CM Chandrababu: చంద్రబాబు సర్కార్ ఏపీలో కీలక ప్రాజెక్టులపై దృష్టి పెట్టింది. వచ్చే నాలుగేళ్లలో పూర్తి చేయాలని సంకల్పించింది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో వీలైనంత త్వరగా వాటిని పూర్తిచేయాలని భావిస్తోంది. ముఖ్యంగా విశాఖ, విజయవాడలో మెట్రో ప్రాజెక్టుల పైన ఏపీ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. రెండు నగరాల్లో రెండు వేల కోట్ల రూపాయలతో రోడ్డు కం ఫ్లై ఓవర్ల నిర్మాణం చేపట్టాలని డిసైడ్ అయ్యింది. ఈ రెండు ప్రాజెక్టులకు కేంద్రం సాయం కోరాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా కేంద్రంతో సంప్రదింపులు జరిపి ఈ ప్రాజెక్టులను పూర్తి చేయాలని చూస్తోంది చంద్రబాబు సర్కార్. నాలుగేళ్లలో ఈ మెట్రో ప్రాజెక్టులు అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. 2014లో టిడిపి అధికారంలోకి వచ్చినప్పుడు మెట్రో ప్రాజెక్టుల ప్రతిపాదన వచ్చింది. అయితే అప్పట్లో కార్యరూపం దాల్చలేదు. ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. తద్వారా దేశంలో పేరు మోసిన నగరాల సరసన విజయవాడ, విశాఖను నిలపాలని చూస్తున్నారు.
* డిపిఆర్ లు ఆమోదం
విశాఖ తో పాటు విజయవాడలో మెట్రో ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే డిపిఆర్ లు ఆమోదించారు. విజయవాడలో 66 కిలోమీటర్లు, విశాఖలో 76.90 కిలోమీటర్ల మేర మెట్రో ప్రాజెక్టుల నిర్మాణానికి డిపిఆర్లను ఆమోదించారు. 2017లో కోల్ కతాలో 100% ఈక్విటీ భరిస్తూ రూ.8565 కోట్లతో 16 కిలోమీటర్ల మేర కేంద్ర ప్రభుత్వం మెట్రో ప్రాజెక్ట్ నిర్మాణాన్ని చేపట్టింది. ఏపీలో కూడా అదే విధంగా మెట్రో ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలని చంద్రబాబు కేంద్రాన్ని కోరనున్నారు. వీలైనంతవరకు కేంద్ర నిధులతోనే ఆ రెండు ప్రాజెక్టులను పూర్తి చేయాలని భావిస్తున్నారు.
* డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్లు
విశాఖ తో పాటు విజయవాడలో డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్లు నిర్మించాలన్నది చంద్రబాబు ప్లాన్ గా తెలుస్తోంది. విజయవాడలో 16వ నెంబర్ జాతీయ రహదారి నిడమనూరు జంక్షన్ నుంచి రామవరప్పాడు వరకు 4.7 కిలోమీటర్లు, విశాఖలో గాజువాక నుంచి స్టీల్ ప్లాంట్ వరకు నాలుగు కిలోమీటర్ల మేర.. రోడ్డు కం డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్లను నిర్మించాలని నిర్ణయించారు. వీటన్నింటిపై కేంద్రానికి కీలక ప్రతిపాదనలు చేయనున్నారు. ఈ భారీ ప్రాజెక్టులకు కేంద్రం భరించేలా ఒప్పించనున్నారు. ఇందులో ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి.