Chandrababu:’హనుమంతుడు ముందా కుప్పిగెంతులు’ అంటారు. ఇది ప్రస్తుతం చంద్రబాబుకు అతికినట్టు సరిపోతుంది. ఎన్నికల్లో విజయం మాట అటుంచితే.. ఇప్పటివరకు జరిగిన పరిణామాల్లో చంద్రబాబుదే పైచేయి. గత ఐదు సంవత్సరాలుగా ఏ పార్టీ చంద్రబాబును ద్వేషించిందో, దగ్గరకు రానీయమని చెప్పిందో.. ఎన్నికల ముంగిట అదే పార్టీ టిడిపి తో పొత్తు పెట్టుకుంది. టిడిపిని ఎన్డీఏలో చేర్చుకుంది. చంద్రబాబు చెప్పినన్ని సీట్లను తీసుకుంది. ఇలా తీసుకున్న సీట్లలో సైతం చంద్రబాబు పంపించిన అభ్యర్థులను ప్రకటించింది. ఒక్క మాటలో చెప్పాలంటే బిజెపి చంద్రబాబు ఎదుట మోకరిల్లింది. చంద్రబాబు కాళ్లా వేళ్లా పడ్డారని నీలి మీడియా రాసుకుంది. అది ఉత్త మాటగానే తేలిపోయింది. అదే జరిగి ఉంటే.. బిజెపిలోని ప్రో వైసిపి నేతలకు సీట్లు దక్కేవి కదా? బిజెపి ఆశించిన స్థానాలు ఇచ్చేవారు కదా? కానీ అలా జరగలేదు.
పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాలు.. బిజెపికి పది అసెంబ్లీ, ఆరు పార్లమెంట్ స్థానాలు దక్కాయి. అంటే మొత్తం 31 అసెంబ్లీ, 8 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. అయితే ఇందులో పోటీ చేసిన నేతలు ఎక్కువమంది పూర్వాశ్రమంలో తెలుగుదేశం పార్టీలో పని చేసిన వారే. టిడిపి ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేసిన వారే. పైగా టిడిపిలోకి వైసిపి, కాంగ్రెస్ నుంచి రావాల్సినవారే. మరోవైపు టిడిపి నుంచి జనసేనకు, బిజెపిలోకి వెళ్లిన మెజారిటీ నాయకులకు సీట్లు దక్కాయి. ఒక మిత్రపక్షం నుంచి, మరో మిత్రపక్షంలోకి పంపించి టిక్కెట్లు ఇప్పించడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు. ఆ క్రెడిట్ మొత్తం ఆయనదే. అందుకే ఆయనను రాజకీయ అపర చాణుక్యుడు అంటారు.
అయితే బిజెపి, జనసేనకు కేటాయించిన సీట్లు చూస్తే.. అక్కడ గతంలో తెలుగుదేశం పార్టీ గెలిచింది తక్కువ. కేవలం ఓడిపోయిన సీట్లను ఇవ్వడంలో చంద్రబాబు చతురత ప్రదర్శించారు. తప్పకుండా గెలిచే సీట్లను ఆ రెండు పార్టీల్లో ఉన్న తన అనుకూలమైన నేతలకు ఇప్పించారు. ఎక్కడైతే సీట్ల సర్దుబాటులో భాగంగా టిక్కెట్ కోల్పోయిన సీనియర్లకు ఆ రెండు పార్టీల్లోకి పంపించారు. ఇలా ఎలా చూసుకున్నా పొత్తులో భాగంగా మూడు పార్టీల నుంచి పోటీ చేస్తున్న వారిలో సింహభాగం తెలుగుదేశం పార్టీ వారే. ఈ విషయంలో పవన్ సైతం ఉదాసీనంగా వ్యవహరించారు. అటు బిజెపి అగ్ర నేతలు సైతం తమకు పట్టనట్టుగా వ్యవహరించారు. ఈ మొత్తం ప్రక్రియలో చంద్రబాబు అనుకున్నది సాధించగలిగారు. దటీజ్ చంద్రబాబు అని విశ్లేషకులు సైతం అభినందిస్తున్నారు.