత్రి పార్థసారథి ప్రకటించారు. డిసెంబర్ 24కే ఈ పథకం పూర్తవుతుండగా రాష్ట్ర ప్రభుత్వం చొరవతో మార్చి 26 వరకు పొడిగించినట్లు ఆయన పేర్కొన్నారు. 6.41 లక్షల ఇళ్లు పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. వీటిని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.
వాస్తవానికి గత ప్రభుత్వ హయాంలో గృహ నిర్మాణం పేరుతో కేంద్ర నిధులు దుర్వినియోగం అయ్యాయని తేలింది. ఆ మధ్య ఏపీ హౌసింగ్ శాఖలో భారీగా అక్రమాలు జరిగినట్లు అధికారుల ప్రాథమిక విచారణలో తేలింది. అధికారులు ప్రాథమిక నివేదికను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సమర్పించారు. ఎన్నికలకు ముందు హౌసింగ్ శాఖలో అక్రమాలు జరిగాయని టీడీపీ నేతలు ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే అవినీతిపై విచారణ జరిపిస్తామని కూడా అప్పట్లో హెచ్చరించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రస్తుత సంకీర్ణ ప్రభుత్వం గృహ నిర్మాణ శాఖలో జరుగుతున్న అక్రమాలు, అక్రమాలపై దృష్టి పెట్టింది నిధుల దుర్వినియోగం, పక్కదారి పట్టిన నిధులపై లెక్కలు వేస్తున్న గృహనిర్మాణ శాఖ అధికారులు వేల కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడ్డారని నివేదికలో పేర్కొన్నారు. నిధులు పక్కదారి పట్టినట్లు వారు గుర్తించారు. కేంద్ర నిధుల్లో కూడా అక్రమాలు జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయింది. గృహ నిర్మాణ శాఖలో దాదాపు 3 వేల 183 కోట్ల రూపాయలు దుర్వినియోగం అయినట్లు లెక్కలు తేల్చారు. గత ప్రభుత్వం ఇళ్లు కట్టలేదని, లెక్కల్లో చూపించి డబ్బులు దాచుకున్నారని నివేదికలో పేర్కొన్నారు.
గత ప్రభుత్వం నిర్మించిన ఇళ్ల లెక్కల్లో తప్పుడు వివరాలు ఇచ్చినట్లు తేలింది. 1లక్ష 32 వేల 757 ఇళ్లు నిర్మించకపోగా ఖాతాల్లో దాచుకున్నట్లు అధికారులు ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక ఇచ్చారు. దీంతో ప్రభుత్వం తీవ్ర చర్యలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పీఎంఏవై-యు 2.0 పథకాన్ని చంద్రబాబు సర్కార్ తీసుకొచ్చింది. కొత్త ఎంపిక చేసే లబ్ధిదారులకే ఈ పథకం అమలు చేయనున్నట్లు గతంలోనే ప్రభుత్వం ప్రకటించింది. ఈ స్కీం కింద కొత్త ఎంపికయ్యే లబ్ధిదారులకు ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ. 4 లక్షలు అందించనుంది ప్రభుత్వం. ఇందులో కేంద్రం తన వాటాగా రూ.2.50 లక్షలు అందించనుంది. రాష్ట్ర ప్రభుత్వం వాటాగా మరో రూ.1.50 లక్షలు ఇవ్వనుంది. పీఎం ఆవాస్ యోజన అర్బన్ 2.0 పథకంలో భాగంగా దేశ వ్యాప్తంగా 3 కోట్ల ఇళ్ల నిర్మాణాలు చేపట్టనున్నారు. ఇందులో భాగంగా పట్టణ ప్రాంతాల్లోని పేదలకు కోటి ఇళ్లు నిర్మించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.