Nara Bhuvaneshwari : నారా భువనేశ్వరి.. ఈ పేరు తెలియని వారు ఉండరు. ప్రస్తుత సీఎం నారా చంద్రబాబు సతీమణి ఆమె. మాజీ సీఎం నందమూరి తారకరామారావు కుమార్తె. స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ సోదరి. యువ నేత నారా లోకేష్ తల్లి.. అందుకే ఆమె గురించి పరిచయం అక్కర్లేదు. అయితే ఎన్నడు రాజకీయ వేదికలు పంచుకొని ఆమె… చంద్రబాబు అరెస్ట్ సమయంలో బయటకు వచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేశారు. అంతకుముందు చంద్రబాబు హెరిటేజ్ సంస్థల బాధ్యతను చూసుకునేవారు. నారా బ్రాహ్మణి కోడలుగా వచ్చిన తర్వాత ఆమె బాధ్యతలు స్వీకరించారు. అయితే ఇప్పటికీ కుటుంబంలో బాస్ భువనేశ్వరి అని చంద్రబాబు చాలా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. తన విజయం వెనుక ఆమె ఉన్నారు అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే చంద్రబాబు రాజకీయ జీవితంలో ఉండడం వల్ల.. కుటుంబంతో గడపడం తక్కువని భువనేశ్వరి సైతం తనలో ఉన్న ఆవేదనను వ్యక్తం చేశారు. తాజాగా ఫ్యామిలీ ఎమోషన్స్ ను పంచుకున్నారు భువనేశ్వరి. ఇందుకు కుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాల వేదిక అయింది. విద్యార్థులతో నిర్వహించిన ముఖాముఖిలో ఆమె ఆసక్తికరమైన సమాధానాలు చెప్పారు.
* చంద్రబాబు అస్సలు టైం ఇవ్వరు
నారా లోకేష్ ను తాను చాలా పద్ధతిగా పెంచానని.. అందుకే తనను హిట్లర్ అని పిలిచేవాడని తల్లి భువనేశ్వరి గుర్తు చేశారు. చంద్రబాబు తనకు అస్సలు టైం ఇవ్వరని.. ఆయన ఎప్పుడూ బిజీగా ఉండడం వల్ల తాను కూడా ఎప్పుడు ఆయనను డిస్టర్బ్ చేయనని ఆమె పేర్కొన్నారు. నందమూరి బాలకృష్ణ తనకు తమ్ముడు కాదని.. అన్నయ్య అని.. కానీ ఈ విషయం చాలామందికి తెలియదు అన్నారు. తనకు 19 సంవత్సరాలకే పెళ్లి చేశారని.. అప్పటికి తనకు ఏమీ తెలియదని.. తన భర్త చంద్రబాబు తనపై నమ్మకంతో హెరిటేజ్ బాధ్యతలు అప్పగించిన విషయాన్ని చెప్పుకొచ్చారు.దానిని ఒక్క ఛాలెంజ్ గా తీసుకొని పనిచేశానని పేర్కొన్నారు. ఒకప్పుడు మహిళలు ఇంటికే పరిమితం అయ్యేవారని.. ఇప్పుడు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారని చెప్పుకొచ్చారు. విద్యార్థులు కష్టపడి బాగా ఎదగాలని ఆకాంక్షించారు.
* కుప్పం నియోజకవర్గం పై ఫోకస్
ఇటీవల కుప్పం నియోజకవర్గం పై నారా భువనేశ్వరి ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. గత ఐదేళ్లలో జరిగిన ఘటనలు దృష్ట్యా వీలైనంతవరకు కుప్పం నియోజకవర్గంలో గడుపుతున్నారు. ఇప్పటికే చంద్రబాబు కుప్పంలో సొంత ఇంటిని నిర్మించుకుంటున్నారు. కుప్పం నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తామని.. అందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్లు భువనేశ్వరి విద్యార్థుల ముఖాముఖిలో తెలియజేశారు.