CM Chandrababu: మహిళలను ఎమ్మెల్యేలుగా చేస్తామని చెబుతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు( AP CM Chandrababu). అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా రిజర్వేషన్లపై మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో మహిళలు ఎమ్మెల్యేలుగా గెలిచేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. అయితే మహిళలను ప్రోత్సహించిన ఘనత చంద్రబాబుది. గతంలో ఆయన ప్రోత్సాహంతో ఎమ్మెల్యేలు అయిన మహిళలు ఉన్నారు. అందులో ప్రస్తుత తెలంగాణ మంత్రి సీతక్క ఒకరు. ఒక ఆదివాసి తెగకు చెందిన సీతక్క మావోయిస్టు ఉద్యమంలో చేరి.. దాని నుంచి బయటకు వచ్చి.. కష్టపడి చదివి.. రాజకీయాల్లోకి వచ్చి రాణించిన తీరు వెనుక చంద్రబాబు ఉన్నారన్నది వాస్తవం. అందుకే ఆమె ఏ రాజకీయ పార్టీలో ఉన్నా.. చంద్రబాబును మాత్రం తన పెద్దన్నగానే భావిస్తారు. అంతలా ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది చంద్రబాబు.
Also Read: ఏపీలో డిఎల్ఎఫ్.. పెద్ద ప్లాన్లు ఇవి
* ఆదివాసి మహిళ..
మంత్రి సీతక్క( Minister Sitakka) అసలు పేరు అనసూయ దంసారి. వరంగల్ జిల్లా ములుగు మండలం జగ్గన్నపేట. ఆదివాసి కుటుంబంలో 1971 జూలై 9న జన్మించారు సీతక్క. సమ్మయ్య, సమ్మక్క దంపతులకు రెండో సంతానం. ప్రభుత్వ వసతి గృహంలో ఉంటూ ఆమె పదో తరగతి వరకు చదువుకున్నారు. చిన్ననాటి నుంచి ఆదివాసీలకు జరుగుతున్న అన్యాయాలపై ప్రశ్నించడం మొదలుపెట్టారు. అలా విద్యార్థి దశ నుంచి పోరాట జీవితం ప్రారంభించారు. జననాట్యమండలి ద్వారా గద్దర్, విమలక్క వంటి వారికి దగ్గరయ్యారు. అలా నక్సలైట్లలో చేరి ప్రజలకు న్యాయం చేయాలనే తన ఆకాంక్షను నెరవేర్చడం ప్రారంభించారు. దాదాపు 15 సంవత్సరాల పాటు మావోయిస్టుల ఉద్యమంలో అజ్ఞాతవాసం గడిపారు. తన సమీప బంధువు శ్రీరాములను పెళ్లి చేసుకొని తన పేరును సీతగా మార్చుకున్నారు. కొడుకు పుట్టిన తర్వాత దళంలో ఉండలేక.. 1996లో జనజీవన స్రవంతిలోకి వచ్చారు. అప్పట్లో సీఎం గా చంద్రబాబు ఉండేవారు. ఆమెకు ఓ ప్రభుత్వ శాఖలో కాంట్రాక్టు ఉద్యోగిగా అవకాశం కల్పించారు.
* కుటుంబ జీవనంతో విద్య..
చిన్నపాటి ఉద్యోగం చేసుకుంటూ.. నెలవారి జీతంతో కుటుంబాన్ని పోషించుకుంటూ.. ఎల్.ఎల్.బి పూర్తి చేశారు సీతక్క. ఆమె విషయాన్ని గుర్తించారు అప్పటి సీఎం చంద్రబాబు. తెలుగుదేశం పార్టీలోకి రప్పించి.. 2004లో ములుగు అసెంబ్లీ టికెట్ ఇచ్చారు చంద్రబాబు. కానీ ఆ ఎన్నికల్లో ఆమె ఓడిపోయారు. 2009లో మాత్రం రెండో ప్రయత్నంలో మూలుగు అసెంబ్లీ స్థానం నుంచి టిడిపి అభ్యర్థిగా గెలిచారు. 2014లో ఓటమి ఎదుర్కోగా.. 2018 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా మరోసారి గెలిచిన సీతక్క రేవంత్ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. అయితే తన ఇంతటి రాజకీయ జీవితానికి చంద్రబాబు కారణం అని చాలా కృతజ్ఞతతో చెబుతుంటారు.
* ఆ ప్రోత్సాహం మరువరానిది..
సహజంగా రాజకీయ పార్టీలు అన్నాక సమీకరణల్లో భాగంగా మహిళలతో పోటీ చేయించడం ఆనవాయితీ. అయితే సీతక్క విషయంలో మాత్రం చంద్రబాబు తీసుకున్న నిర్ణయం మాత్రం సాహసంతో కూడుకున్నది. మావోయిస్టుల ఉద్యమం నుంచి వచ్చిన ఆమెకు టికెట్ ఇవ్వడం అంటే ఒక సాహసమే. అలా టికెట్ ఇచ్చి ప్రోత్సహించిన ఆమె ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఒక ఫైర్ బ్రాండ్. ఒక్క సీతక్క మాత్రమే కాదు ఓ పదిమంది మహిళా నేతలు విషయంలో చంద్రబాబు ప్రత్యేక చొరవ ఉంది. వారి రాజకీయ ఎదుగుదల వెనుక చంద్రబాబు ప్రోత్సాహం ఉంది. అందుకే ఇప్పుడు ఎక్కువమంది మహిళలను ఎమ్మెల్యేలను చేస్తామని చెబుతున్నారు చంద్రబాబు. అందుకే ఎక్కువ మంది మహిళలు ఆసక్తి చూపుతున్నారు.