Chandrababu Arrest Flexi: చంద్రబాబు జైలుకు వెళ్లిన వేళ.. థాంక్యూ జగన్ అంటూ పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల పేరిట ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు అవుతుండడం సంచలనానికి కారణమవుతోంది. సీనియర్ ఎన్టీఆర్ ఫోటోతో పాటు.. నందమూరి హరికృష్ణ, ఆయన కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ జగన్ కు కృతజ్ఞత చెబుతూ పుష్పగుచ్చం అందిస్తున్నట్లు ఈ ఫ్లెక్సీ దర్శనమిస్తోంది.
స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో చంద్రబాబు రిమాండ్ ఖైదీగా మారిన సంగతి తెలిసిందే. విజయవాడ సిఐడి కోర్టులో వాదనల అనంతరం 14 రోజులపాటు చంద్రబాబును రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో వైసీపీ నాయకులు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇన్నాళ్లకు నందమూరి తారక రామారావు ఆత్మకు శాంతి చేకూరిందని ఎక్కువమంది కామెంట్స్ చేస్తున్నారు. చంద్రబాబుకు తగిన శాస్తి జరిగిందని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ తరుణంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల పేరిట ఏర్పాటైన ఈ ఫ్లెక్సీ కలకలం రేపుతోంది.
చంద్రబాబు అరెస్ట్ అనంతరం నందమూరి కుటుంబమంతా ఆయనకు మద్దతు ప్రకటించింది. కానీ ఒక్క జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఇంతవరకు స్పందించలేదు. ఈ తరుణంలో ఫ్లెక్సీలు వెలియడం ఆసక్తిగా మారింది. ” నన్ను చివరి దశలో అనేక అవమానాలకు, అత్యంత శోభకు గురిచేసి.. నా మరణానికి కారణమైన ‘నీచుడు చంద్రబాబు’. నేను చనిపోయాక నా మరణాన్ని వాడుకున్నాడు. నా కుమారుడు హరికృష్ణ మరణాన్ని కూడా కుటిల రాజకీయానికి వాడుకున్నాడు. నా మనుమడు తారకరత్న మరణాన్ని కూడా వీడి కొడుకు నీచ రాజకీయాన్ని కోసం వాడుకున్నాడు. ఈ నీచుడికి బుద్ధి చెప్పి ‘ నా ఆత్మకు శాంతి చేకూర్చావ్ ‘ నీచుడు, దుర్మార్గుడైన చంద్రబాబు సెప్టెంబర్ 10న జైలుకెళ్తున్న సందర్భంగా.. తెలుగు ప్రజలందరూ కూడా ఈ రోజున ఆత్మ శాంతి దినోత్సవం గా జరుపుకోవాలని నా విజ్ఞప్తి”.. అంటూ మీ నందమూరి తారక రామారావు పేరిట ఉన్న ఈ ఫ్లెక్సీ సంచలనం గా మారింది.
అయితే ఈ ఫ్లెక్సీలను జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు పెట్టారా? లేకుంటే వైసీపీ నేతలు ఏర్పాటు చేశారా? అన్నదానిపై క్లారిటీ లేదు. అయితే రాష్ట్రవ్యాప్తంగా ఈ ఫ్లెక్సీలో ఏర్పాటుకు కొందరు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల ముసుగులో వైసీపీ నేతలే ఈ చర్యకు దిగినట్లు టిడిపి శ్రేణులు అనుమానిస్తున్నాయి. చంద్రబాబు అరెస్టు సానుభూతి టిడిపికి దక్కకుండా ఈ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. అయితే దీనిపై జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘాల నుంచి ఎటువంటి ప్రకటన ఇంతవరకు రాలేదు. పైగా కొన్నిచోట్ల ఫ్లెక్సీ ల పై స్థానిక నేతల ఫోటోలు కనిపిస్తున్నాయి. మున్ముందు ఈ ఫ్లెక్సీ రాజకీయాలు మరింత ముదిరిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.