Chandrababu: విశాఖలో( Visakhapatnam) పట్టు నిలుపుకోవాలని టిడిపి కూటమి చూస్తోంది. అందుకే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఇక్కడ కాపు తో పాటు వెలమ సామాజిక వర్గాలు కూటమికి అండగా నిలబడ్డాయి. ఇప్పుడు మరో సామాజిక వర్గం గవరలను తమ వైపు తిప్పుకునేందుకు టిడిపి గట్టి ప్రయత్నాలు చేసింది. అందులో భాగంగానే గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా పీలా శ్రీనివాస్ కు అవకాశం ఇచ్చింది. ఈయన అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణకు సోదరుడు. సామాజిక అంశాలను పరిగణలోకి తీసుకొని పీలా శ్రీనివాసును ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
Also Read: మూడింటిలోనూ.. బెంగళూరు “లయన్ రోర్”.. ఐపీఎల్ లో ఇదో సంచలన రికార్డు!
* విశాఖ రాజకీయాల్లో బలమైన సామాజిక వర్గం
విశాఖ రాజకీయాల్లో గవర సామాజిక వర్గానికి ( gavara caste ) ప్రత్యేకమైన స్థానం ఉంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత దాడి వీరభద్రరావు ప్రముఖ పాత్ర పోషిస్తూ వచ్చారు. సుదీర్ఘకాలం అనకాపల్లి ఎమ్మెల్యేగా సేవలందించారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో మంచి గుర్తింపు కలిగిన నేతగా కొణతాల రామకృష్ణ పేరు తెచ్చుకున్నారు. ఈ ఇద్దరు నేతలు రాజకీయంగా ప్రత్యర్థులు అయినా.. గవర సామాజిక వర్గాన్ని రాజకీయంగా నిలబెట్టారు. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంట్రీ తో గవర సామాజిక వర్గానికి ప్రాధాన్యం తగ్గింది. అందుకే ఇప్పుడు వ్యూహాత్మకంగా తెలుగుదేశం పార్టీ గవర సామాజిక వర్గానికి ఎనలేని ప్రాధాన్యం ఇస్తోంది.
* ఆ ఇద్దరు ఉద్దండులు..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొణతాల రామకృష్ణ ( konatala Ramakrishna ) జనసేనలో చేరారు. దాడి వీరభద్రరావు సైతం మాతృ పార్టీ టిడిపిలోకి వచ్చారు. ఈ పరిణామాల క్రమంలో విశాఖ జిల్లాలో ఐదు, ఆరు నియోజకవర్గాల్లో గెలుపోటములను నిర్దేశించే స్థితిలో గవర సామాజిక వర్గం ఉంది. జనసేన కూటమి కట్టడంతో కాపు సామాజిక వర్గం సైతం అనుకూలంగా మారింది. వెలమ సామాజిక వర్గం సైతం సంఘటితం అయింది. దీనిని మరింత పటిష్టం చేసుకోవాలన్న ఆలోచనతో గవర సామాజిక వర్గానికి చెందిన.. పీలా శ్రీనివాస్ కు మేయర్ గా అవకాశం ఇచ్చారు చంద్రబాబు. ఇదంతా 2029 ఎన్నికల కోసమేనని తెలుస్తోంది.
* యాదవ సామాజిక వర్గం డిమాండ్..
వాస్తవానికి గ్రేటర్ విశాఖ మేయర్ పీఠం యాదవ సామాజిక వర్గానికి( Yadava caste ) కేటాయించాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యాదవ సామాజిక వర్గానికి చెందిన మహిళా నేత గొలగాని వెంకట హరి కుమారికి అవకాశం ఇచ్చింది. ఆమెపై అవిశ్వాసం పెట్టిన సమయంలోనే యాదవ సామాజిక వర్గం నుంచి ఒక విజ్ఞప్తి వచ్చింది. రాజకీయంగా మేయర్ ను తొలగించవచ్చు కానీ.. ఆ పదవిని తిరిగి యాదవ సామాజిక వర్గానికి కేటాయించాలని వారు విజ్ఞప్తి చేశారు. దీంతో టీడీపీ హై కమాండ్ పునరాలోచనలో పడింది. కానీ 2021లో మేయర్ అభ్యర్థిగా ఉన్న గవర సామాజిక వర్గానికి చెందిన.. పీలా శ్రీనివాస్ వైపే చివరకు మొగ్గు చూపారు. మొత్తానికైతే విశాఖ జిల్లాలో వ్యూహాత్మకంగా పట్టు నిలుపుకోవాలన్న భాగంలోనే ఈ నిర్ణయమని తెలుస్తోంది.