Chandrababu: తెలుగుదేశం పార్టీ వారు ఎక్కువగా ఆంధ్రజ్యోతిని ఇష్టపడతారు. జగన్ కు వ్యతిరేకంగా కథనాలు వస్తాయి కాబట్టి.. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆ పత్రిక అన్న, ఆ ఛానల్ అన్న తెగ ఇష్టపడతారు. అయితే తెలుగుదేశం పార్టీలో హై ప్రొఫైల్ నేతలు మాత్రం ఆంధ్రజ్యోతి ఆర్కే ను ఎక్కువగా వ్యతిరేకిస్తారు. ఆయన వైఖరిని తప్పు పడతారు. అంతెందుకు బాలకృష్ణ చాలు. రాధాకృష్ణ అంటే నమ్మరు. అందుకే బాలకృష్ణ వార్తలకు, ఫోటోలకు ఆంధ్రజ్యోతిలో స్థానం ఉండదు. అయితే ఆంధ్రజ్యోతితో తెలుగుదేశం పార్టీకి ఎంత ప్రయోజనమో.. అంత నష్టం అన్న కామెంట్స్ వినిపిస్తుంటాయి. తాజాగా ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఓ కథనం వైరల్ అవుతోంది. తిరిగి ఎన్డీఏ గూటికి జగన్ చేరుతారు అన్నది ఆ కథనం సారాంశం. సరిగ్గా టిడిపి ఎన్ డి ఏ లో ఉండగా.. తెలుగుదేశం అనుకూల పత్రికలో ఆ కథనం రావడం విమర్శలకు తావిస్తోంది.
విశాఖలో జగన్ బస్సు యాత్ర చేపట్టారు. స్టీల్ ప్లాంట్ కార్మికులు ఆయనను కలిశారు. ఎన్డీఏకు సరైన మెజారిటీ రాకుంటే.. ఎన్నికల తరువాత తాను ఎన్డీఏలో చేరతానని.. అప్పుడు స్టీల్ ప్లాంట్ అంశాన్ని ప్రాధాన్యతాంశంగా తీసుకొని సమస్యకు పరిష్కార మార్గం చూపిస్తానని జగన్ చెప్పుకొచ్చినట్లు ఈ కథనం ఉంది. ఒకవైపు చంద్రబాబు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని.. టిడిపి ఈ రాష్ట్ర అభివృద్ధికి కీలక భాగస్వామ్యం అవుతుందని చెప్పుకొస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో జగన్ ఎన్డీఏలోకి ఎంట్రీ ఇవ్వడం కష్టమని తేల్చి చెబుతున్నారు. తద్వారా ప్రజలకు తాను ఒక ఆప్షన్ అని.. కూటమిని ఆశీర్వదించాలని కోరుతున్నారు. అందుకు విరుద్ధంగా ఆంధ్రజ్యోతి కథనం ఉండడం విశేషం.
ప్రస్తుతం మూడు పార్టీలు కలిపి కూటమిగా పోటీ చేస్తున్నాయి. ప్రధానంగా బిజెపి, టిడిపిల మధ్య ఓట్ల బదలాయింపు సక్రమంగా జరగదన్న ప్రచారం జరుగుతోంది. ఒకవేళ జగన్ కూటమి వైపు అడుగులు వేస్తే.. టిడిపి అంటే ఇష్టపడని బిజెపి వర్గాలు జగన్ వైపు తప్పకుండా వెళ్తాయి. ఆంధ్రజ్యోతిలో రాతలు కూడా అలానే ఉన్నాయి. టిడిపి అంటే పడని బిజెపి వర్గాలు వైసీపీ వైపు టర్న్ చేసే ఉద్దేశం ఆంధ్రజ్యోతి ఆర్కే కు ఉందా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. తెలుగుదేశం పార్టీకి మంచి చేయాలన్న ఉద్దేశంతో రాస్తున్న ఇటువంటి కథనాలు.. అంతిమంగా ఆ పార్టీకే నష్టం చేకూరుస్తున్నాయి. ఇక ఆలోచించుకోవాల్సింది ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ.