CM Chandrababu : కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని ఏటా కోట్లాదిమంది భక్తులు దర్శించుకుంటారు. ప్రతిరోజు లక్షలాదిమంది భక్తుల తాకిడి ఉంటుంది. ఇంతటి భక్తుల రద్దీ ఉన్నది ప్రపంచంలో ఉన్న ఏకైక దేవాలయంగా టిటిడి గుర్తింపు పొందింది. అయితే ఇటీవల టీటీడీ చుట్టూ జరుగుతున్న వివాదాలు భక్తుల్లో ఒక రకమైన ఆందోళన రేకెత్తిస్తున్నాయి.అందుకే తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తిరుమలలో విఐపి సంస్కృతి తగ్గించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సమాచారం. ఆ సంస్కృతి తోనే ఇబ్బంది అవుతున్నాయి.ఎన్నెన్నో లోపాలు వెలుగులోకి వస్తున్నాయి. అందుకే వాటి కట్టడికి ప్రత్యేక చర్యలకు ఉపక్రమించింది కూటమి ప్రభుత్వం.శనివారం తిరుమలను సందర్శించారు చంద్రబాబు దంపతులు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం టిటిడి అతిధి గృహంలో అధికారులతో సమీక్షించారు సీఎం చంద్రబాబు. తిరుమల కొండపై గోవింద నామస్మరణ తప్ప మరో మాట వినిపించకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రశాంతతకు ఎక్కడా భంగం వాటిల్లకూడదని.. ఈ విషయంలో టిటిడి అధికారులు రాజీ పడవద్దని కూడా చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం విశేషం.
* నీటి ఎద్దడి పై ఫోకస్
ఇటీవల తిరుమలలో నీటి ఎద్దడి తలెత్తిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు సీఎం చంద్రబాబు. భవిష్యత్తు నీటి అవసరాలకు ముందస్తు ప్రణాళిక వేసుకోవాలని కూడా సూచించారు.అటవీ సంస్కరణ, అడవుల విస్తరణకు ప్రణాళికతో పని చేయాలని.. తిరుమలలోని అటవీ ప్రాంతాన్ని 72% నుంచి 80 శాతానికి పెంచాలని టీటీడీ అధికారులను ఆదేశించారు. అదే సమయంలో తిరుమల కొండ పరిసర ప్రాంతాల్లో అటవీ సంరక్షణ కోసం తీసుకుంటున్న చర్యల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీలో వీఐపీ సంస్కృతి గురించి చర్చకు వచ్చింది. సాధారణంగా తిరుమలను వీఐపీ భక్తులు దర్శిస్తుంటారని.. అటువంటి వారు వచ్చినప్పుడు ఎటువంటి హడావిడి చేయవద్దని చంద్రబాబు సూచించారు.
* లడ్డూ నాణ్యతను పెంచాలి
తిరుమలలో వివాదం తలెత్తిన నేపథ్యంలో.. ఎటువంటి లోపాలు వెలుగు చూడకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. వీలైనంతవరకు లడ్డు నాణ్యతను పెంచేలా చర్యలు చేపట్టాలని..తగ్గితే మాత్రం సహించేది లేదని హెచ్చరించారు. దేశ విదేశాల నుంచి తిరుమలకు వచ్చే భక్తులను గౌరవించాలని.. వారి పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తిరుమల కొండపై ఎటువంటి ఆర్భాటాలు వద్దని.. అనవసర ఖర్చులు కూడా తగ్గించుకోవాలని సూచించారు. ప్రతి భక్తుడు సంతృప్తికరంగా స్వామివారిని దర్శించుకునేలా చర్యలు చేపట్టాలని కూడా ఆదేశించారు చంద్రబాబు. ఈ విషయంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి బాధ్యతలు తీసుకోవాలని కూడా చంద్రబాబు సూచించారు. మొత్తానికైతే తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గాలన్న చంద్రబాబు కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.