Chandrababu : ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. వైసీపీ లక్ష్యంగా చేసుకుంది కూటమి. కూటమిని ఇరుకున పెట్టాలని చూస్తోంది వైసిపి. సరిగ్గా ఇదే సమయంలో జమిలీ ఎన్నికలపై ఆశలు పెట్టుకుంది జగన్ పార్టీ. కేంద్ర ప్రభుత్వ జమిలి ఎన్నికల ప్రయత్నాన్ని చంద్రబాబు సమర్ధించారు. వైసీపీలో ఆశలు నింపారు. ముందుగానే ఎన్నికలు వస్తే కూటమిని ఓడిస్తామని జగన్ భావిస్తున్నారు. 2027లోనే జమిలి ఎన్నికలు ఉంటాయని పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది. తాజాగా దానిపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు సీఎం చంద్రబాబు. కొంతకాలంగా జమిలి ఎన్నికల విషయంలో కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లు సైతం ప్రవేశపెడతారన్న అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో జమిలీ అంశంపై చర్చించారు ప్రధాని మోదీ. హర్యానా ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత నిర్వహించిన సమావేశానికి చంద్రబాబుతో పాటు పవన్ హాజరయ్యారు. అనంతరం జమిలీకి మద్దతుగా చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. దీంతో ముందస్తు ఎన్నికలు తప్పవని అంతా భావించారు.
* ముందస్తు ఎన్నికలు
2027 ద్వితీయార్థంలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయని అందరూ అంచనా వేశారు. వైసీపీ సైతం మానసికంగా సిద్ధమయింది. అయితే తాజాగా దీనిపై కీలక వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. మీడియాతో చిట్ చాట్ చేస్తూ ఫుల్ క్లారిటీ ఇచ్చారు. దేశంలో జమిలీ ఎన్నికలు జరుగుతాయని.. కానీ షెడ్యూల్ ప్రకారం 2029లోనే జరుగుతాయని తేల్చి చెప్పారు. దీంతో వైసిపి ఆశలు నీరుగారిపోయినట్లు అయ్యింది.
* చర్చ ప్రారంభం
చంద్రబాబు తాజా కామెంట్స్ పై రాజకీయంగా చర్చ ప్రారంభం అయింది. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే కేంద్రం తీసుకురానున్న వక్ఫ్ బిల్లుపై పార్టీ ఎంపీలకు చంద్రబాబు కీలక సూచనలు కూడా చేశారు. ముస్లిం వర్గాల మనోభావాలను తాను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ పెద్దలకు వివరించాలని చెప్పారు. వారు కూడా తొందరపడే ఉద్దేశంలో లేరనే అనుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. ఒకవేళ బిల్లు పార్లమెంటు ముందుకు వస్తే ఏం చేయాలో అప్పుడు ఆలోచిద్దాం అన్నారు. అయితే జిమిలి ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.