CM Chandrababu : టీటీడీ లడ్డు వివాదంపై సిట్ విచారణ చేపడుతున్న సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు స్పందనతో ఏపీ ప్రభుత్వం సిట్ విచారణను నిలిపివేసింది. డిజిపి ద్వారక తిరుమలరావు సిట్ విచారణ నిలిపివేతను ధ్రువీకరిస్తూ ప్రకటన జారీ చేశారు. తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా.. స్వామివారి లడ్డు ప్రసాదంలో జంతు కొవ్వు, చేప నూనె కల్తీ చేసినట్టు వస్తున్న ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం సిట్ దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదుల సూచన మేరకు సిట్ విచారణను నిలిపివేసినట్లు డీజీపీ చెప్పుకొచ్చారు. తిరుమలలో తయారీకి సంబంధించి నెయ్యిలో జంతు నూనె వాడారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో సంచలన ప్రకటన చేశారు. అక్కడ నుంచి రచ్చ ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాదిమంది హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా తిరుమలలో పై ప్రచారం సాగింది. అటు వైసీపీ సైతం స్ట్రాంగ్ గా రియాక్ట్ అయింది. దీంతో ఇది రాజకీయ అంశంగా మారిపోయింది. ఈ తరుణంలోనే చంద్రబాబు సర్కార్ సీనియర్ ఐపీఎస్ అధికారి, గుంటూరు రేంజ్ ఐజి సర్వ శ్రేష్ట త్రిపాఠి ఆధ్వర్యంలో అత్యున్నత దర్యాప్తు బృందం సిట్ ను ఏర్పాటు చేశారు. అయితే దీనిని సిబిఐతో దర్యాప్తు చేయించాలని వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి, బిజెపి మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అత్యున్నత న్యాయస్థానం చాలా రకాల అభ్యంతర వ్యాఖ్యలు చేసింది. సిట్ దర్యాప్తు అవసరం పై మాట్లాడింది. సొలిసిటర్ జనరల్ అభిప్రాయాన్ని కోరింది. ఈనెల 3కు కేసు విచారణను వాయిదా వేసింది.
* అభ్యంతరాలు వ్యక్తం చేసిన అత్యున్నత న్యాయస్థానం
సీఎం హోదాలో చంద్రబాబు లడ్డు వివాదాన్ని తెరపైకి తేవడానికి.. బహిరంగంగా వ్యక్తపరచడాన్ని తప్పు పట్టింది సుప్రీం కోర్ట్. ఎటువంటి ఆధారాలు లేకుండా బయట పెట్టడమే కాదు.. సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించింది. అదే సీఎం సిట్ ఏర్పాటుపై అనుమానాలు వచ్చేలా మాట్లాడింది. ఈ తరుణంలో సిట్ దర్యాప్తు నిలిపి వేయడమే ఉత్తమమని రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే సిట్ నిలిపివేసినట్లు స్వయంగా డీజీపీ ప్రకటించడం విశేషం. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటుందా? అన్న అనుమానం కలుగుతోంది. ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు భాగంగానే సిట్ దర్యాప్తును నిలిపివేసినట్లు ప్రచారం సాగుతోంది.
* తొలి విడత విచారణ పూర్తి
అయితే నిన్న సుప్రీంకోర్టు స్పందించిన నేపథ్యంలో సిట్ బృందం తిరుమలలో కీలక పరిశీలనలు చేసింది. గుంటూరు రేంజ్ ఐజి సర్వ శ్రేష్ట త్రిపాఠి ఆధ్వర్యంలో డి ఐ జి గోపీనాథ్ జెట్టి, కడప జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, తిరుపతి అదనపు ఎస్పీ వెంకట్రావు, డిప్యూటీ ఎస్పీలు సీతారామారావు, శివ నారాయణ స్వామి, సత్యనారాయణ, ఉమామహేశ్వర్, సూర్యనారాయణలతో కూడిన టీం విచారణ చేపట్టింది. టీటీడీకి చెందిన ఫ్లోర్ మిల్, లేబరేటరీ, మార్కెటింగ్ కార్యాలయం, శ్రీవారి పోటును అధికారులు తనిఖీ చేశారు. నెయ్యి నమూనాలను సేకరించారు.
* డిజిపికి నివేదిక
దాదాపు సిట్ బృందం నాలుగు రోజులు పాటు విచారణ చేపట్టింది. దాదాపు తొలి విడత సిట్ విచారణ ముగిసినట్లు అయింది. ఈ నివేదికను ఇప్పటికే డీజీపీకి అందించారు. అయితే ఇంతలో సుప్రీంకోర్టు భిన్నంగా స్పందించడం, సిబిఐ ఎంటర్ కావచ్చు అన్న అనుమానాలతో సిట్ దర్యాప్తును నిలిపివేసినట్లు తెలుస్తోంది. గురువారంమళ్లీ సుప్రీంకోర్టు విచారణ చేపట్టనున్న నేపథ్యంలో.. ఆ తరువాత వెలువడే ఉత్తర్వుల మేరకు సిట్ నిర్ణయాలు తీసుకోవచ్చన్న అభిప్రాయం వినిపిస్తోంది.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read More