Balineni Srinivas Reddy: మాజీ మంత్రి బాలినేని అంతర్మధనంలో ఉన్నారా? అష్టదిగ్బంధంలో చిక్కుకున్నారా? అనవసరంగా వైసీపీని విడిచి పెట్టానని భావిస్తున్నారా? ఆయనకు కోలుకోలేని దెబ్బ తగిలిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. వైసీపీలో ఒక వెలుగు వెలిగారు బాలినేని. జగన్ తొలి క్యాబినెట్లో చోటు దక్కించుకున్నారు. విస్తరణలో మంత్రి పదవికోల్పోయేసరికి తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. అప్పటినుంచి జగన్ కు చికాకు పెడుతూనే ఉన్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేశారు. కానీ ఓడిపోయారు. ఒంగోలులో టిడిపి అభ్యర్థి ఘన విజయం సాధించారు. అక్కడ తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది. దీంతో పార్టీ మారుద్దాం అనుకున్న బాలినేనికి టిడిపిలో అవకాశం లేకుండా పోయింది. తప్పనిసరి పరిస్థితుల్లో జనసేనలో చేరాల్సి వచ్చింది. అయితే జనసేనలో చేరే విషయంలో భారీ ఆఫర్ ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. అటు నాగబాబు తో పాటు పవన్ బాలినేని సేవలను రాయలసీమలో వినియోగించుకోవాలని చూసినట్లు అప్పట్లో టాక్ నడిచింది. ఈ నేపథ్యంలో జనసేన తరుపున ఎమ్మెల్సీ తో పాటు ఖాళీగా ఉన్న మంత్రి పదవి ఆఫర్ తోనే ఆయన పార్టీ మారినట్లు తెలుస్తోంది. కానీ నిన్నటి పరిణామాలతో బాలినేని ఆశలు నీరుగారిపోయాయి. తనను అష్టదిగ్బంధనం చేశారని అర్థమవుతోంది.
* అందరికంటే భిన్నంగా
వైసీపీకి చాలామంది నేతలు గుడ్ బై చెప్పారు. కానీ అందరికంటే ఎక్కువగా జగన్ పై ఆరోపణలు చేసింది బాలినేని. కనీసం సమీప బంధువు అన్న ఆలోచన చేయలేదు. పార్టీ ఓటమి ఎదురయ్యేసరికి.. అప్పటివరకు పార్టీలో దక్కిన గౌరవం, పదవులను వదులుకున్నారు బాలినేని. జనసేనలోకి వస్తే ఎమ్మెల్సీ పదవితో పాటు మంత్రి పదవి ఇస్తామని అప్పట్లో ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఆ ఆఫర్ నచ్చి వైసీపీని వీడి బాలినేని జనసేనలో చేరారు. ఓ ఎమ్మెల్సీ తో మాట్లాడి రాజీనామా చేయించుకున్నారు. అదే ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో జనసేన తరపున నిలబడాలని చూశారు. ఎమ్మెల్సీగా గెలిచి ఏపీ క్యాబినెట్ లోకి రావాలని భావించారు బాలినేని. అయితే దీనికి కౌంటర్ ఇచ్చారు సీఎం చంద్రబాబు. బాలినేని కి ఛాన్స్ ఇవ్వకూడదని భావించారు. చివరి నిమిషంలో పావులు కదిపారు. నాగబాబు తో పాటు పవన్ మనసు మార్చుకునేలా చేశారు.
* అలా చెక్ చెప్పిన బాబు
వాస్తవానికి రాజ్యసభ ద్వారా పార్లమెంటులో అడుగు పెట్టాలని నాగబాబు లక్ష్యం. అయితే ఎప్పటినుంచో బాలినేని విషయంలో పవన్ తన మనసులో ఉన్న మాటను చంద్రబాబుకు చెప్పారు. అయితే ఆయన జగన్ కు సమీప బంధువు కావడం.. వైసిపి హయాంలో దూకుడుగా వ్యవహరించడం తదితర కారణాలతో బాలినేని విషయంలో ఆలోచనలో పడ్డారు చంద్రబాబు. మరోవైపు ఒంగోలులో టిడిపి నేతల అభ్యంతరాన్ని సైతం పరిగణలోకి తీసుకున్నారు. అప్పుడే నాగబాబుకు మంత్రివర్గంలోకి తీసుకుందామని ప్రతిపాదన పెట్టారు. దీంతో పవన్ పునరాలోచనలో పడ్డారు. నాగబాబులు కొత్త ఆశలు పుట్టుకొచ్చాయి. దీంతో వారిద్దరూ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, చంద్రబాబు అధికారికంగా ప్రకటన చేయడం జరిగిపోయింది. నీరుగారిపోవడం బాలినేని శ్రీనివాస్ రెడ్డి వంతు అయ్యింది. తిరిగి వైసీపీలోకి రాలేక, జనసేనలో కొనసాగలేక సతమతమవుతున్నారు బాలినేని. మొత్తానికి అయితే ఆయన అష్టదిగ్బంధంలో చిక్కుకున్నారు. మరి ఎలా బయటపడతారో చూడాలి.