Chandrababu: చంద్రబాబు అరెస్టు విషయంలో క్లారిటీ వచ్చింది. ఆయన స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. నంద్యాలలో రాజకీయ పర్యటనలో ఉండగా పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఏ కేసులో తనని అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలని చంద్రబాబు పట్టు పట్టిన సంగతి తెలిసిందే. శుక్రవారం అర్ధరాత్రి నుంచి సాగిన హైడ్రామా తెల్లవారు చంద్రబాబు అరెస్టుతో ముగిసింది. చివరకు చంద్రబాబును స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అరెస్టు చేసినట్లు పోలీసులు స్పష్టతనిచ్చారు. దీంతో అంతటా స్కిల్ డెవలప్మెంట్ స్కాం గురించి చర్చ జరుగుతోంది.
టిడిపి ప్రభుత్వ హయాంలో…
2015లో స్కిల్ డెవలప్మెంట్ కోసం సీ మెన్స్, డిజైన్ టెక్ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. రూ. 3356 కోట్లకు సంబంధించి ఈ ప్రాజెక్టులో.. రూ. 371 కోట్లు దారి మళ్లినట్లు ఆరోపణలు వచ్చాయి. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టిడిపి హయాంలో చేపట్టిన పనులపై సమీక్షించింది. ఇందుకుగాను ఉన్నత స్థాయి అధికారులతో ఒక దర్యాప్తు కమిటీని(సిట్ ) సైతం ఏర్పాటు చేసింది.
స్కిల్ డెవలప్మెంట్ స్కామునకు సంబంధించి 2020 నుంచి విచారణ కొనసాగుతోంది. 2020 డిసెంబర్ 10న విజిలెన్స్, 2021 ఫిబ్రవరిలో ఏసీబీ విచారించింది. అనంతరం ఈ కేసు సిఐడి కి బదిలీ అయ్యింది. ఈ అవినీతి కుంభకోణంలో ఏ1 గా చంద్రబాబు, ఏ2 గా ఉన్నట్లుగా సిఐడి పేర్కొంది. చంద్రబాబుపై 120 బి, 166,167, 418, 420, 465, 468, 201, 109, రీడ్ విత్ 34, 37 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
గత మూడేళ్లుగా విచారణ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ విషయంలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. అటు శాసనసభలో సైతం పెను దుమారమే రేగింది. అయితే అమరావతిలో ఇన్ఫ్రా సంస్థల నుంచి చంద్రబాబు ముడుపులు తీసుకున్నట్లుఐటీ శాఖ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.అయితే ఐటీ కేసులకు సంబంధించిన మూలాలు.. స్కిల్ డెవలప్మెంట్ స్కామునకు సంబంధించిన మూలాలు ఒక్కటేనని ప్రచారం జరిగింది. ఈ తరుణంలో చంద్రబాబు అరెస్ట్ ఏ కేసులో జరిగిందో తెలియక.. అంతా అయోమయానికి గురయ్యారు. కానీ సిఐడి పోలీసులు మాత్రం స్కిల్ డెవలప్మెంట్ స్కామునకు సంబంధించి చంద్రబాబును అరెస్టు చేసినట్లు స్పష్టతనిచ్చారు.