Nara Lokesh : టిడిపి ( Telugu Desam) ఆవిర్భావం తర్వాత.. ఈ ఎన్నికల్లో సూపర్ విక్టరీ సాధించింది. గతంలో ఎన్నడూ చూడని విజయాన్ని సొంతం చేసుకుంది. ఇదే ఉత్సాహంతో మహానాడు ను అద్భుతంగా చేసుకోవడానికి ఏర్పాట్లు చేస్తోంది. తెలుగుదేశం పార్టీకి మహానాడు అనేది ఒక పండగ. పార్టీ ఆవిర్భావం నుంచి ఈ వేడుక కొనసాగుతూ వస్తోంది. ఈసారి మరింత ఘనంగా చేసుకునేందుకు నిర్ణయించింది. కడపలో ఈసారి మహానాడు జరుపుకోవడానికి పొలిట్ బ్యూరో తీర్మానించింది. అయితే రెట్టింపు ఉత్సాహంతో నిర్వహించనున్న ఈ మహానాడులో కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ కనిపిస్తోంది. ముఖ్యంగా లోకేష్ భవిష్యత్ ఏమిటన్నది ఈ మహానాడులో తేలిపోనుంది.
* పొలిట్ బ్యూరో అభినందన
తెలుగుదేశం( Telugu Desam) పార్టీ కోటి సభ్యత్వాల నమోదును పూర్తి చేసుకుంది. పార్టీ ఆవిర్భావం తర్వాత ఈ స్థాయిలో సభ్యత్వ నమోదు కావడం ఇదే తొలిసారి. మంత్రి నారా లోకేష్ కృషి ఫలితంగానే ఇది సాధ్యమైంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. నిన్న జరిగిన పొలిట్ బ్యూరో సమావేశంలో లోకేష్ కు టిడిపి సీనియర్లు అభినందనలు తెలిపారు. పనిలో పనిగా లోకేష్ కు కీలక పదవి కట్ట పెట్టాలని సీనియర్లు చంద్రబాబు వద్ద ప్రస్తావించినట్లు సమాచారం. అందుకు చంద్రబాబు సైతం సానుకూలంగా ఉన్నట్లు ప్రచారం ప్రారంభమైంది. ముఖ్యంగా మహానాడులో ఈ ప్రకటన ఉంటుందని తెలుస్తోంది. ఈ మేరకు అందుకు కసరత్తు కూడా జరుగుతున్నట్లు సమాచారం.
* ఆ విధానాన్ని స్వయంగా ప్రకటించుకున్న లోకేష్
నారా లోకేష్( Nara Lokesh) ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అయితే గత మూడు సార్లు ఈ పదవిలో కొనసాగుతూ వస్తున్నారు. అయితే పార్టీలో పదవులు తీసుకున్నవారు.. మూడు టెర్ములు పూర్తి చేసుకుంటే.. నాలుగోసారి వదులుకోవాల్సిందేనని స్వయంగా లోకేష్ ప్రకటించారు. తాను సైతం జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిని వదులుకుంటానని తేల్చి చెప్పారు. దీంతో ఆయన స్థానంలో మరొకరు జాతీయ ప్రధాన కార్యదర్శి కావడం ఖాయంగా తెలుస్తోంది. అదే సమయంలో లోకేష్ కు దానికంటే ఉన్నత పదవి ఇస్తారని ప్రచారం నడుస్తోంది. వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ.. పార్టీ అధ్యక్ష పదవి కానీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.
* మహానాడుకు సన్నాహాలు
ఇప్పటికే నారా లోకేష్( Nara Lokesh ) ను డిప్యూటీ సీఎం చేయాలన్న డిమాండ్ తెలుగుదేశం పార్టీ నుంచి వినిపిస్తోంది. అయితే కూటమి అధికారంలో ఉన్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నుంచి వస్తున్న డిమాండ్ ను తప్పుపడుతోంది జనసేన. ఈ తరుణంలో వివాదంగా మారుతోంది. అందుకే ముందుగా లోకేష్ ను టిడిపిలో ప్రమోట్ చేయాలన్నది తెలుగుదేశం పార్టీ నేతల భావన. అందుకే మహానాడు వేదికగా లోకేష్ ప్రమోట్ కు సంబంధించి కీలక ప్రకటన వెల్లడించే అవకాశం ఉంది. కడపలో మే నెలాఖరులో మహానాడు జరగనుంది. మూడు రోజులపాటు జరగనున్న ఈ మహానాడుకు ఇప్పటినుంచే సన్నాహాలు ప్రారంభం అయ్యాయి.