YS Jagan Tirumala Tour : ‘సరిపోదా శనివారం’ సెట్ చేసిన జగన్.. మక్కెలిరగదీస్తానంటున్న చంద్రబాబు

తిరుపతిలో మరో వివాదం చెలరేగే అవకాశం ఉంది. లడ్డు వివాదం నేపథ్యంలో చంద్రబాబు పాప ప్రక్షాళన కోసం అంటూ.. జగన్ తిరుమల బాట పట్టారు. ఈరోజు తిరుమల వెళ్లనున్నారు. రేపు శ్రీవారిని దర్శించుకొనున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అలర్ట్ అయింది. చంద్రబాబు కీలక కామెంట్లు చేశారు.

Written By: Dharma, Updated On : September 27, 2024 11:29 am

YS Jagan Tirumala Tour

Follow us on

YS Jagan Tirumala Tour : ఏపీలో లడ్డు వివాదం చుట్టూ రాజకీయం నడుస్తోంది. లడ్డు తయారీలో వైసిపి పాపం చేసిందని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఆ వ్యవహారం నుంచి తప్పుకునేందుకు వైసిపి నానా ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో జరుగుతున్న రాజకీయం హీటెక్కిస్తోంది. అధికార కూటమి ప్రభుత్వం విమర్శలను తిప్పికొట్టేందుకు శనివారం రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల్లో పూజలు చేద్దాం అనే కార్యక్రమానికి వైసిపి హై కమాండ్ పిలుపు ఇచ్చింది. సీఎం చంద్రబాబు పాపాలను ప్రక్షాళన చేసేందుకు పూజలు చేస్తున్నామన్నది వైసిపి కాన్సెప్ట్. అయితే దీనికి ప్రత్యేకంగా శనివారాన్ని ఎంచుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. సాధారణంగా భక్తులు ఎక్కువగా శనివారం, సోమవారం ఆలయాల్లో పూజలు చేస్తుంటారు. అందుకే భక్తులు ఎక్కువగా వచ్చే శనివారాన్ని జగన్ ఎంచుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. మొన్నటి ఎన్నికల్లో వైసిపి ఘోర పరాజయం తర్వాత పార్టీ శ్రేణులు సైతం దూరంగా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఆలయాల్లో పూజలు అంటే పార్టీ శ్రేణులు పెద్దగా ఇష్టం పెట్టుకోవు. దీంతో కార్యక్రమం అట్టర్ ఫ్లాప్ గా మిగులుతుంది. అందుకే ఈ ఆలోచనతోనే శనివారం రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేద్దాం అన్న కాన్సెప్ట్ ను జగన్ బయట పెట్టినట్లు తెలుస్తోంది. అయితే టిడిపి ప్రభుత్వం వేరేలా ఆలోచన చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా పదివేల మందిని వైసిపి తిరుపతికి సమీకరించాలని చూస్తోందని సమాచారం వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే చంద్రబాబు సీరియస్ గా కామెంట్ చేసినట్లు సమాచారం. లాండ్ ఆర్డర్ సమస్య సృష్టించాలని చూస్తే మక్కెలు ఇరగదీస్తామని చంద్రబాబు తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు.

* బయటపడేందుకు వైసిపి తంటాలు
తిరుపతి లడ్డు వివాదం నేపథ్యంలో వైసిపి కార్నర్ అయింది. ఆ పార్టీకి ఎంతలా డ్యామేజ్ జరగాలో అంతలా జరిగింది. దాని నుంచి బయటపడేందుకు వైసిపి ఎన్నో రకాల ఎత్తుగడలు వేస్తోంది. అందులో భాగంగానే జగన్ తిరుమల పర్యటనకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే విజయవాడ వరదలు నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీని పడవలతో ఢీకొట్టించారని వైసిపి పై ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు తిరుమల లో మరో వివాదం సృష్టించేందుకు ఈ కొత్త ఎత్తుగడ అని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు స్ట్రాంగ్ గా రియాక్ట్ అయినట్లు తెలుస్తోంది. క్రిమినల్ చరిత్రతో మీరు వస్తే.. ప్రభుత్వం పవర్ ఏంటో చూపిస్తామంటూ సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. దీంతో వైసీపీ ఏదో ఒక ప్లాన్ తో ఉన్నట్లు ప్రభుత్వానికి సంకేతాలు అందినట్లు తెలుస్తోంది.

* 16 మంది ఐపీఎస్ ల బదిలీ
రాష్ట్రవ్యాప్తంగా 16 మంది ఐపీఎస్ బదిలీ వెనుక ఏదో జరుగుతుందనే చర్చ ప్రధానంగా నడుస్తోంది. దేవాలయాల్లో పూజలు చేద్దాం అనే కార్యక్రమానికి వైసీపీ పిలుపు ఇచ్చిన తర్వాతే.. ఈ బదిలీ ప్రక్రియ జరగడం విశేషం. మరోవైపు జగన్ తిరుపతి సందర్శన నేపథ్యంలో డిక్లరేషన్ అంశం తెరపైకి వస్తోంది. తిరుపతిలో అన్య మతస్తులు ప్రవేశించడానికి తప్పకుండా డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు జగన్ సైతం డిక్లరేషన్ సమర్పించాలని టిడిపి, బిజెపి, జనసేన కోరుతున్నాయి.

* ముందు వారి మక్కెలు ఇరగదీయండి
ఇటీవల వైసిపికి చెందిన మాజీ మంత్రి కొడాలి నాని ఈ ఘటనపై స్పందించారు. చంద్రబాబు ఎవరు మక్కెలు ఇరగదీస్తారని ప్రశ్నించారు. కూటమి పార్టీల ఎమ్మెల్యేలు వెనుకబడిన వర్గాల పై దాడులు చేస్తున్నారని.. ముందుగా వారి మక్కెలు ఇరగదీయాలని సూచించారు. అంతటితో ఆగకుండా ఒక్కసారైనా చంద్రబాబు తిరుపతిలో మొక్కు తీర్చుకున్నారా? గుండు కొట్టించారా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే ఇప్పుడు ఏకంగా 10,000 మంది వైసీపీ శ్రేణులతో జగన్ తిరుపతిలో బలప్రదర్శనకు దిగడానికి ప్రయత్నాలు చేస్తుండడంతో.. సరిపోదా శనివారం అంటూ ఇటీవల నాని నటించిన సినిమాను గుర్తు చేసుకుంటున్నారు