Chandrababu Meets Pawan Kalyan: నేటి కాలంలో రాజకీయ నాయకులు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం పరిపాటిగా మారింది. నిండు చట్ట సభ నుంచి మొదలు పెడితే బహిరంగ వేదిక వరకు రాజకీయ నాయకులు తలకు మాసిన వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు. ప్రజలను రెచ్చగొడుతూనే ఉంటారు. తమ రాజకీయ ప్రాపకం కోసం.. తమ పలుకుబడి కోసం.. జనాల్లో కనిపించడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.. ఇలాంటి వారిని ప్రజలు చీత్కరించుకో క పోగా.. వారిని అనుసరిస్తుంటారు. ఆరాధిస్తుంటారు.. అది ఈ దేశ దరిద్రం. ఇంతకంటే చెప్పడానికి ఏముంటుంది.
మొన్న ఏపీలో నిండు శాసనసభలో ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. అలాంటప్పుడు శాసనసభలో జరిగిన పరిణామం ఒకరకంగా కూటమి ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. దొరికిందే అవకాశం అనుకొని వైసిపి ఇష్టానుసారంగా కథనాలను ప్రసారం చేయడం మొదలు పెట్టింది. రకరకాల కథలను అల్లడం ప్రారంభించింది. ఇప్పుడు ఆ పార్టీకి కావాల్సింది అదే.. పైగా అధికారాన్ని కోల్పోయిన తర్వాత తమలో ప్రజాస్వామ్యం ఉందని.. తమ ప్రజల కోసం పనిచేస్తున్నామని వైసిపి తెగ కలరింగ్ ఇచ్చుకుంటున్నది. గడచిన ఐదు సంవత్సరాలలో ఆ పార్టీ ఏం చేసింది? ఎలా వ్యవహరించింది? అందరికీ తెలుసు. ఏపీ శాసనసభలో జరిగిన పరిణామం నేపథ్యంలో తెర ముందుకు అనేక నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. కాకపోతే ఇప్పటి కాలంలో నిజాల కంటే కల్పనలకే విలువ ఎక్కువ ఉంటుంది. అవాస్తవాలకే ప్రచారం అధికంగా ఉంటుంది. అలాంటిదే ఇది కూడా.
ఏపీలో శాసనసభలో జరిగిన పరిణామం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను కలిశారు. ఇటీవల పవన్ కళ్యాణ్ జ్వరం బారిన పడ్డారు. నాలుగు రోజులపాటు ఏపీలో చికిత్స పొందినప్పటికీ ఉపయోగం లేకపోవడంతో ఆయన హైదరాబాద్ వెళ్లారు. జ్వరంతో బాధపడుతున్న నేపథ్యంలో ఆయనను ముఖ్యమంత్రి చంద్రబాబు పరామర్శించారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. శాసనసభలో జరిగిన పరిణామం పవన్ కళ్యాణ్ ను బాధించిందని.. అందువల్లే ఆయన దూరంగా ఉంటున్నారని.. ఆయనను శాంత పరచడానికి చంద్రబాబు వెళ్లారని కొంతమంది సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. కోతికి దొరికిందే కొబ్బరి చిప్ప అన్నట్టుగా.. మరికొందరు కూటమి నుంచి పవన్ కళ్యాణ్ బయటకు వస్తారని వ్యాఖ్యానిస్తున్నారు. వాస్తవానికి పవన్ కళ్యాణ్ ను చంద్రబాబు పరామర్శించారు. ఇంతవరకు వాస్తవం. కానీ అసలు విషయాన్ని పక్కనపెట్టి దానికి రకరకాల రంగులు అద్దడమే పరమావధిగా సాగుతోంది. దీని వెనక ఎవరున్నారు.. ఇదంతా ఎవరు చేస్తున్నారు.. అదంతా ముంజేతి కంకణమే.