AP Government: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటుతోంది.75 రోజులు సమీపిస్తున్నాయి. అయితే పాలన పరంగా ఎటువంటి సంచలనాలు లేకున్నా..ఈ రెండున్నర నెలల కాలంలో మాత్రం పలు సంచలన ఘటనలు చోటుచేసుకున్నాయి.వీటిని అడ్డుకునేందుకు ప్రభుత్వం చాలా రకాల ప్రయత్నాలు చేసినా వీలుపడలేదు.అందుకే సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు.మరోసారి ఇలాంటి ఘటనలు జరిగితే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. అన్ని శాఖల అధిపతులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. జూన్ 4న రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు వచ్చాయి.కూటమి ప్రభుత్వం ఏకపక్ష విజయాన్ని సొంతం చేసుకుంది. 12న సీఎంతో పాటు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. పాలనసైతం ప్రారంభం అయ్యింది. అప్పటినుంచి పలు శాఖలో ఫైళ్లు దగ్ధమవుతున్నాయి. చాలా చోట్ల ఫైళ్లను పోగులుగా చేసి దహనం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన అధికారుల ఆదేశాలతోనే ఫైళ్లను దగ్ధం చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. బాధ్యులపై కేసులకు ఉపక్రమిస్తున్నా ఈ ఫైళ్ళ దహనం ఆగడం లేదు.తాజాగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఫైళ్లను దగ్ధం చేశారు. దీనిని ప్రభుత్వం గుర్తించి సీరియస్ గా తీసుకుంది.దర్యాప్తునకు ఆదేశించింది. అయితే ఇలా ఉదాసీనంగా ఉంటే ఇటువంటివి మరింత పెరుగుతాయని భావిస్తోంది.అందుకే బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించింది.
* దాని వెనుక పెద్ద కుట్ర
రాష్ట్రంలో ఫైళ్ల దగ్ధం వెనుక పెద్ద కుట్ర నడుస్తోంది. తొలుత మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్లను పోగు చేసి తగులబెట్టారు. ముఖ్యంగా బీ పట్టా భూములు ఫ్రీ హోల్డ్ లోకి వచ్చి.. బినామీల పేరిట చేతులు మారిపోయాయి అన్న ఆరోపణలు ఉన్నాయి. సరిగ్గా అవే ఫైళ్లు దగ్ధం కావడంతో అనుమానాలు మరింత నిజమయ్యాయి. దీని వెనుక అప్పటి మాజీ మంత్రి హస్తం ఉందని.. దర్యాప్తులో అడ్డగోలుగా దొరికిపోతామని భావించి ఈ ఫైళ్లను దహనం చేసినట్లు తెలుస్తోంది.
* అప్పటి అధికారుల పాత్ర
అయితే ఒక్క మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలోనే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా చాలాచోట్ల ఫైళ్లు దహనమయ్యాయి. అయితే ఈ దహనం వెనుక అప్పటి అధికారులు, ప్రజాప్రతినిధుల హస్తం ఉందన్న ఆరోపణలు వచ్చాయి. ప్రతి నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం సమీక్షిస్తున్న వేళ.. అడ్డగోలుగా దొరికిపోతామని భావిస్తున్న వారే ఈ ఫైళ్ల కు నిప్పంటిస్తున్నారు. అంతకుముందు కాలుష్య నియంత్రణ మండలి ఫైళ్లను సైతం దహనం చేశారు. తాజాగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఫైళ్లను సైతం తగులబెట్టారు.
* సీరియస్ గా దృష్టి పెట్టిన ప్రభుత్వం
అయితే తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి పెట్టింది. ఉన్నతాధికారులకు సమాచారం లేకుండా ఫైళ్లను దహనపరిస్తే కఠిన చర్యలకు దిగుతామని హెచ్చరించారు. ఒకవేళ ఉన్నతాధికారులు ఆదేశిస్తే సంబంధిత ఫైళ్లను.. ఆన్లైన్లో నమోదు చేసి.. పూర్తిస్థాయిలో అనుమతులు తీసుకున్న తరువాత దహనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళదహనం చేయాలనుకుంటే వాటిని స్కాన్ చేసి కంప్యూటర్లలో సేవ్ చేసిన తర్వాతే కిందిస్థాయి సిబ్బందికి ఆదేశాలు ఇవ్వాలని స్పష్టం చేశారు.