Chandrababu Naidu : సీఎం చంద్రబాబు( CM Chandrababu) జిల్లా పర్యటనలు చాలా తేలిగ్గా జరుగుతున్నాయి. అసలు ఆయన మా జిల్లాకు వచ్చాడా? అని తెలియకుండానే పర్యటనలు ముగుస్తున్నాయి. అసలు సీఎం వస్తే ఎలా ఉండాలి? సీఎం వస్తే బస్సులు మళ్ళించాలి. జనాలను తరలించాలి. రోడ్డుకు అడ్డంగా ఉన్న చెట్లు నరికి వేయాలి. శాఖల వారీగా లబ్ధిదారులకు మెసేజ్లు పంపాలి. వారు కచ్చితంగా సమావేశానికి హాజరు కావాలని ఆదేశాలు ఇవ్వాలి. ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటించి వారి బస్సులను జనాలను తరలించేందుకు వాడుకోవాలి. ఏపీఎస్ఆర్టీసీ బస్సులను దారిమల్లించాలి. ఒకవేళ జనం రాకుంటే విద్యుత్ సరఫరాను నిలిపివేయాలి. కానీ ఇవేవీ చేయకుండానే సీఎం చంద్రబాబు జిల్లాల పర్యటనను ముగిస్తున్నారు. వెళ్తే ఒక ఊరికే పరిమితం అవుతున్నారు. వారి మధ్యనే సంక్షేమ పథకాలను, అభివృద్ధి పనులను చేపట్టి తిరిగి వెళ్ళిపోతున్నారు.
* ఆకాశమార్గంలో జగన్..
వైసీపీ హయాంలో సీఎం గా ఉన్న జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ) తొలి రెండేళ్లు తాడేపల్లి ప్యాలెస్ నుంచి అడుగు బయట పెట్టలేదు. తరువాత జిల్లాల పర్యటనకు విచ్చేశారు. ఆయన ఆకాశమార్గంలో వస్తుంటే రోడ్డు మార్గంలో ట్రాఫిక్ నిలిపివేసేవారు. రాజధాని నుంచి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతానికి వెళ్లాలన్న ఆకాశమార్గాన్ని ఎంచుకునేవారు. సీఎం వస్తున్నారంటే రోడ్డుకు అడ్డంగా పరదాలు కట్టేవారు. భారీ కేడ్లు ఏర్పాటు చేసేవారు. క్రీడ మైదానాల్లో కాకుండా రహదారుల పైనే సభలు, సమావేశాలు ఏర్పాటు చేసేవారు. రోడ్డు మార్గం గుండా అస్సలు ఇష్టపడేవారు కాదు. ప్రైవేటు కార్యక్రమానికైనా హెలిక్యాప్టర్ నే వాడేవారు. కానీ చంద్రబాబు ఎందుకో ఈ విధానాలన్నింటికీ ముగింపు పలికారు. చాలా సింపుల్ గా, ఎటువంటి జన సమీకరణ చేయకుండానే తన కార్యక్రమాలను ముగించేస్తున్నారు.
* హడావిడి లేకుండా..
కూటమి( Alliance) అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛన్లను మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలకు పెంచారు. మూడు నెలల బకాయిలతో సహా గత ఏడాది జూలైలో చెల్లించారు. అప్పటినుంచి ప్రతి నెల పింఛన్లు అందించేందుకు ఏదో ఒక జిల్లాకు వెళ్తున్నారు చంద్రబాబు. కానీ అలా జిల్లాలకు వెళ్తున్న క్రమంలో ఒక్క గ్రామానికి మాత్రమే పరిమితం అవుతున్నారు. పక్క గ్రామానికి తెలియకుండానే చంద్రబాబు పర్యటన ముగుస్తోంది. అంటే జన సమీకరణ లేనట్టే కదా. చంద్రబాబు వెళ్తున్న జిల్లాల్లో యధావిధిగా ఆర్టీసీ బస్సులు తిరుగుతున్నాయి. పాఠశాలలు మూతపడడం లేదు. ప్రైవేటు బస్సులలో జనాలను తరలించే అవసరము లేదు. మొన్నటికి మొన్న అన్నదాత సుఖీభవ పథకం నిధుల విడుదలకు ప్రకాశం జిల్లా వీరయ్యపాలెం వెళ్లారు చంద్రబాబు. అక్కడ కూడా రైతుల సమక్షంలో పొలంలో.. నులక మంచం పై కూర్చుని మాట్లాడారు. రైతులతో మమేకం అయ్యారు. ఏంటి బిల్ క్లింటన్ తో సమావేశమైన చంద్రబాబు ఈయనేనా? ప్రధాని మోదీకి సన్నిహితుడేనా? మరి ఇంత హుందా తనమా అనే ఆశ్చర్యపోయిన వారు ఉన్నారు. అయితే ఒకటి మాత్రం నిజం. జగన్ వస్తున్నాడు అంటే జనం బెంబేలెత్తిపోయేవారు. కానీ ఇప్పుడు చంద్రబాబు వస్తున్నారంటే ఇంటికి వచ్చే సామాన్య అతిథిగా భావిస్తున్నారు. మేధావులతో పాటు విద్యావేత్తలు ఈ విషయాన్ని గమనిస్తున్నారు. చంద్రబాబు చర్యలను తటస్తులు ఆహ్వానిస్తున్నారు.
* కూటమి వచ్చిన తర్వాత సంస్కరణ..
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు చాలా విధానాలను సంస్కరించారు. తొలిసారిగా తిరుమల వెళ్లేసరికి వర్షం పడుతోంది. ఆ సమయంలో టీటీడీ అధికారులు ఏకంగా పరాదాలు కట్టారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు చంద్రబాబు. గతం మాదిరిగా పరదాలు కడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తనకోసం విజయవాడ నగరంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ వద్దంటూ సూచించారు. కొద్దిసేపు మాత్రమే ట్రాఫిక్ ను నిలిపివేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ గ్రామానికి వెళ్లాలనుకున్న రోడ్డు మార్గాన్ని ఆశ్రయిస్తున్నారు. ఎక్కడ జన సమీకరణ వద్దు అని ఆదేశిస్తున్నారు. ప్రజల దైనందిన జీవితానికి ఇబ్బందులు వద్దని కూడా సూచిస్తున్నారు. అయితే గతంలో బలప్రదర్శన, జన సమీకరణ, దుబారా ఖర్చు ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి లేదు. రాబోదు అని చంద్రబాబు సంకేతాలు ఇస్తున్నారు. అయితే చెడు వేగంగా జనంలోకి వెళ్లినట్లు.. మంచి వెళ్లడం లేదనేది ఒక బాధ. అయితే నిజం నిలకడగా తెలుస్తుంది అంటారు. ప్రస్తుతం చంద్రబాబు పర్యటనల విషయంలో కచ్చితంగా విద్యావేత్తలు, తటస్తులు గమనిస్తారని కూడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.