Chandrababu: సీఎం హోదాలో బాబు ఉత్తర్వులు స్టార్ట్

తాజాగా కన్ఫామ్డ్ ఐఏఎస్ అధికారులకు పోస్టింగుల విషయంలో చంద్రబాబు కలుగజేసుకున్నారు. ఏకంగా కేంద్రానికి లేఖ రాశారు. ఎన్నికల కమిషన్కు సైతం కీలక విజ్ఞప్తి చేశారు.

Written By: Dharma, Updated On : May 25, 2024 11:25 am

Chandrababu

Follow us on

Chandrababu: ఈసారి తప్పకుండా గెలుస్తామని చంద్రబాబు నమ్మకంగా ఉన్నారు. కూటమి అధికారంలోకి వస్తుందని విశ్వాసంతో ఉన్నారు. పోలింగ్ సరళి, పెరిగిన ఓటింగ్ తమకు అనుకూలమని అంచనా వేస్తున్నారు. కూటమి వైపు పాజిటివ్ కనిపిస్తుండడంతో ధీమాతో ఉన్నారు. అటు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల స్వరం మారుతోంది. ఇప్పటికే చాలామంది చంద్రబాబు వద్దకు క్యూ కట్టారని కూడా ఎల్లో మీడియా రాసుకోస్తోంది. మరోవైపు చంద్రబాబు సైతం చాలా యాక్టివ్ గా కనిపిస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం తో పాటు గవర్నర్ లకు తరచూ లేఖాస్త్రాలను సంధిస్తున్నారు. పోలింగ్కు ముందు పెద్ద ఎత్తున అధికారుల మార్పులు చంద్రబాబు మార్క్ కనిపిస్తోంది. సంక్షేమ పథకాలకు సంబంధించి నిధుల విడుదలకు.. చంద్రబాబు సూచనకి గవర్నర్ ప్రాధాన్యం ఇచ్చారు. వ్యవస్థల పరంగా కూడా చంద్రబాబుకు గౌరవం ప్రారంభమైంది. దీంతో చంద్రబాబు అధికారం చేపట్టడం ఖాయమని ఒక పాజిటివ్ సంకేతం వస్తోంది.

తాజాగా కన్ఫామ్డ్ ఐఏఎస్ అధికారులకు పోస్టింగుల విషయంలో చంద్రబాబు కలుగజేసుకున్నారు. ఏకంగా కేంద్రానికి లేఖ రాశారు. ఎన్నికల కమిషన్కు సైతం కీలక విజ్ఞప్తి చేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో.. ఐఏఎస్ ఎంపిక ప్రక్రియ జరపడం నిబంధనలకు విరుద్ధమని.. కొత్త ప్రభుత్వం కొలువు దీరిన తర్వాత ఈ ప్రక్రియ నిర్వహించాలని కోరారు. దీంతో చంద్రబాబు రంగంలోకి దిగారని.. సీఎం హోదాలో ఉత్తర్వులు స్టార్ట్ చేశారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. బాస్ ఇజ్ బ్యాక్ అని టిడిపి శ్రేణులు గొప్పగా చెప్పుకుంటున్నాయి. సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నాయి.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే తప్పకుండా ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేస్తారు. ఈ విషయంలో కేంద్రం నుంచి కానీ, పవన్ నుంచి కానీ పెద్దగా అభ్యంతరాలు లేవు. పోలింగ్ కు ముందే కేంద్ర ప్రభుత్వంతో పాటు ఎన్నికల సంఘం నుంచి చంద్రబాబుకు సంపూర్ణ సహకారం అందింది. కీలక ఐపీఎస్ అధికారులతో పాటు బిజెపి మార్పు వెనుక చంద్రబాబు విన్నపం ఉంది. పురందేశ్వరి ద్వారా చంద్రబాబు అనుకున్నది సాధించగలిగారని.. వైసీపీ నేతలు ఆరోపించడమే ఇందుకు ఉదాహరణ. ఒక్క అధికారులు మార్పే కాదు.. ఎన్నికల నిర్వహణలో అడుగడుగున సహకారం అందుకోవడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు. కూటమి అధికారంలోకి వచ్చిన మరుక్షణం మూడు పార్టీల ఎమ్మెల్యేలు సమావేశమై.. చంద్రబాబును సీఎం అభ్యర్థిగా ఖరారు చేయడం ఖాయం. అయితే అంతకంటే ముందే చంద్రబాబు ఉత్తర్వులు జారీ చేస్తున్నారని ఎల్లో మీడియా ప్రచారం చేయడం విశేషం.