Telugu Film Chamber Election 2023
Telugu Film Chamber Election 2023: టాలీవుడ్ ఫిల్మ్ ఛాంబర్ లో మళ్ళి ఎన్నికల సమరం మొదలైంది. టాలీవుడ్ ఎన్నికలు అంటేనే రణరంగాన్ని తలపిస్తాయి. గతంలో జరిగిన “మా ” ఎన్నికలు ఎంతటి వివాదాన్ని సృష్టించాయో అందరికీ తెలుసు. ఇక ఇప్పుడు తాజాగా నిర్మాత మండలి ప్రెసిడెంట్ కి సంబంధించిన ఎన్నికల నగారా మోగింది. ఇప్పటికే నామినేషన్ పర్వం ముగిసింది. ఈ నెల 14న నామినేషన్స్ పూర్తి కాగా, ఈ నెల 21న నామినేషన్ విత్ డ్రా చేసుకోవడానికి సమయం ముగిసింది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు, సి. కళ్యాణ్ ప్యానల్స్ మధ్యనే పోటీ ఉండవచ్చు, వీళ్ళిద్దరే అధ్యక్ష పోటీలో నిలబడుతున్నారు.
నిర్మాత మండలి లో ముఖ్యంగా తెలుగు నిర్మాతల సెక్టార్, డిస్టిబ్యూటర్ సెక్టార్ , స్టూడియో సెక్టార్ కు ఎన్నికలు జరుగుతున్నాయి. ఎగ్జిబిటర్ సెక్టార్ ఎన్నికలు ఏకగ్రీవం అయ్యాయి. ఇక ఇందులో ప్రధాన పోటీగా నిలబడిన దిల్ రాజు ఇప్పటికే యాక్టీవ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ లో కీలక సభ్యుడిగా ఉన్నాడు, సి.కళ్యాణ్ ఇప్పటికే సౌత్ ఫిల్మ్ ఛాంబర్ కి ప్రెసిడెంట్ గా వర్క్ చేసిన అనుభవం కూడా ఉంది.
గతంలో తెలుగు నిర్మాత మండలికి, యాక్టీవ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ కి మధ్య కోల్డ్ వార్ జరిగిన విషయం తెలిసిందే, కొన్ని సందర్భాల్లో గిల్డ్ తీసుకున్న నిర్ణయాన్ని నిర్మాత మండలి తప్పు పట్టిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఆల్రెడీ నిర్మాత మండలి ఉండగా మరొక గిల్డ్ ఎందుకు అనే ప్రశ్నలు కూడా వచ్చాయి. అయితే టాలీవుడ్ లో ఒకటి అరా సినిమాలు తీసి ఖాళీగా ఉన్న వాళ్లతో సంబంధం లేకుండా యాక్టివ్ గా సినిమాలు నిర్మించే వాళ్ళందరూ కలిసి ఏర్పాటు చేసుకున్నదే గిల్డ్ అంటూ సమాధానం ఇచ్చారు దిల్ రాజు లాంటి వాళ్ళు.
అయితే గతంలో జరిగిన కొన్ని సంఘటనలను దృష్టిలో పెట్టుకొని నిర్మాత మండలిలో కూడా తమ ఆధిపత్యం ఉంటేనే తాము తీసుకున్న నిర్ణయాలకు గట్టి మద్దతు ఉంటుందని భావించిన గిల్డ్ ఈ ఎన్నికల్లో పోటీకి దిగుతుంది. ఏకంగా దిల్ రాజు అధ్యక్ష బరిలో నిలవడంతో ఈ ఎన్నికలు రసవత్తరంగా మారిపోయాయి, ఈ నెల 30న ఎన్నికలు జరగబోతున్నాయి.