https://oktelugu.com/

Chandrababu – BJP : బీజేపీకి భయపడుతున్న చంద్రబాబు

ఈ పార్లమెంట్ సమావేశాల్లో బీజేపీ బిల్లుపెట్టే అవకాశమున్నందున.. దాని పర్యవసానాలు చూసుకొని ఒక అడుగు ముందుకేద్దామని సహచరుల వద్ద చంద్రబాబు వ్యాఖ్యానించినట్టు తెలిసింది.

Written By:
  • Dharma
  • , Updated On : July 22, 2023 11:27 am
    Follow us on

    Chandrababu – BJP : ఏపీలో ఎన్నికలకు పట్టుమని పది నెలలు కూడా లేదు. దీంతో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందన్న చర్చ మొదలైంది. అధికార వైసీపీ మరోసారి అధికారంలోకి వచ్చేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. అటు టీడీపీ సైతం జీవన్మరణ సమస్యగా భావిస్తోంది. పవన్ సైతం ఎన్నికల్లో గట్టి ముద్ర చూపించాలని భావిస్తున్నారు. కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వంలో జనసేన కీలక భాగస్వామ్యంగా ఉండాలని స్ట్రాంగ్ గా డిసైడయ్యారు. ఎన్డీఏలో కీలక భాగస్వామ్యంగా మారారు. బీజేపీతో స్నేహం కొనసాగిస్తూనే టీడీపీని కలుపుకెళ్లాలని చూస్తున్నారు. అప్పుడే వైసీపీ విముక్త ఏపీ సాధ్యమని చెబుతున్నారు. అటు బీజేపీని, ఇటు టీడీపీని కలపాలని చూస్తున్నా.. ఆ రెండు పార్టీల నుంచి ఎటువంటి సంకేతాలు రావడం లేదు.

    పవన్ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశానికి వెళ్లక ముందే చంద్రబాబు బీజేపీ అగ్రనేత అమిత్ షాను కలిశారు. అప్పట్లోనే రెండు పార్టీల మధ్య పొత్తులు కుదిరినట్టు వార్తలు వినిపించాయి. తరువాత ఎటువంటి సమావేశాలు జరగలేదు. మొన్నటి ఎన్డీఏ సమావేశానికి టీడీపీకి ఆహ్వానం లేదు. అయితే ఇప్పటికే బీజేపీ,జనసేన, టీడీపీ లు కలిసి పనిచేయాలని డిసైడయ్యాయని.. కానీ కీలక చర్చల విషయంలో ప్రతిష్ఠంభన కొనసాగుతోందని తెలుస్తోంది. టీడీపీ తెలంగాణ ఎన్నికల్లో వాడుకోవాలని బీజేపీ భావిస్తుండగా.. బీజేపీతో కలిసి వెళితే జరిగే నష్టాన్న అంచనా వేసి టీడీపీ ఆందోళన చెంతుతోంది.

    ఎన్డీఏ సర్కారు ఉమ్మడి పౌరస్మృతి (యూనిఫామ్) సివిల్ కోడ్ బిల్లు తేనున్న సంగతి తెలిసిందే. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లును ఉభయ సభల్లో ప్రవేశపెట్టేందుకు కేంద్రం నిర్ణయించింది. దీనిపై దేశ వ్యాప్తంగా ముస్లింలు గుర్రుగా ఉన్నారు. ఏపీలో సైతం బీజేపీపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే లా కమిషన్ చేపట్టిన అభిప్రాయ సేకరణకు ముస్లింలు లక్షల సంఖ్యలో తమ అభిప్రాయాలు పంపారు. ఇంకా పంపుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ లో కేంద్రం తీసుకొచ్చే బిల్లు కచ్చితంగా తమ మనోభావాలకు వ్యతిరేకంగా ఉందని భావిస్తున్నారు. దీంతో చంద్రబాబు పునరాలోచనలో పడ్డారు.

    ఇప్పటికే ఏపీలో కీలక వర్గాలు టీడీపీకి దూరమయ్యాయి. పార్టీ ఆవిర్భావం నుంచి వెన్నుదన్నుగా నిలుస్తున్న బీసీలు సైతం గత ఎన్నికల్లో వైసీపీ వైపు మళ్లారు. వచ్చే ఎన్నికల నాటికి వారు టీడీపీ వైపు వస్తారా? లేరా? అన్నది ప్రశ్నార్థకమే. ఇంతోకొంద ముస్లింలు ఇప్పుడు టీడీపీ వైపు సానుకూలతగా ఉన్నారు. ఇటువంటి సమయంలో బీజేపీతో చెలిమి చేస్తే చేటు తప్పదని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే పొత్తు విషయంలో బయటపడడం లేదు. మునుపటి అంత ఆసక్తికనబరచడం లేదు. ఈ పార్లమెంట్ సమావేశాల్లో బీజేపీ బిల్లుపెట్టే అవకాశమున్నందున.. దాని పర్యవసానాలు చూసుకొని ఒక అడుగు ముందుకేద్దామని సహచరుల వద్ద చంద్రబాబు వ్యాఖ్యానించినట్టు తెలిసింది. సో ఈ పార్లమెంట్ సమావేశాల అనంతరం టీడీపీ, బీజేపీ పొత్తులపై ఒక క్లారిటీ రానుందన్న మాట.