AP CS: చంద్రబాబు టీం రెడీ.. ఏపీ సిఎస్ గా నీరబ్ కుమార్ ప్రసాద్

ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీరబ్ కుమార్ ప్రసాద్ నియమితులయ్యారు.1987 ఏపీ క్యాడర్ కు చెందిన ఈయన ప్రస్తుతం.. పర్యావరణ, అటవీ శాఖ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ ప్రత్యేక కార్యదర్శిగా కొనసాగుతున్నారు.

Written By: Dharma, Updated On : June 7, 2024 11:14 am

AP CS

Follow us on

AP CS: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈనెల 12న చంద్రబాబు సీఎం గా ప్రమాణస్వీకారం చేయనున్నారు. అటు క్యాబినెట్ కూర్పు సైతం జరుగుతోంది. ఆశావహులు ఎవరికి వారు ప్రయత్నాల్లో ఉన్నారు. మరోవైపు ఈనెల 8న ప్రధాని మోదీ ప్రమాణస్వీకారం చేయనున్నారు. కార్యక్రమానికి చంద్రబాబుతో పాటు పవన్ హాజరు కానున్నారు. సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారానికి ప్రధాని మోదీ తో పాటు ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల ముఖ్యమంత్రులు, కీలక నేతలు హాజరు కానున్నారు. అమరావతిలో చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి సంబంధించి వేదిక ఏర్పాట్ల పనిలో యంత్రాంగం నిమగ్నమైంది. మరోవైపు అధికారిక టీం కూడా సిద్ధమయింది. సీఎస్ నుంచి ప్రత్యేక కార్యదర్శుల వరకు కొత్త అధికారులు భర్తీ అవుతున్నారు.

ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీరబ్ కుమార్ ప్రసాద్ నియమితులయ్యారు.1987 ఏపీ క్యాడర్ కు చెందిన ఈయన ప్రస్తుతం.. పర్యావరణ, అటవీ శాఖ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ ప్రత్యేక కార్యదర్శిగా కొనసాగుతున్నారు. తొలుత విజయానంద్ పేరు వినిపించినా.. నీరబ్ కుమార్ ప్రసాద్ వైపే చంద్రబాబు మొగ్గు చూపారు. గురువారం నీరబ్ కుమార్ ప్రత్యేకంగా చంద్రబాబును కలిశారు. శుక్రవారం నియామక ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈనెల 30న సిఎస్ జవహర్ రెడ్డి పదవీ విరమణ పొందనున్నారు.ఇప్పటికే ఆయన సెలవుపై వెళ్ళిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త సిఎస్ నియమితులయ్యారు.

చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో సీఎంఓలో కూడా నియామకాలు జోరందుకుంటున్నాయి. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర సీఎంవో బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే చంద్రబాబు సీఎం గా ప్రమాణ స్వీకారం చేసే ముందు, తరువాత కీలక అధికారుల నియామక ఉత్తర్వులు వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే పూర్తిస్థాయిలో సీఎంవోను ప్రక్షాళన చేసి సొంత టీంను ఏర్పాటు చేసుకునే పనిలో చంద్రబాబు పడ్డారు.