Chandrababu Vs Peddi Reddy: ఏపీ రాజకీయాల్లో( AP Political career ) పగ, ప్రతీకారాలు ఎక్కువయ్యాయి. తనను అరెస్టు చేయించారన్న కోపంతో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబును 52 రోజులపాటు జైల్లో ఉంచగలిగారు. అవినీతి కేసుల్లో ఆధారాలు లేకుండానే చంద్రబాబును జైల్లో పెట్టారు. అయితే ఇది చంద్రబాబుకు ప్రయోజనం కలిగించే అంశం అయిందన్న విశ్లేషణలు ఉన్నాయి. దానిని పక్కన పెడితే ఇప్పుడు ఏపీలో ప్రతీకార రాజకీయాలు నడుస్తున్నాయి అన్నది స్పష్టం అవుతుంది. జగన్ చుట్టూ ఉన్న కోటరీని నిర్వీర్యం చేయగలిగితే.. ఆయన బలహీనుడు అవుతాడు అని ఒక అంచనాకు వచ్చినట్టు ఉన్నారు. అయితే ప్రధానంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి పెద్దిరెడ్డి కుటుంబం అండగా నిలుస్తూ వస్తోంది. అందుకే ఆ కుటుంబం పై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈరోజు పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి అరెస్టు ఖాయమని తెగ ప్రచారం నడుస్తోంది. ఇందుకు సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సమాచారం. ఈరోజు మద్యం కుంభకోణానికి సంబంధించి ఛార్జ్ షీట్ ఒకవైపు.. మిధున్ రెడ్డి అరెస్టు ఒకవైపు సంచలనంగా మారనుంది. అయితే పెద్దిరెడ్డి కుటుంబం టార్గెట్ వెనుక పెద్ద వ్యూహం ఉంది.
Also Read: ఫిష్ వెంకట్ మరణానికి కారణం టాలీవుడ్ ఇండస్ట్రీ యేనా..? ఎందుకు పట్టించుకోలేదు!
* బలమైన కుటుంబం గా..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) అధికారంలోకి వచ్చిన తరువాత.. బలంగా తయారైన రెండో కుటుంబం పెద్దిరెడ్డిదే. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తో పాటు ఆయన కుమారుడు మిథున్ రెడ్డికి వైసీపీలో మంచి పేరు ఉంది. పబ్లిక్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ లో కూడా పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తోంది ఆ కుటుంబం. కేవలం చంద్రబాబును దృష్టిలో పెట్టుకొని ఈ కుటుంబం జగన్మోహన్ రెడ్డికి అండగా నిలుస్తోంది. ఒక విధంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డికి మించి పెద్దిరెడ్డి కుటుంబానికి రాజకీయ శత్రువు చంద్రబాబు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తో చంద్రబాబుది దశాబ్దాల వైరం. అందుకే వైసిపి నుంచి ఎంత పెద్ద నేతలైనా టిడిపిలో చేరవచ్చు కానీ.. పెద్దిరెడ్డి కుటుంబం మాత్రం చేరే అవకాశం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
* దశాబ్దాలుగా అదే ప్రయత్నం..
చంద్రబాబును రాజకీయంగా ఓడించాలని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి( peddi Reddy Ramachandra Reddy ) దశాబ్దాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే చంద్రబాబుతో విద్యార్థి దశ నుంచే ప్రత్యర్థిగా ఉన్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. వీరి మధ్య వైరం తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో ప్రారంభమైందని చెబుతారు. అప్పట్లో విద్యార్థి నేతగా పెద్దిరెడ్డిని కాదని చంద్రబాబు ముందుకు వచ్చారు. పెద్దిరెడ్డి కంటే ముందే చంద్రబాబు మంత్రి అయ్యారు. తిరుపతి వెంకటేశ్వర యూనివర్సిటీలో పెద్దిరెడ్డి, చంద్రబాబు వేరువేరు యూనియన్లలో పనిచేస్తూ.. పోటీ చేశారు. ఆ సమయంలోనే రెడ్డి వర్సెస్ కమ్మ అన్నట్టు పరిస్థితి సాగేది. అలా వారిద్దరి మధ్య వైరం ఉండిపోయింది. రాజకీయాల్లోకి వచ్చిన చంద్రబాబు 1978లో ఎమ్మెల్యే అయ్యారు. తర్వాత మంత్రి పదవి కూడా చేపట్టారు. అప్పట్లో ప్రతిపక్ష పార్టీ జనతా పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు పెద్దిరెడ్డి. అప్పటినుంచి వారి మధ్య వైరం నడుస్తూనే ఉంది.
* చంద్రబాబును అణచివేయాలని..
చంద్రబాబు( CM Chandrababu) టీడీపీలో చేరి రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రం చంద్రబాబు స్థాయిలో ఎదగలేకపోయారు. ఈ క్రమంలోనే ఆయనకు 2019 ఎన్నికలు కలిసి వచ్చాయి. రాయలసీమలో మూడు అసెంబ్లీ స్థానాలు తప్పించి మిగతావన్నీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేతిలోకి చేరాయి. అప్పటినుంచి చంద్రబాబును తొక్కాలని ప్రయత్నించారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. తన నియోజకవర్గం పుంగనూరు కంటే కుప్పం పైనే దృష్టి పెట్టారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీని ఏకపక్షంగా గెలిపించుకున్నారు. ఇక చంద్రబాబును కుప్పంలో ఓడిస్తాం అని శపథం కూడా చేశారు. ఒకటి రెండుసార్లు కుప్పం వచ్చిన చంద్రబాబును వైసీపీ శ్రేణులు అడ్డుకోవడమే కాదు అల్లర్లు కూడా సృష్టించారు. దీని వెనుక పెద్దిరెడ్డి ఉన్నారన్నది బహిరంగ రహస్యం. వైసిపి హయాంలో రాయలసీమను ఏలారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. కానీ అనుకున్నది సాధించలేకపోయారు. అందుకే ఇప్పుడు చంద్రబాబుకు టార్గెట్ అయ్యారు పెద్దిరెడ్డి. ఈరోజు మద్యం కుంభకోణంలో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ అవకాశాలు ఉన్నాయి. దీనిపై పెద్దిరెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి.