Chandrababu: ఏపీలో మరో మూడు రోజుల్లో నామినేషన్ల పర్వం ముగియనుంది. అన్ని పార్టీల నుంచి అభ్యర్థులు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. మరోవైపు పార్టీల అధిష్టానాలు బి ఫారాలను పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే బీఫారాలు దక్కుతాయని భావించిన అభ్యర్థులు నామినేషన్లు అట్టహాసంగా వేశారు. అయితే అటువంటి వారికి తెలుగుదేశం పార్టీ షాక్ ఇచ్చింది. పార్టీ బీఫారాల పంపిణీకి.. ఏకంగా 14 మంది అభ్యర్థులు గైర్హాజరు కాగా.. హాజరైన ఇద్దరికీ చంద్రబాబు ఫారాలను అందించలేదు. బిగ్ షాక్ ఇచ్చారు. దీంతో ఆ ఇద్దరు అభ్యర్థులు ఆందోళనకు గురయ్యారు.
కూటమిలో సర్దుబాటు అంశం కొలిక్కి రాలేదు. నిన్నటికి నిన్న టిడిపి రాష్ట్రవ్యాప్తంగా నాలుగు చోట్ల అభ్యర్థులను మార్చింది. రఘురామ కోసం ఉండి అభ్యర్థి మంతెన రామరాజును తప్పించింది. మాడుగులలో అభ్యర్థి పైల ప్రసాద్ ను తప్పించి మాజీమంత్రి బండారు సత్యనారాయణమూర్తికి ఛాన్స్ ఇచ్చింది. అటు పాడేరులో సైతం గిడ్డి ఈశ్వరికి అనూహ్య ఛాన్స్ దక్కింది. మరోచోట కూడా టిడిపి అభ్యర్థిని మార్చి ప్రకటించింది. అయితే అనపర్తి కోసం దెందులూరు, తంబళ్లపల్లె నియోజకవర్గం వర్గాలను పెండింగ్ పెట్టింది. అక్కడ ఇదివరకే అభ్యర్థులను ప్రకటించారు. అనపర్తి పొత్తులో భాగంగా బిజెపి దక్కించుకుంది. అక్కడ టిడిపి ఇన్చార్జి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి టిక్కెట్ ఆశిస్తున్నారు. ఆయనను బిజెపిలో చేర్పించి టికెట్ ఇవ్వాలని చూస్తున్నారు. అయితే అందుకు ఆయన అంగీకరించడం లేదు.దీంతో అనపర్తి బదులు దెందులూరు ఇస్తే తీసుకుంటామని బిజెపి చెబుతోంది. చంద్రబాబు మాత్రం తంబళ్లపల్లె ఇస్తామని చెబుతున్నారు. ప్రస్తుతానికి ఈ అంశం పెండింగ్లో ఉంది.
తంబళ్లపల్లెలో ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా జయ చంద్రారెడ్డి ఖరారు అయ్యారు. ఆయన అభ్యర్థిత్వాన్ని ఇతరులు వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు ఈ సీటును బిజెపికి కేటాయించేందుకు చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు నరసరావుపేట అభ్యర్థి అరవింద్ బాబుకు చంద్రబాబు బి ఫారం అందించలేదు. ఆయన30 కోట్ల రూపాయలు డిపాజిట్ చేయకపోవడంతో.. ఆ నియోజకవర్గంలో గెలవలేమని చంద్రబాబు భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అక్కడ అభ్యర్థికి ఆర్థిక సమస్యలు ఉండడంతో.. బి ఫారం ఇచ్చేందుకు చంద్రబాబు ఇష్టపడలేదని తెలుస్తోంది. అయితే దెందులూరు, అనపర్తి విషయంలో సహేతుకమైన కారణాలు ఉన్నా.. మిగతా రెండు నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఖరారు అయినా.. చంద్రబాబు బి ఫారాలు అందించకపోవడం పార్టీలోనే చర్చకు దారితీసింది. తెలుగుదేశం పార్టీలో ఒక రకమైన అయోమయానికి కారణమవుతోంది.