Welfare Schemes : సంక్షేమ పథకాల( welfare schemes ) అమలు విషయంలో సీఎం చంద్రబాబుపై ఒత్తిడి తప్పడం లేదు. కూటమి అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు అవుతోంది. కానీ ఒక్క పింఛన్ మొత్తాన్ని పెంచడం తప్ప మరో పథకం పెద్దగా కనిపించలేదు. ఉచిత గ్యాస్ సిలిండర్ అమలు చేస్తున్న అది ప్రజల్లో పెద్దగా హైలెట్ కావడం లేదు. అటు పార్టీ శ్రేణుల్లో సైతం ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. ప్రధానంగా తల్లికి వందనంతో పాటు అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తే చాలు అన్నట్టు కూటమి పార్టీల ప్రజా ప్రతినిధులు ఉన్నారు. ఆ రెండు పథకాలు అమలు చేస్తే ప్రజల్లో సంతృప్తి శాతం పెరుగుతుందని.. కేవలం ఆ రెండు పథకాలు అమలు చేయడంతో పాటు అభివృద్ధి చేపెడితే.. ప్రజలు తప్పకుండా మరోసారి కూటమిని ఆదరిస్తారని చెప్పుకొస్తున్నారు. ఇటువంటి తరుణంలో చంద్రబాబు పొలిట్ బ్యూరోలో ఈ రెండు పథకాలపై కీలక సంకేతాలు ఇచ్చారు. అతి త్వరలో రెండు పథకాలను అమలు చేస్తామని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా అన్నదాత సుఖీభవ పై ఫుల్ క్లారిటీ ఇచ్చారు. గతంలో జగన్ రైతు భరోసా పేరిట ఈ పథకాన్ని అమలు చేశారు. పిఎం కిసాన్ కింద కేంద్రం అందించే 6000 మొత్తం తో కలిపి.. మరో 7500 రూపాయలను జత చేసి.. మొత్తం 13,500 అందించేవారు. కానీ చంద్రబాబు మాత్రం కేంద్రం అందించే 6000 మొత్తం తో కలిపి.. మరో 14000 జత చేసి.. 20వేల రూపాయలు అందించేందుకు సిద్ధపడుతున్నారు.
* ఎట్టకేలకు అన్నదాత సుఖీభవ
గత ఏడాది జూన్ లో అధికారంలోకి వచ్చింది కూటమి ప్రభుత్వం( allians government ). అప్పటికే ఖరీఫ్ సీజన్ ప్రారంభం అయింది. ప్రభుత్వం వచ్చిన తొలినాళ్లలో అన్నదాత సుఖీభవ పేరిట వెబ్సైట్లో పేరు కూడా మార్చారు. దీంతో వెంటనే పథకం అమలు చేస్తారని అంతా భావించారు. అయితే ఇప్పుడు.. 8 నెలలు దాటుతుండడం.. త్వరలో పిఎం కిసాన్ నగదును కేంద్రం జమ చేసే అవకాశం ఉండడంతో.. దాంతోపాటే అన్నదాత సుఖీభవ అమలు చేయడానికి సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. అంటే పిఎం కిసాన్ ఏడాదికి మూడు విడతలుగా అందిస్తోంది కేంద్రం. ఇప్పుడు అదే మూడు విడతల్లో అన్నదాత సుఖీభవ సాయం అందించేందుకు చంద్రబాబు సర్కార్ సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది.
* తల్లికి వందనం సైతం
మరోవైపు జగన్( Jagan Mohan Reddy) హయాంలో అమ్మ ఒడి అమలు చేసేవారు. పిల్లల చదువు కోసం 15 వేల రూపాయల చొప్పున అందించేవారు. తొలి ఏడాది 15000 చొప్పున అందించారు. కానీ తరువాత అందులో కూడా కోత విధించారు. చివరి మూడేళ్లు 13000 చొప్పున మాత్రమే ఇచ్చారు. అయితే తాము అధికారంలోకి వస్తే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15000 చొప్పున అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ పథకాన్ని సైతం ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలోనే అమలు చేస్తామని స్పష్టత ఇచ్చారు. సీఎం చంద్రబాబు. గత ఎనిమిది నెలలుగా ఈ పథకం కోసం లక్షలాదిమంది ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఫుల్ క్లారిటీ ఇచ్చారు చంద్రబాబు. వచ్చే విద్యా సంవత్సరం జూన్ 12న ప్రారంభం అవుతుంది. అంతకంటే ముందే ఈ మొత్తాన్ని విడుదల చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించినట్లు సమాచారం.
* చంద్రబాబు ప్రకటన అందుకే
అయితే ఈ రెండు పథకాల విషయంలో చంద్రబాబుపై ( CM Chandrababu)తీవ్ర ఒత్తిడి ఉంది. ఈ రెండు పథకాలను అమలు చేస్తే ప్రజల్లో సంతృప్తి శాతం దానంతట తానే వస్తుందని చంద్రబాబుకు సైతం నిఘా వర్గాలు సైతం నివేదించాయట. అందుకే చంద్రబాబు ఈ రెండు పథకాలకు ముహూర్తం ఫిక్స్ చేశారు. పనిలో పనిగా మధ్యలో ఉగాది నుంచి ఆర్టీసీలో మహిళల ఉచిత ప్రయాణానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. మొత్తానికి అయితే గత ఎనిమిది నెలలుగా ఎదురుచూస్తున్న రెండు పథకాలకు ప్రభుత్వం గేట్లు తెరిచిందన్నమాట. చూడాలి మరి ఏం జరుగుతుందో?