Homeఆంధ్రప్రదేశ్‌CM Chandrababu: వైసిపి పాలనను కేస్ స్టడీగా చూపిస్తున్న చంద్రబాబు

CM Chandrababu: వైసిపి పాలనను కేస్ స్టడీగా చూపిస్తున్న చంద్రబాబు

CM Chandrababu: ఎన్నికల్లో విజయం అనేది బరువైనది. ఆ బరువును సక్రమంగా మోస్తేనే ప్రజలు గుర్తించేది. లేకుంటే మాత్రం తిరస్కరణ ఖాయం.2014 నుంచి 2019 మధ్య ఒక పార్టీ ఎలా ఉండాలో కూడా తెలియజెప్పింది వైసిపి. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా ఉండకూడదు కూడా గుణపాఠాలు నేర్పించింది అదే వైసిపి.తాను చేసిన పాదయాత్ర, తన చరిష్మతోనే అధికారంలోకి వచ్చానని జగన్ భావించారు. అందుకే ఇష్టారాజ్యంగా పాలించారు. అది ప్రజలకు నచ్చలేదు. అందుకే 151 స్థానాలు ఇచ్చిన ప్రజలు..11 స్థానాలకు పరిమితం చేశారు. గెలిపించింది మేమే.. ఓడించిందీ కూడా మేమేనంటూ హెచ్చరికలు పంపారు.

2019లో వైసీపీ అధికారంలోకి రావడానికి.. అంతకుముందున్న టిడిపి ప్రభుత్వం చేసిన తప్పిదాలే కారణం. కానీ ఆ విషయాన్ని మరిచి పోయింది వైసిపి. టిడిపి చేసిన తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకోవాల్సింది పోయి.. అంతకుమించి తప్పులు చేసింది. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ మాత్రం వైసిపి నుంచి చాలా విషయాలను నేర్చుకుంది. 2014 నుంచి 2019 మధ్య వైసీపీ రాజకీయ వ్యూహాలనే అమలు చేసింది టిడిపి. 2019 నుంచి 2024 మధ్య ప్రతిపక్ష పాత్ర పోషించింది. దారుణ పరాజయం నుంచి అధికారం దక్కించుకునేందుకు ఆ పార్టీ చేసిన పోరాటం అంతా ఇంతా కాదు. కానీ పోరాడి గెలుచుకున్న గెలుపును తేలికగా తీసుకుంది వైసిపి. తప్పుల మీద తప్పులు చేస్తూ ప్రజాగ్రహానికి గురైంది. అధికారానికి దూరమైంది.

ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి కనీవినీ ఎరుగని విజయం దక్కింది. తెలుగుదేశం చరిత్రలోనే ఇంతటి విజయం గతంలో ఎన్నడూ దక్కలేదు. తన 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఇలాంటి విజయభారం చంద్రబాబు ఎన్నడు మోయలేదు. అందుకే జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు చంద్రబాబు. ప్రజల నమ్మకాన్ని నిలుపుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. వైసీపీ హయాంలో జరిగిన తప్పులను గుర్తించే పనిలో పడ్డారు. ఆ తప్పులు జరగకుండా చూడాలని భావిస్తున్నారు. ముఖ్యంగా రివేంజ్ రాజకీయాలు, పగలు ప్రతీకారాలు తగ్గించాలని చూస్తున్నారు. ప్రత్యర్థులపై రాజకీయాలు చేయాలని భావిస్తున్నా.. ప్రజలకు తప్పులుగా కనిపించేలా చేయకూడదని పార్టీ శ్రేణులకు సూచిస్తున్నారు. గత ప్రభుత్వంలో ఉన్న దుబారా ఖర్చులను ఇప్పుడు తగ్గిస్తున్నారు. ప్రాధాన్యత ప్రాజెక్టులకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. అమరావతి, పోలవరం ప్రాజెక్టులను వీలైనంత త్వరగా పూర్తిచేయాలన్న భావనతో కష్టపడుతున్నారు.

ఒక ఓటమి ఎంత ఇబ్బంది పెడుతుందో చంద్రబాబుకు తెలుసు. అందుకే ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని పార్టీ శ్రేణులకు సూచిస్తున్నారు. ప్రజలతో మమేకమై పనిచేయాలని మంత్రులకు సూచిస్తున్నారు. సంక్షేమ పథకాల అమలును వేగవంతం చేస్తున్నారు. ప్రజలకు వాస్తవాలు తెలియజెప్పే విధంగా చూస్తున్నారు. అందులో భాగంగానే శ్వేత పత్రాలు విడుదల చేస్తున్నారు. గత ప్రభుత్వంలో శాఖల పరంగా జరిగిన విధ్వంసాలు, అవినీతిని వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. వాటిని ప్రజల ముందు పెడుతున్నారు. సంక్షేమం మాటున ఎంత దోచుకున్నారో చెబుతున్నారు. తద్వారా ప్రజలు వాస్తవాలు తెలుసుకునేలా చేస్తున్నారు. అదే సమయంలో సొంత పార్టీ శ్రేణులతో పాటు కూటమి పార్టీలకు బలమైన సంకేతాలు పంపుతున్నారు. వైసీపీ శ్రేణులు చేసిన తప్పిదాలు.. మరోసారి జరగకుండా చూడాలని సూచిస్తున్నారు. మొత్తానికైతే వైసీపీ పాలనను చంద్రబాబు ఒక కేస్ స్టడీగా తీసుకోవడం విశేషం.

ప్రచార ఆర్భాటాలకు దూరంగా ఉండాలని సూచించడం కూడా ఖర్చును తగ్గించుకోవడమే. 2026 మే 31 వరకు ప్రభుత్వ కార్యాలయాల్లో ఫర్నిచర్ కొనుగోలు నిషేధమని ప్రత్యేక ఉత్తర్వులు ఇచ్చారు చంద్రబాబు. అంటే పొదుపు మంత్రాన్ని ఏ స్థాయిలో పాటిస్తున్నారో అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు స్వీకరించారు. నాలుగు మంత్రిత్వ శాఖలను నిర్వర్తిస్తున్నారు. ప్రత్యేకంగా క్యాంపు కార్యాలయాన్ని రూపొందించారు. కానీ ఆ కార్యాలయంలో ప్రభుత్వపరంగా ఫర్నిచర్ ఏర్పాటును పవన్ తిరస్కరించారు. తానే సొంతంగా ఫర్నిచర్ సమకూర్చుకున్నారు. ఇప్పుడు అదే ఫార్ములాను అనుసరిస్తూ చంద్రబాబు సైతం రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయడం విశేషం. అంటే ప్రభుత్వానికి, ప్రజలకు మంచి జరుగుతుందనుకుంటే.. ఎవరు ఇచ్చిన సలహా కైనా చంద్రబాబు ఆమోదం తెలుపుతుండడం విశేషం. మారిన వైఖరికి నిదర్శనం.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular