Chandrababu : ఎటూ తేల్చుకోలేకపోతున్న చంద్రబాబు

ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీ శక్తివంతంగా ఉంది. దానిని పడగొట్టాలంటే బీజేపీ, జనసేన అవసరం కీలకం. అందుకే ఆ రెండు పార్టీలను దారిలో తెచ్చేందుకు తన శక్తియుక్తులను వినియోగిస్తున్నారు చంద్రబాబు. అవమానాలను ఎదుర్కొంటున్నారు. అవహేళలను తట్టుకుంటున్నారు. నాకంటూ ఒక రోజు రాకపోదా? అని సీరియస్ గా ఆలోచిస్తున్నారు. అంతవరకూ సైలెంటే ఉత్తమమని భావిస్తున్నారు.

Written By: Dharma, Updated On : July 20, 2023 11:57 am
Follow us on

Chandrababu : దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న వ్యక్తి చంద్రబాబు. ప్రధాని పదవి చేపట్టలేదు కానీ.. దానితో సరితూగే ఎన్డీఏ కన్వీనర్ హోదా బాధ్యతలను చేపట్టారు. అయితే అదంతా గతం. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో రాణించడానికి తన శక్తియుక్తులను ఉపయోగించాల్సిన పరిస్థితి. జాతీయ రాజకీయాల్లో స్పేస్ ఉన్నా..వెళ్లాల్సిన పరిస్థితి ఉన్నా మౌనాన్నే ఆశ్రయిస్తున్నారు. కొద్దిరోజుల పాటు వెయిట్ చేసి తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. గతంలో తొందరపాటు చర్యలతో ఎదురైన ఫలితాలను చూసి కాస్తా జాగ్రత్తగానే అడుగేయ్యాల్సిన అనివార్య పరిస్థితి చంద్రబాబుది.

తన ముందున్న కర్తవ్యం ఏపీ పాలిటిక్స్. అంతకు మించి తనకు ఏమీ అవసరం లేదన్నట్టున్నారు చంద్రబాబు. విపక్ష కూటమి ‘ఇండియా’లో పెద్దన్న పోస్టు ఖాళీగా ఉన్నా..అందులో తన పాత స్నేహితులందరూ ఎదురుచూస్తున్నా అటువైపు చూడలేని పరిస్థితి చంద్రబాబుది. తనకు అవసరమైన పవన్ ఎన్డీఏ వైపు ఉన్నారు. ఎన్డీఏ మరోసారి అధికారంలో వచ్చేలా ఉంది. అందుకే అటువైపు ఆశగా చూస్తున్నారు. కానీ పూర్వశ్రమంలో పాత మిత్రుడిగా ఉన్నా..ఒకప్పుడు తమ కూటమికి కన్వీనర్ గా ఉన్నారని చూడకుండా చంద్రబాబును బీజేపీ అవమానిస్తోంది. అనుమానపు చూపులు చూస్తోంది.

అదే విపక్ష కూటమి ‘ఇండియా’లో మాత్రం తమ చిరకాల మిత్రులు వామపక్షాలు ఉన్నాయి. ఒక నాటి తన సహచరులు శివసేన, జేడీయూ, టీఎంసీ, డీఎంకేల అధినేతలు అదే కూటమిలో కొనసాగుతున్నారు. తాను ఎప్పుడు వస్తానా? అని ఎదురుచూస్తున్నారు. వస్తే పెద్దన్న పాత్ర అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నారు. అన్నింటికీ మించి కాంగ్రెస్ సైతం సాదరంగా ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉంది. శిష్యుడు రేవంత్ రెడ్డి టీపీసీసీ ప్రెసిడెంట్ గా ఉండడం, బీజేపీని ఎలాగైనా గద్దె దించాలని కాంగ్రెస్ కృతనిశ్చయంతో ఉండడంతో చంద్రబాబుకు అపూర్వ స్వాగతం తప్పదు. అయితేఈ విషయం చంద్రబాబుకు తెలియంది కాదు. కానీ గతానుభవాల దృష్ట్యా వెనుకడుగు వేస్తున్నారు.

చంద్రబాబు ముందున్న ఏకైక లక్ష్యం జగన్ ను గద్దె దించడం. అంతకు మించి టాస్కు పెట్టుకోలేదు. అందుకే జాతీయ రాజకీయాలు ఆహ్వానిస్తున్నా పక్కనపడేశారు. ఆసక్తి ఉన్న అచేతనంగా ఉండిపోవడానికి కారణం కూడా ఒకటే. ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీ శక్తివంతంగా ఉంది. దానిని పడగొట్టాలంటే బీజేపీ, జనసేన అవసరం కీలకం. అందుకే ఆ రెండు పార్టీలను దారిలో తెచ్చేందుకు తన శక్తియుక్తులను వినియోగిస్తున్నారు చంద్రబాబు. అవమానాలను ఎదుర్కొంటున్నారు. అవహేళలను తట్టుకుంటున్నారు. నాకంటూ ఒక రోజు రాకపోదా? అని సీరియస్ గా ఆలోచిస్తున్నారు. అంతవరకూ సైలెంటే ఉత్తమమని భావిస్తున్నారు.