Chandhrababu: చంద్రబాబు రాజకీయ కసరత్తు ప్రారంభించారు. ఒకవైపు టీటీడీ లడ్డు వివాదం కొనసాగుతుండగానే నామినేటెడ్ పోస్టులు ప్రకటించారు. ఆగస్టులోనే ప్రకటిస్తారని ప్రచారం జరిగింది. కానీ రకరకాల అడ్డంకులతో వాయిదా పడుతూ వస్తోంది. ఇంతలో విజయవాడకు వరదలు ముంచేత్తాయి. వరద సహాయ చర్యల్లో పాల్గొనడంతో కొద్దిరోజుల పాటు నామినేటెడ్ పదవుల భర్తీకి బ్రేక్ పడింది. అయితే తాజాగా 20 కార్పొరేషన్ పదవులను భర్తీ చేశారు చంద్రబాబు. టిడిపికి అధిక పదవులు కేటాయించారు. జనసేన తో పాటు బిజెపికి భాగస్వామ్యం కల్పించారు. ఈ తరుణంలో రాజ్యసభ పదవులపై దృష్టి పెట్టినట్లు సమాచారం. వైసీపీకి చెందిన మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు రాజ్యసభ సభ్యత్వం తో పాటు వైసీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో రాజ్యసభ సభ్యుడు కృష్ణయ్య సైతం రాజీనామా చేశారు. దీంతో ఈ మూడు రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. టిడిపి కూటమికి స్పష్టమైన బలం ఉండడం కు ఈ మూడు సీట్లను కూటమి దక్కించుకునే ఛాన్స్ ఉంది. అయితే ఈ మూడు రాజ్యసభ పదవులు ఎవరికి ఇస్తారు? అన్నది హాట్ టాపిక్. టిడిపి మాత్రమే ఈ మూడు స్థానాలు తీసుకుంటుందా? జనసేన కు సర్దుబాటు చేస్తుందా? లేకుంటే జాతీయ పార్టీ అయిన బిజెపికి కేటాయిస్తుందా? అన్నది తెలియాల్సి ఉంది. అయితే విశ్వసనీయ సమాచారం మేరకు టిడిపి రెండు రాజ్యసభ సీట్లు తీసుకుంటుందని.. జనసేనకు ఒకటి కేటాయిస్తుందని.. బిజెపికి ఎమ్మెల్సీ పోస్ట్ సర్దుబాటు చేస్తుందని తెలుస్తోంది.
* వైసీపీకి మాత్రమే ప్రాతినిధ్యం
ప్రస్తుతం ఏపీ నుంచి రాజ్యసభలో ఒక్క వైసీపీకి మాత్రమే ప్రాతినిధ్యం ఉంది. ఇతర పార్టీలకు రాజ్యసభలో కనీస ప్రాతినిధ్యం లేదు. అత్యధిక స్థానాలతో అధికారంలోకి వచ్చిన టిడిపి కూటమికి ఇది లోటే. రాష్ట్రంలో ఓడిపోయిన వైసీపీకి రాజ్యసభలో 11 మంది సభ్యుల బలం ఉండేది. అయితే ఆ పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీలు రాజీనామా చేశారు. ఈ విషయంలో టిడిపి కూటమి వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో.. వైసీపీ ఎంపీలు రాజీనామా చేశారన్నది బహిరంగ రహస్యం.తద్వారా వైసిపి బలం 8 కి తగ్గింది. కూటమి పార్టీల బలం మూడుకు చేరనుంది. ఇంకా వైసీపీ నుంచి ఇద్దరు ముగ్గురు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. అదే జరిగితే వైసీపీ బలం తగ్గిపోవడం ఖాయం.
