Chandrababu: ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి దాదాపు 15 నెలలు అవుతోంది. పాలనతో పాటు సంక్షేమ పథకాలను పట్టాలు ఎక్కించారు ఏపీ సీఎం చంద్రబాబు. ఈ తరుణంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతి ఇంటికి రేషన్ కార్డ్, ఆధార్ కార్డు మాదిరిగా.. ఫ్యామిలీ కార్డు ఇవ్వాలని నిర్ణయించారు. స్వయంగా ఆ విషయాన్ని సీఎం చంద్రబాబు ప్రకటించారు. వాస్తవానికి సీఎం చంద్రబాబు సంక్షేమ పథకాలకు వ్యతిరేకం అని ప్రత్యర్థులు ప్రచారం చేశారు. కానీ అందుకు విరుద్ధంగా వ్యవహరించారు చంద్రబాబు. పాలనను గాడిలో పెడుతూనే.. సంక్షేమ పథకాలను అమలు చేయడం ప్రారంభించారు. అధికారంలోకి వచ్చింది మొదలు సంక్షేమ పథకాలను అమలు చేయడం మొదలుపెట్టారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్ మొత్తాన్ని పెంచి.. తనకంటూ ఒక కొత్త ముద్రను చాటుకున్నారు చంద్రబాబు. గతానికి భిన్నంగా వ్యవహరించారు. మూడు వేల రూపాయలు ఉన్న పెన్షన్ మొత్తాన్ని ఏకకాలంలో నాలుగు వేల రూపాయలకు పెంచి చూపించారు. ముఖ్యంగా సూపర్ సిక్స్ పథకాల పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. అసలు ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇచ్చారని ప్రత్యర్ధులు ప్రచారం చేశారు. కానీ దానిని సుసాధ్యం చేసి చూపించారు చంద్రబాబు.
Also Read: వర్షం పడింది.. కండోమ్ ల కథ బయటపడింది
* ఆ విమర్శలకు చెక్ చెబుతూ..
చంద్రబాబు ట్రాక్ రికార్డును చూసుకుంటే పాలనాపరంగా ముద్ర చాటుకున్నారే తప్ప సంక్షేమ పథకాల విషయంలో.. పెద్దగా ప్రభావం చూపింది తక్కువ. కానీ 2019, 2024 మధ్య జరిగిన పరిణామాలు ఆయనలో మార్పుకు కారణమయ్యాయి. ప్రజలు అభివృద్ధితోపాటు సంక్షేమాన్ని కోరుకుంటున్నట్లు అర్థమైంది. అందుకే అభివృద్ధి తో పాటు సంక్షేమ పథకాలకు ప్రాధాన్యం ఇచ్చారు చంద్రబాబు. అందులో భాగంగానే సూపర్ సిక్స్ పథకాలకు ప్రాధాన్యం ఇచ్చారు. అయితే చంద్రబాబు అధికారంలోకి వచ్చేందుకే ఈ తరహా హామీలు ఇచ్చారని అంతా భావించారు. చివరకు సొంత పార్టీ శ్రేణులతో పాటు కూటమి పార్టీల శ్రేణులు కూడా అలానే భావించాయి. కానీ అనూహ్యంగా సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయడం ప్రారంభించారు చంద్రబాబు. ముఖ్యంగా పింఛన్ మొత్తాన్ని 3,000 నుంచి 4 వేల రూపాయలకు పెంచిన ఘనత చంద్రబాబుదే. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఏడాదికి రూ.250 పెంచుకుంటూ పోతూ.. మూడు వేల రూపాయలకు చేరుకున్నారే తప్ప.. ఏకకాలంలో పెంచలేకపోయారు. కానీ చంద్రబాబు మాత్రం మూడు వేల రూపాయల నుంచి ఏకకాలంలో 4వేల రూపాయలకు పెంచారు. మూడు నెలల బకాయిని సైతం అందించారు. అంతటితో చంద్రబాబు సంక్షేమం ఆగలేదు. మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం, ఆపై అన్న క్యాంటీన్ల ప్రారంభం వంటి పథకాలను అమలు చేశారు.
* ప్రత్యర్థులకు అందని విధంగా..
అయితే చంద్రబాబు అమలు చేసిన పథకాల విషయంలో ప్రత్యర్ధులు విరుద్ధంగా ప్రచారం చేశారు. ప్రధాన పథకాలను విస్మరించి.. తక్కువ ఖర్చుతో కూడిన పథకాలను మాత్రమే అమలు చేశారని ఆరోపణలు చేశారు. అందుకే చంద్రబాబు ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంలో ప్రధానమైన పథకాలకు శ్రీకారం చుట్టారు. తల్లికి వందనం పథకం ద్వారా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 13 వేల రూపాయల చొప్పున సాయం అందించారు. అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేసి కేంద్రం అమలు చేసిన పీఎం కిసాన్ తో కలిపి ఏడు వేల రూపాయలు అందించగలిగారు. ఆర్టీసీలో ఉచిత ప్రయాణం సైతం మొదలుపెట్టారు. ఏకకాలంలో 5 ఏపీఎస్ఆర్టీసీ సర్వీసుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించారు. తద్వారా సూపర్ సిక్స్ పథకాల్లో దాదాపు అన్ని పథకాలను అమలు చేశారు. ఇప్పుడు రేషన్ కార్డులను స్మార్ట్ కార్డులు కింద మార్చి అందించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలకు ఇన్ని చేసిన చంద్రబాబు.. వారు గుర్తించే విధంగా సంక్షేమ పథకాలను ప్రతి కుటుంబానికి ఎంత వర్తించిందో తెలియజెప్పే విధంగా ఫ్యామిలీ కార్డ్ అందించాలని నిర్ణయించారు. ఒకవైపు అభివృద్ధి.. మంచి పాలన అందించి.. ఇప్పుడు ఫ్యామిలీ కార్డు ద్వారా ప్రతి కుటుంబం ఎంత లబ్ధి పొందిందో.. వారికి తెలియజెప్పే విధంగా తాజాగా ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం.