Chandrababu: గత ఐదు సంవత్సరాలుగా చంద్రబాబు ఎన్ని రకాల ఇబ్బందులు పడ్డారో తెలియంది కాదు. 2019 ఎన్నికల్లో అధికారానికి దూరమైంది మొదలు.. ఆయనకు అడుగడుగున అవమానాలు, ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతూనే ఉన్నాయి. ఓటమితో నైరాశ్యంలోకి పార్టీ శ్రేణులు కూరుకుపోయాయి. మరోవైపు అధికార పార్టీ సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. ఉప ఎన్నికలు అయినా, స్థానిక సంస్థల ఎన్నికలైనా.. ఏ ఎన్నికలైనా వైసీపీ దే విజయం అన్నట్టు పరిస్థితి మారిపోయింది. మరోవైపు కేసులు, దాడులు.. ఇలా ఒకటేమిటి వైసిపి సర్కార్ ఉక్కు పాదం మోపింది. టిడిపి శ్రేణులు బయటకు రావడానికి భయపడిపోయారు. కానీ ఏడుపదుల వయసులో చంద్రబాబు సర్వశక్తులు వడ్డారు. బయటకు వచ్చి పోరాటం చేశారు. అటు పవన్ ఆయనకు అండగా నిలిచారు.. పవన్ బాధ్యత తీసుకోవడంతో బిజెపి జత కట్టింది. ఎన్నికల్లో విజయానికి టిడిపి కూటమి చేరువయ్యింది. కానీ ఈ ఐదేళ్లలో చంద్రబాబు జాగ్రత్తగా ప్రతి అడుగు వేశారు. సక్సెస్ ముంగిట నిలిచారు.
ఏపీలో మెజారిటీ సర్వేలు టిడిపి కూటమిదే అధికారం అని తేల్చేశాయి. కొన్ని ఎగ్జిట్ పోల్స్ అయితే ఏకపక్ష విజయం సాధించనుందని తేల్చి చెప్పాయి. అదే జరిగితే చంద్రబాబు సక్సెస్ అని ఏకాభిప్రాయంతో చెప్పవచ్చు. పార్టీ మనుషులకు ఇష్టం లేకపోయినా, కుటుంబ సభ్యులకు ఇష్టం లేకున్నా పవన్ కళ్యాణ్ కు చంద్రబాబు ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారు. చంద్రబాబు కోసం పవన్ ఎన్నో మెట్లు దిగిరాగా.. అదే స్థాయిలో చంద్రబాబు సైతం పవన్ కోసం చాలా రకాలుగా తగ్గాల్సి వచ్చింది. కుమారుడు లోకేష్, బావమరిది బాలకృష్ణను పక్కనపెట్టి మరి పవన్ కు ప్రాధాన్యత ఇవ్వాల్సి వచ్చింది. తనకు చంద్రబాబు ఇచ్చిన ప్రయారిటీని పవన్ సైతం గౌరవించారు. కూటమి కట్టడంలో, సీట్ల సర్దుబాటులో ఎక్కడా ఇబ్బందులు రాకుండా చూడడంలో పవన్ పాత్ర కీలకం. అలా పవన్ ను మలుచుకున్నారు చంద్రబాబు.
బిజెపితో పొత్తు అవసరమా అని సగటు టిడిపి అభిమాని చంద్రబాబును ప్రశ్నించినంత పని చేశారు. అనుకూల మీడియా సైతం చంద్రబాబును తప్పు పట్టింది. ఒక్క పర్సంటేజ్ ఓటు లేని బిజెపికి అన్ని సీట్లు అవసరమా అని ప్రశ్నించిన వారు ఉన్నారు. కానీ బిజెపి అవసరం ఎలా ఉంటుందో చంద్రబాబుకు తెలుసు. తన నుంచి చేజారి పోతే ఎలా నష్టపోతామో తెలుసు. అందుకే బిజెపిని దగ్గర చేసుకునేందుకు ఆయన చేయని ప్రయత్నం లేదు. 2019 ఎన్నికల్లో ఓడిపోయిన మరుక్షణం నుంచి బిజెపి కోసం చంద్రబాబు ఎంత పరితపించారో తెలియంది కాదు. పిలిచినా పిలవకపోయినా.. కోరినా కోరకపోయినా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ వచ్చారు. అధికారానికి దూరమైన మరుక్షణం తన వద్ద ఉన్న నలుగురు రాజ్యసభ సభ్యులను బిజెపిలోకి పంపించారు. అప్పటి నుంచే తనదైన వ్యూహం రూపొందించుకున్నారు. అసలు టిడిపితో కలిసి ఉదేశ్యం లేదని బిజెపి నేతలు అసహ్యించుకున్నా.. చంద్రబాబు భగీరథ ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఒకవైపు పవన్ కళ్యాణ్ ను, మరోవైపు సమీప బంధువు పురందేశ్వరిని ప్రయోగించిపొత్తు పెట్టుకున్నారు.మూడు పార్టీల మధ్య ఓట్ల బదలాయింపు జరిగేలా ప్రత్యేక వ్యూహాన్ని రూపొందించుకున్నారు. ఈ ఓట్ల బదలాయింపు సక్రమంగా జరగడం వల్లే కూటమి భారీ మెజారిటీతో అధికారంలోకి రాబోతుందని.. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కట్టడం విశేషం. అయితే ఈ విషయంలో చంద్రబాబు పోషించిన పాత్రను ఎక్కువమంది గుర్తు చేసుకుంటున్నారు.