https://oktelugu.com/

Google Office In AP : విశాఖకు గూగుల్.. గేమ్ చేంజర్ అంటున్న చంద్రబాబు

ప్రపంచ దిగ్గజ ఐటీ సంస్థ గూగుల్. అటువంటి సంస్థ తమ కార్యకలాపాలను విశాఖలో ప్రారంభించడానికి సిద్ధపడటం విశేషం.

Written By:
  • Dharma
  • , Updated On : December 12, 2024 / 10:32 AM IST

    Google Office In Visakhapatnam

    Follow us on

    Google Office In AP : కూటమి సర్కార్ దూకుడు మీద ఉంది. ముఖ్యంగా అభివృద్ధి పై ఫోకస్ పెట్టింది. గత వైసిపి ప్రభుత్వం అభివృద్ధి చేయలేదన్న అపవాదుతోనే ప్రజలు దూరమయ్యారు. ఎన్నికల్లో ఓడించారు. అందుకే సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు పై దృష్టి పెట్టారు. విశాఖ నగరాన్ని ఐటి హబ్ గా మార్చాలన్నది ఒక వ్యూహం. అందులో కూటమి ప్రభుత్వం సక్సెస్ అయినట్లు కనిపిస్తోంది. విశాఖకు చాలా ఐటి పరిశ్రమలు క్యూ కడుతున్నాయి. తాజాగా గూగుల్ సంస్థ వైజాగ్ వచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఆ సంస్థ ప్రతినిధులు సీఎం చంద్రబాబుతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. విశాఖ కేంద్రంగా కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఒప్పందం చేసుకున్నారు. అయితే గూగుల్ ఎలాంటి ఆఫీస్ విశాఖలో ప్రారంభిస్తుందో చెప్పలేదు.. కానీ విశ్వసనీయ సమాచారం మేరకు గూగుల్ క్లౌడ్ క్యాంపస్ ను ప్రారంభించనున్నట్లుగా అధికార వర్గాలు చెబుతున్నాయి. కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు దీనిపై కీలక ప్రకటన చేశారు. గూగుల్ కార్యకలాపాలు ప్రారంభమైతే విశాఖ చరిత్ర మారిపోతుందని చెప్పుకొచ్చారు.

    * లోకేష్ విదేశీ పర్యటనలతో
    కొద్ది రోజుల కిందట నారా లోకేష్ మంత్రి హోదాలో అమెరికా పర్యటనకు వెళ్లారు. ఆ సమయంలో ప్రపంచ ఐటీ దిగ్గజాలను కలిశారు. ఆ సంస్థ ప్రతినిధులతో సమావేశం అయ్యారు. ఏపీలో ఐటీ పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అవకాశాలను వారికి వివరించారు. ఏపీ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కోరారు. ప్రభుత్వపరంగా అన్ని విధాల సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ తరుణంలో ఐటీ సంస్థలు పెద్ద ఎత్తున విశాఖ రావడం విశేషం. ఇప్పటికే దేశీయ సాఫ్ట్వేర్ దిగ్గజాలు టిసిఎస్, ఇన్ఫోసిస్ విశాఖలో క్యాంపస్లు నిర్వహిస్తున్నాయి. వాటి సరసన గూగుల్ చేరనుంది. గూగుల్ భారీ క్యాంపస్ ఏర్పాటు చేస్తే ఇక సాఫ్ట్వేర్ కు కేంద్రంగా విశాఖ మారుతుంది అన్న అభిప్రాయం ఏర్పడుతోంది.

    * లోకేష్ కు అభినందన
    అయితే విశాఖకు గూగుల్ రావడం వెనుక మంత్రి నారా లోకేష్ కృషి ఉందని చంద్రబాబు చెప్పుకొచ్చారు. కలెక్టర్ల సమావేశంలో ఇదే విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుత కాలంలో హార్డ్ వర్క్ తో సాధ్యం కాని పనులు స్మార్ట్ వర్క్ తో పూర్తవుతున్నాయని చెప్పుకొచ్చారు చంద్రబాబు. లోకేష్ కృషివల్లే విశాఖలో గూగుల్ ఏర్పాటుకు ఎంఓయూ జరిగిందని చెప్పారు. విశాఖకు గూగుల్ వచ్చిన మరుక్షణం గేమ్ చేంజర్ అవుతుందన్నారు. గూగుల్ తో ఒప్పందం ద్వారా 20 లక్షల మందికి ఉపాధి కలుగుతుందన్న విషయాన్ని గుర్తు చేశారు చంద్రబాబు. మొత్తానికైతే ప్రపంచ దిగ్గజ ఐటీ సంస్థ విశాఖలో అడుగుపెడుతుండడం శుభపరిణామం.