CM Chandrababu: ఆ రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలపై చంద్రబాబు గురి.. వైసీపీకి చావు దెబ్బ

రాజకీయ వ్యూహాలు రూపొందించడంలో చంద్రబాబుకు మంచి పేరు ఉంది. 2019 ఎన్నికల్లో ఓటమి ఎదురయ్యేసరికి టీడీపీ పని అయిపోయిందని అంతా భావించారు. కానీ గత ఏడాది జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టు బిగించారు చంద్రబాబు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరోసారి సత్తా చాటాలని భావిస్తున్నారు.

Written By: Dharma, Updated On : October 21, 2024 8:24 am

CM Chandrababu

Follow us on

CM Chandrababu: ఏపీలో మరో ఎన్నిక రానుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు రెండింటికి ఎన్నిక జరగనుంది. కృష్ణా-గుంటూరు, ఉభయగోదావరి జిల్లాలకు సంబంధించి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్సీల పదవీకాలం 2025 మార్చితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికలకు ఈసీ సన్నాహాలు చేస్తోంది. ఓట్ల నమోదు తో పాటు ఇతరత్రా ప్రక్రియను ప్రారంభించింది. ఈ తరుణంలో తెలుగుదేశం పార్టీ ముందుగానే అప్రమత్తం అయ్యింది. పార్టీ అభ్యర్థులుగా మాజీమంత్రి ఆలపాటి రాజా, పేరాబత్తుల రాజశేఖర్ పేర్లను ఖరారు చేసింది.గత ఏడాది జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే వైసీపీ పతనం ప్రారంభమైంది. ఉత్తరాంధ్రతో పాటు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో టిడిపి అభ్యర్థులు విజయం సాధించారు. అప్పటినుంచి వైసిపి కౌంట్ డౌన్ ప్రారంభం అయ్యింది. అయితే ఇప్పుడు అదే మాదిరిగా తన మార్కు చూపించాలని వైసీపీ భావిస్తోంది. అందుకే కృష్ణా- గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా గౌతమ్ రెడ్డి పేరును జగన్ ఖరారు చేశారు. ఉభయగోదావరి జిల్లాలకు సంబంధించి మాత్రం పెండింగ్ లో ఉంచారు. అయితే టిడిపి అభ్యర్థులు ఆలపాటి రాజా, పేరాబత్తుల రాజశేఖర్ ఇప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభించారు. ఆలపాటి రాజా అయితే పట్టభద్రుల ఓట్ల నమోదుపై దృష్టి పెట్టారు. ఇందుకుగాను ప్రత్యేక వీడియోను సైతం సోషల్ మీడియాలో విడుదల చేశారు. రాజశేఖర్ కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఈ విషయంలో జనసేన సైతం ఆయనకు మద్దతు తెలుపుతోంది. కూటమి ప్రభుత్వం ఉన్న దృష్ట్యా మూడు పార్టీలు సంయుక్తంగా.. ఈ రెండు ఎమ్మెల్సీలను కైవసం చేసుకోవాలని గట్టి ప్రయత్నం తోనే ఉన్నాయి.

* ఈవీఎంలపై రెఫరండం
ఏపీలో ఎన్నికల ఫలితాలు వచ్చిన నాటి నుంచి వైసీపీ ఒక రకమైన ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈవీఎంలపై అనుమానం వ్యక్తం చేస్తున్న సంగతి విధితమే. ఈ తరుణంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు బ్యాలెట్ పై జరగనున్నాయి. దీంతో కూటమి దీనిపై సవాల్ చేసే అవకాశం ఉంది. బ్యాలెట్ పత్రాలతో ఎన్నిక జరగనున్న దృష్ట్యా దీనిని ఎజెండాగా తీసుకోవాలని పిలుపునిచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. అయితే దీనిపై వైసిపి ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇటీవల హర్యానా ఎన్నికల్లో బిజెపి విజయంతో.. ఈవీఎంలపై ఒక రకమైన ప్రచారం మొదలైంది. జగన్ సైతం ఈ ఫలితాలపై అనుమానం వ్యక్తం చేశారు. ఈవీఎంల పనితీరుపై ఒక రకమైన కామెంట్స్ చేశారు.

* సత్తా చాటనున్న కూటమి
అయితే ఈ రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు కూటమి పార్టీలు ఈజీగా గెలుచుకునే అవకాశం ఉంది. కృష్ణా గుంటూరులో టిడిపి సంస్థాగతంగా బలంగా ఉంది. ఉభయగోదావరి జిల్లాల్లో జనసేన బలంగా ఉంది. ఆపై టిడిపి ఎమ్మెల్యేలు ఏకపక్షంగా విజయం సాధించారు. అక్కడ వైసీపీ గెలుపు అంత ఈజీ కాదు. అయితే గౌతంరెడ్డి అనే వైసీపీ నేతను రంగంలోకి దించారు జగన్. ఆయన ఆర్థికంగా బలమైన నేత. అందుకే చంద్రబాబు తన వ్యూహానికి పదును పెట్టారు. మాజీ మంత్రి ఆలపాటి రాజాను రంగంలోకి దించారు. తెనాలి నుంచి జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ రంగంలోకి దిగడంతో.. ఆలపాటి రాజాకు చాన్స్ దక్కలేదు. అయితే ఇప్పుడు రాజా గెలుపు బాధ్యతను గుంటూరు వరకు మంత్రి నాదెండ్ల మనోహర్ పై పెట్టారు చంద్రబాబు. కృష్ణాజిల్లాలు టిడిపి బలంగా ఉండడంతో.. ఆలపాటి రాజా గెలుపు నల్లేరు పై నడకవుతోందని చంద్రబాబు భావిస్తున్నారు. అటు ఉభయగోదావరి జిల్లాలో రాజశేఖర్ తప్పకుండా విజయం సాధిస్తారని నమ్మకంగా ఉన్నారు చంద్రబాబు. కాపు సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో జనసేన తప్పకుండా సపోర్ట్ చేస్తుందన్న నమ్మకం ఉంది. మొత్తానికైతే రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు దక్కించుకొని.. సత్తా చాటాలని చంద్రబాబు భావిస్తున్నారు. మరి పరిస్థితులు ఎంతవరకు అనుకూలిస్తాయో చూడాలి.