* ఉప ఎన్నిక అనివార్యం
ప్రస్తుతం ఖాళీ అయిన మూడు రాజ్యసభ సీట్లకు ఉప ఎన్నిక అనివార్యం. దీంతో అందులో రెండు స్థానాలు టీడీపీ తీసుకుంటుందని.. మరో సీటు జనసేనకు కేటాయిస్తుందని ప్రచారం జరుగుతోంది. ఇక టిడిపి నుంచి రాజ్యసభ ఆశావహులు చాలామంది ఉన్నారు. కానీ చంద్రబాబు మాత్రం ఇద్దరిని ఎంపిక చేసినట్లు టాక్ నడుస్తోంది. గుంటూరు మాజీ ఎంపీ గల్లా జయదేవ్ కు రాజ్యసభకు పంపిస్తారని ఒక టాక్ ఉంది. ఎన్నికల ముందు క్రియాశీలక రాజకీయాలనుంచి తప్పుకున్నారు గల్లా జయదేవ్. వైసిపి ప్రభుత్వ అరాచకాలు, వేధింపులతో ఆ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈసారి గుంటూరు నుంచి పోటీ చేసి ఉంటే గల్లా జయదేవ్ ఎంపీ కావడం ఖాయం. ఆయన కేంద్ర క్యాబినెట్లో సైతం చోటు దక్కించుకునేవారు. ఆయన స్థానంలో పోటీ చేసిన పెమ్మసాని చంద్రశేఖర్ కు ఆ అవకాశం దక్కింది. అయితే పార్టీ క్లిష్ట సమయంలో అండగా ఉన్న జయదేవ్ కు పెద్దల సభకు పంపిస్తే న్యాయం చేస్తారని చంద్రబాబు భావిస్తున్నారు.
* అశోక్ కు ఖాయం
మరోవైపు కేంద్ర మాజీ మంత్రి, టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు అశోక్ గజపతిరాజుకు రాజ్యసభ పదవి ఖాయమని ప్రచారం సాగుతోంది. టిడిపి ఆవిర్భావం నుంచి సేవలందిస్తున్నారు అశోక్ గజపతిరాజు. ఏపీలో టిడిపి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రతిసారి మంత్రి పదవి దక్కించుకునేవారు. 2014లో మాత్రం విజయనగరం ఎంపీగా పోటీ చేసి గెలిచారు. కేంద్రమంత్రి అయ్యారు. అయితే ఈసారి పోటీ నుంచి తప్పుకున్నారు. తన కుమార్తెను ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. అయితే వయసు రీత్యా ఆయనకు గౌరవప్రదమైన రిటైర్మెంట్ అవసరం. గవర్నర్ పోస్ట్ కేటాయిస్తారని ప్రచారం జరిగింది. కానీ చివరకు రాజ్యసభ పదవి ఇస్తారని తెలుస్తోంది.
* జనసేన నుంచి మెగా బ్రదర్
జనసేనకు కేటాయించిన ఒక రాజ్యసభ పదవిని మెగా బ్రదర్ నాగబాబు కు కేటాయించేందుకు పవన్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. జనసేనకు నాగబాబు విశేష సేవలు అందించారు. 2019 ఎన్నికల్లో నరసాపురం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో అనకాపల్లి నుంచి పోటీ చేస్తారని ప్రచారం సాగింది. సన్నాహాలు కూడా చేశారని టాక్ నడిచింది. కానీ పొత్తులో భాగంగా ఈ సీటును బిజెపికి కేటాయించడంతో నాగబాబు డ్రాప్ అయ్యారు. ఎన్నికల్లో కూటమి గెలుపునకు కృషి చేశారు. ప్రస్తుతం పవన్ రాష్ట్ర రాజకీయాల్లో ఉండడంతో.. నాగబాబుకు రాజ్యసభ పదవి కేటాయిస్తే కేంద్రంలో చక్రం తిప్పే ఛాన్స్ ఉంటుందని పవన్ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. మొత్తానికి అయితే వైసీపీ ఖాళీ చేసిన ఆ మూడు రాజ్యసభ స్థానాలు దాదాపు భర్తీ అయినట్టే