Chandrababu Naidu : ఏపీలో కూటమి ప్రభుత్వం సంక్షేమంపై ఫోకస్ చేసింది. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న తరుణంలో సంక్షేమానికి పెద్దపీట వేయాలని భావిస్తోంది. ఇప్పటికే సామాజిక పింఛన్ల పెంపు, గ్యాస్ ఉచిత సరఫరా వంటివి అమలుచేసింది. జూన్ నెలలో కీలకమైన రెండు పథకాలు అమలుచేయాలని భావిస్తోంది. విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే విద్యార్థుల తల్లుల ఖాతాలో తల్లికి వందనం నిధులు జమ చేయాలని నిర్ణయించారు. మరోవైపు ఈ నెలలోనే కేంద్రం పీఎం కిసాన్ నిధులు జమ చేయనుంది. వాటితో కలిపి అన్నదాత సుఖీభవ నిధులు కలిపి వేయాలని నిర్ణయించింది. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం అమలు చేయనున్నారు. అయితే గత ఏడాదిగా వైసీపీ ప్రభుత్వ నిలిపివేసిన రీయింబర్స్ మెంట్ నిధులు, చెల్లింపులను చేసింది. వీటన్నింటినీ ప్రజలకు తెలియజెప్పేందుకు సంక్షేమం క్యాలెండర్ విడుదల చేయాలని నిర్ణయించినట్టు సీఎం చంద్రబాబు తెలిపారు.
ఆరు శాసనాలపై చర్చ..
తెలుగుదేశం పార్టీ మహానాడు విజయవంతంగా పూర్తయిన నేపథ్యంలో పార్టీ అధినేత చంద్రబాబు ఎంపీలు, మంత్రులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. మహానాడులో తీర్మానాలు, అమోదించిన అంశాలపై ప్రజల్లో బలమైన చర్చ జరిగేలా..పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. కడపలో మూడు రోజుల పాటు జరిగిన మహానాడు విజయవంతం అయ్యింది. తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా పార్టీ శ్రేణులు వచ్చారు. ప్రజోపయోగకరమైన అంశాలకు సంబంధించి దాదాపు 14 తీర్మానాలు చేశారు. మరోవైపు మంత్రి నారా లోకేష్ ఓ ఆరు శాసనాలను సభలో ప్రవేశపెట్టారు. తెలుగుజాతి విశ్వఖ్యాతి ,యువగళం , స్త్రీశక్తి ,పేదల సేవల్లో సోషల్ ఇంజనీరింగ్ ,అన్నదాతకు అండగా, కార్యకర్తలే అధినేత అన్..న ఆరు శాసనాలు ప్రకటించారు నారా లోకేష్. దీనిపై ప్రజల్లో చర్చ జరిగేలా చూడాలని పార్టీ మంత్రులకు, ఎంపీలకు సూచించారు సీఎం చంద్రబాబు.
సానుకూలత కోసం..
ఇప్పటికే రాష్ట్రంలో పెద్ద ఎత్తున వివిధ ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతోంది. మరోవైపు అమరావతి రాజధాని నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. పోలవరం పనులు సైతం ఊపందుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి అన్నివిధాలా సాయం అందుతోంది. భారీగా నిధుల కేటాయింపు జరుగుతోంది. ఏడాదిగా నిధుల సమీకరణ సైతం బాగానే జరిగింది. అందుకే ఇక్కడ నుంచి సంక్షేమ పథకాలను ప్రారంభించాలని సీఎం చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చారు. సంక్షేమ పథకాలపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. అవి ప్రజల్లో ప్రభావం చూపకుండా ఉండాలంటే కీలకమైన రెండు పథకాలు అమలుచేసి..సంక్షేమ క్యాలెండర్ విడుదల చేస్తే ప్రజల్లో ఒక రకమైన సానుకూలత ఏర్పడుతుందని సీఎం చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చారు. త్వరలో సంక్షేమ క్యాలెండర్ విడుదల చేసే అవకాశం ఉంది.
ఇబ్బందులు రాకుండా ఉండాలంటే..
మరోవైపు జూన్ 4 నాటికి కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతుంది. హామీలు అమలుచేయకపోవడం వల్ల ఆ రోజున వెన్నుపోటు దినంగా పరిగణించి నిరసనలు తెలపాలని వైసీపీ శ్రేణులకు అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీచేశారు. అయితే ప్రజల్లో కూడా సంక్షేమ పథకాలపై ఇప్పుడిప్పుడే చర్చ ప్రారంభమైంది. కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఏడాది సమయం ఇచ్చారు. అందుకే ఇప్పుడు కానీ పథకాలు ప్రారంభించకుంటే ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని సీఎం చంద్రబాబుకు తెలుసు. అందుకే పథకాలతో పాటు సంక్షేమ క్యాలెండర్ విడుదల చేయాలని ఒక నిర్ణయానికి వచ్చారు.