Congress Leadership : దేశంలో ఇండియా అలియాస్ యూపీఏ కూటమి వరుసగా సమావేశాలు నిర్వహిస్తోంది. కాంగ్రెస్ సారథ్యంలో ఈ కూటమి పనిచేస్తోంది. 28 పార్టీలు ఈ కూటమిలో ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో బీజేపీని కేంద్రంలో గద్దె దించడమే లక్ష్యంగా ఏర్పడిన కూటమి ఇప్పుడు పేరులోనూ భారతీయత వచ్చేలా వ్యూహాత్మకంగా పేరు మార్చుకుంది. ఇండియా అని కొత్త పేరు పెట్టుకుంది. గొందలందరికీ మోదీ పేరు ఎందుకు ఉంటుందో అన్నందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ తన ఎంపీ పదవి కోల్పోవాల్సి వచ్చింది. ఇదే కసితో యూపీఏ పేరును ఇండియాగా మార్చారు. అధికార పక్షం, ప్రధాని మోదీ కూటమిని విమర్శిస్తే ఇండియా పేరు ఉశ్చరిస్తారు. తద్వారా భారత దేశాన్ని అవమానించినట్లుగా ప్రచారం చేసే వ్యూహంలో కూటమి పేరు పెట్టినట్లు పొలిటికల్ సర్కికల్స్ పేర్కొంటున్నాయి. ఇదిలా ఉంటే..ఈ కూటమిలో కొన్ని పార్టీలు కాంగ్రెస్ సారథ్యాన్ని అంగీకరించడం లేదు. మరికొన్ని పార్టీలు కాంగ్రెస్ ఉంటేనే కూటమికి విలువ అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి.
వ్యతిరేకిస్తున్న తృణమోల్, ఆప్..
కూటమిలోని 28 పార్టీల్లో కీలకమైనవి మమత సారథ్యంలోని తృణమోల్ కాంగ్రెస్, అరవింద్‌కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్‌ఆద్మీ పార్టీ. తృణమోల్ పశ్చిమబెంగాల్‌లో అధికారంలో ఉండగా, ఆప్ ఢిల్లీ, పంజాబ్‌లో అధికారంలో ఉంది. ఆప్ ఇటీవల జాతీయ పార్టీగా కూడా గుర్తింపు పొందింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సారథ్యాన్ని, కాంగ్రెస్ వ్యక్తి ప్రధాని కావడాన్ని వీరు అంగీకరించే అవకాశం కనిపించడం లేదు. కాంగ్రెస్‌ను విభేదించి కొత్త పార్టీ పెట్టిన మమతాబెనర్జీ.. కాంగ్రెస్ నేత ప్రధాని కావడానికి అంగీకరించదు. వీలైతే తానే ప్రధాని కావాలన్న కోరిక దీదీకి ఉంది. ఇక జాతీయ పార్టీ అధ్యక్షుడు అయిన కేజ్రీవాల్ పార్టీ సిద్దాంతం పరంగా పొత్తులకు వ్యతిరేకి. ఇప్పటి వరకూ ఏ పార్టీలో పొత్తు లేకుండానే ఎన్నికల్లో పోటీ చేశారు. పంజాబ్‌లో స్వంతంగా అధికారంలోకి వచ్చారు. ఇక ఈ రెండు పార్టీలు పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమికి పరోక్ష కారణం.
ఎన్‌సీపీ కూడా..
ఇక ఎన్‌సీపీ అధినేత శరద్‌పవార్ కూడా కాంగ్రెస్ నేత ప్రధాని కావడానికి అంగీకరించరనే అభిప్రాయం ఉంది. ఎందుకంటే శరద్‌పవార్ కూడా కాంగ్రెస్ నాయత్వం నచ్చకనే పార్టీ నుంచి బటకకు వచ్చి కొత్త పార్టీ పెట్టుకున్నారు. మహారాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ ఓటమికి ఎన్‌సీపీ కూడా కారణం.
పొత్తులతో పోటీ చేయలేని పరిస్థితి..
మూడు కీలక పార్టీలు తృణమోల్, ఆప్, ఎన్‌సీపీ ఆయా రాష్ట్రాల్లో కూటమిగా పని చేయలేని పరిస్థితి. పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్ పోటీ చేయవద్దని దీదీ ముందే కండీషన్ పెట్టింది. ఇక ఆప్ పొత్తులకు వ్యతిరేకం కాబట్టి కలిసి పోటీచేసే చాన్స్ లేదు. ఎన్‌సీపీ కూడా మహారాష్ట్రలో కాంగ్రెస్‌తో ఎన్‌సీపీ కలిసి పనిచేయలేని పరిస్థితి.
అవసరాల మేరకే కూటమిలో..
ముగ్గురు నేతలు తమ సొంత అవసరాల కోసమే కూటమిలో ఉంటున్నారనేది వాస్తవం. మమతాబెనర్జీ, శరద్‌పవార్ ప్రధాని పదవి కోసం ఆశపడుతున్నారు. కూటమి అధికారంలోకి వస్తే ప్రధాని కావొచ్చన్న భావనలో ఉన్నారు. ఇక కేజ్రీవాల్ కేంద్రం తెచ్చే ఆర్డినెన్స్ వ్యతిరేకిస్తామని కాంగ్రెస్ ప్రకటించినందుకే కూటమిలో చేరింది. ఎన్నాళ్లు కూటమిలో కొనసాగుతుందో చెప్పలేం.