AP Social Schemes : చంద్రబాబు సర్కార్ ఎన్నికల హామీలు అమలు దిశగా అడుగులు వేస్తోంది.ఈ ఎన్నికల్లో భారీగా సంక్షేమపథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా సూపర్ సిక్స్ పేరిట హామీ ఇచ్చారు. అందులో రెండు ప్రధానమైన పథకాలు అమలు చేసేందుకు కార్యాచరణ ప్రారంభించినట్లు తెలుస్తోంది. అమ్మకు వందనం,అన్నదాత సుఖీభవ పథకాలకు చంద్రబాబు సర్కార్ ముహూర్తం నిర్ణయించినట్లు సమాచారం. కూటమి అధికారంలోకి వచ్చి మూడు నాలుగు నెలలు దాటుతోంది.అయితే ఇంతవరకు ప్రధాన సంక్షేమ పథకాలు ప్రారంభం కాలేదు. పింఛన్ మొత్తాన్ని పెంచి అందిస్తూ వస్తున్నారు. అన్న క్యాంటీన్లను ప్రారంభించి ఐదు రూపాయలకే భోజనం పెడుతున్నారు. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేశారు.ఉపాధ్యాయ నియామక ప్రక్రియలో భాగంగా టెట్ నిర్వహిస్తున్నారు. ఇది పూర్తయిన వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ జారీకి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఇంత చేస్తున్నా విపక్షాల నుంచి విమర్శలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. ప్రధానమైన సంక్షేమ పథకాలకు మోక్షం కలగకపోవడంతో అనేక రకాల ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు జమిలిలో భాగంగా ముందస్తు ఎన్నికలకు కేంద్రం సిద్ధమవుతోంది. అందుకే వీలైనంత త్వరగా సంక్షేమ పథకాలు అమలు చేయాలని చంద్రబాబు సర్కార్ భావిస్తోంది. అందులో భాగంగానే భారీగా లబ్ధి చేకూర్చే అమ్మకు వందనం, అన్నదాత సుఖీభవ పథకాలకు శ్రీకారం చుట్టాలని చూస్తోంది.
* పేద విద్యార్థుల చదువుకు సాయం
వైసిపి హయాంలో పేద విద్యార్థుల చదువు కోసం అమ్మ ఒడి పథకాన్ని అమలు చేసిన సంగతి తెలిసిందే. ఇంట్లో ఒక పిల్లాడికి మాత్రమే ఈ పథకాన్ని అప్పట్లో వర్తింపజేశారు. చదువుకు ఏడాదికి 15000 రూపాయలు సాయం అందజేశారు. అయితే ఇందులో కూడా పాఠశాల నిర్వహణ పేరుతో 2000 రూపాయలు కోత విధించారు. అయితే తాము అధికారంలోకి వస్తే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 20 వేల చొప్పున అందిస్తామని చంద్రబాబుతో పాటు టిడిపి నేతలు హామీ ఇచ్చారు. ఆ హామీ అమలు చేసేందుకు ఇప్పుడు సిద్ధపడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 80 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. వీరందరికీ తల్లికి వందనం పేరిట నగదు సాయం చేసేందుకు దాదాపు 12 వేల కోట్లు ఖర్చు అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. దీనికి సంబంధించి నిధుల సమీకరణ పై ప్రభుత్వం దృష్టి సారించింది.
* సాగు ప్రోత్సాహం
వైయస్సార్ రైతు భరోసా పథకం కింద.. సాగు ప్రోత్సాహకానికి గాను జగన్ సర్కార్ 15000 అందిస్తానని ప్రకటించింది. అయితే కేవలం 7500 అందించి చేతులు దులుపుకుంది. కేంద్రం సామాన్ నిధి కింద ఏడాదికి 6000 రూపాయలు అందిస్తున్న సంగతి తెలిసిందే. దానికి 7500 జతచేస్తూ.. 13,500 రూపాయలను అందిస్తూ వస్తోంది. అయితే తాము అధికారంలోకి వస్తే 20వేల రూపాయలు ప్రతి రైతుకు అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు కేంద్రం అందించే 6000కు.. 14 వేల రూపాయలను కలుపుతూ అందించాలని నిర్ణయించారు. ఈ పథకం అమలుకు సైతం సన్నాహాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఖరీఫ్ దాటడంతో.. వచ్చే మార్చి, ఏప్రిల్ లో ఈ సాయం అందించేందుకు సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం.
* బడ్జెట్లో 20 వేల కోట్లు కేటాయింపు
వచ్చే నెలలో పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అందులో 20 వేల కోట్ల వరకు సంక్షేమ పథకాలకు కేటాయించనున్నారు. అవి ఈ రెండు పథకాలను అమలు చేసేందుకే నని ప్రచారం సాగుతోంది. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో మరో రెండు పథకాలకు కసరత్తు ప్రారంభించడం విశేషం. మొత్తానికైతే కీలక పథకాలకు ప్రభుత్వం సిద్ధపడుతుండడంతో.. లబ్ధిదారుల్లో ఒక రకమైన ఆనందం కనిపిస్తోంది.