CM Chandhrababu : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 70 రోజులు అవుతోంది. ఒక్క పింఛన్ల పెంపు తప్పించి.. ఇంతవరకు ఒక్క సంక్షేమ పథకం ప్రారంభం కాలేదు. మధ్యలో అన్న క్యాంటీన్లు ప్రారంభంతో ప్రజల్లో సంతృప్తి నింపే ప్రయత్నం చేశారు. కానీ సంక్షేమ పథకాలు విషయంలో మాత్రం తీవ్ర జాప్యం జరుగుతోంది. అదిగో ఇదిగో అంటూ కాలయాపనతో దాటవేస్తున్నారు.ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు చంద్రబాబు భారీగా హామీలు ఇచ్చారు. ముఖ్యంగా సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత కీలకమైన ఐదు ఫైళ్లపై సంతకాలు చేశారు. ఉపాధ్యాయ నియామక ప్రక్రియ చేపట్టనున్నట్లు ప్రకటించారు. అంతకుముందు వైసీపీ ప్రభుత్వం ప్రకటించిన ఉపాధ్యాయ పోస్టుల కంటే.. అధికంగా ప్రకటించి నోటిఫికేషన్ ఇస్తానని చెప్పారు. కానీ ఇంతవరకు నోటిఫికేషన్ రాలేదు. మరోవైపు 50 సంవత్సరాలకే బీసీ లబ్ధిదారులకు సామాజిక పింఛన్ అందిస్తానని హామీ ఇచ్చారు. దానికి కూడా అతిగతీ లేదు. 18 సంవత్సరాలు నిండిన మహిళలకు నెలకు 1500 రూపాయల చొప్పున అందిస్తామన్నారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం అన్నారు. అది కూడాఅమలు చేయలేదు. మరోవైపు ఖరీఫ్ సమయం దాటుతున్నా.. సాగు ప్రోత్సాహం కింద అందిస్తామన్న 20 వేల రూపాయలు కూడా ఇవ్వలేకపోయారు. మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం కసరత్తు కూడా ప్రారంభం కాలేదు. విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా.. పిల్లల చదువుకు అందిస్తామన్న 20వేల నగదు జాడలేదు. ఇలా పథకాలన్నీ పెండింగ్లో ఉంచి.. మైండ్ ను అభివృద్ధిపై పెట్టారు చంద్రబాబు. అసలు పథకాలు ప్రారంభిస్తారా? అందించగలరా? లేదా? అన్న అనుమానాలు రోజురోజుకు పెరుగుతున్నాయి.
* చేతులెత్తేసిన చంద్రబాబు
మరోవైపు సంక్షేమ పథకాల అమలు విషయంలో చంద్రబాబు పలుమార్లు చేతులెత్తేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని.. దారుణంగా దివాలా తీయించారని.. ప్రజలకు భారీగా హామీలు ఇచ్చానని.. వాటిని అసలు అమలు చేయగలనా? లేదా? అన్న అనుమానం వెంటాడుతోందని చంద్రబాబు బాహటంగానే ప్రకటించారు. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడం చాలా కష్టమని చెప్పుకొచ్చారు. అయితే హామీలు ఇచ్చినప్పుడు చంద్రబాబుకు ఈ విషయం తెలియదా? ఇది ముమ్మాటికి సంక్షేమ పథకాల నుంచి ప్రజలను డైవర్ట్ చేయడమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
*సంకేతాలు పంపుతున్న ఎమ్మెల్యేలు
మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యేలు, కీలకనాయకులు చేస్తున్న వ్యాఖ్యలు కూడా సంక్షేమ పథకాల అమలుపై అనుమానాలు రేకెత్తించేలా ఉన్నాయి. విశాఖ జిల్లా చోడవరం ఎమ్మెల్యే బాహటంగానే సంక్షేమ పథకాలపై వ్యాఖ్యానించారు. ఎవరు ఏమనుకున్నా సంక్షేమ పథకాలు వద్దని చంద్రబాబుకు చెప్పానని.. సంక్షేమ పథకాల ద్వారా వస్తున్న సొమ్ముతో ప్రజలు బిర్యాని తింటున్నారని.. ప్రజల అవసరాలు.. వారి మౌలిక వసతులు పెంచాలి తప్ప.. ఉచితాలు చాలా ప్రమాదకరమని ఆ ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. అయితే ప్రజలను మానసికంగా సిద్ధం చేసేందుకే చంద్రబాబు ఈ కొత్త ఎత్తుగడ వేశారన్న అనుమానాలు వినిపిస్తున్నాయి.
* సంపద సృష్టించి ఇస్తానన్నారు
సాధారణంగా చంద్రబాబు పథకాలు విషయంలో ప్రజలకు అపోహలు ఉన్నాయి. కానీ రాష్ట్రంలో సంపద సృష్టించి ప్రజలకు పంచి పెడతానని చంద్రబాబు హామీ ఇచ్చారు. అదే సమయంలో వైసీపీ ఎటువంటి అభివృద్ధి చేయలేదు. కేవలం సంక్షేమమే కాదు అభివృద్ధిని సైతం ప్రజలు కోరుకున్నారు. అందుకే వైసిపిని తిరస్కరించారు. కూటమిని ఆదరించారు. ఇప్పుడు చంద్రబాబు సైతం సంక్షేమం కంటే అభివృద్ధిపైనే పూర్తిగా ఫోకస్ పెట్టారు. కొద్ది రోజులు ఆగి సంక్షేమ పథకాలు ప్రారంభించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అప్పటివరకు ప్రజలకు ఎమ్మెల్యేల ద్వారా ఇలా సంకేతాలు పంపించక తప్పని పరిస్థితి అని విశ్లేషకులు సైతం ఒక అంచనాకు వస్తున్నారు. ప్రజల్లో కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తారన్న ఆశలు తొలగిపోతున్నాయి. చంద్రబాబు కూడా ఇదే కావాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తద్వారా అభివృద్ధికి జై కొడతారని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
.@JaiTDP కపట బుద్ధిని బయటపెట్టిన చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు
చంద్రబాబు అనవసరంగా సూపర్-6 అంటూ స్కీములు పెట్టారు. ప్రజల అకౌంట్లలో డబ్బులు వేయొద్దని చంద్రబాబుకి చెప్పాను
గత ప్రభుత్వం ప్రజలకి డబ్బులు వేస్తే బయటికి వెళ్లి బిరియానీలు తిన్నారు. దాంతో ఇంట్లోని ఆడవాళ్లు వంట… pic.twitter.com/Qu3NgZSlB1
— YSR Congress Party (@YSRCParty) August 21, 2024