APS RTC : తిరుమల వెళ్లే భక్తులకు ఏపీఎస్ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. సుదూర ప్రాంతాల నుంచి తిరుమల వచ్చేవారికి ప్రత్యేక సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపింది. ఇప్పటికే తిరుమల- తిరుపతి మధ్య సులభంగా రాకపోకలు సాగించేందుకు నూతన విధానం తీసుకొచ్చింది. తిరుపతి బస్సులో సీటు బుక్ చేసుకునేటప్పుడే తిరుమల రాకపోకలను కలిపి టికెట్లు జారీ చేస్తున్నారు. బస్సు టికెట్ సహా శ్రీవారి దర్శనం టికెట్ బుక్ చేసుకున్న వారికి తిరుమలకు టికెట్లు జారీ చేయనున్నట్లు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. తిరుమల రాకపోకలకు టికెట్ తీసుకున్న వారికి టికెట్ ధరలో 10 శాతం రాయితీ ఇవ్వాలని నిర్ణయించారు. భక్తులు తిరుపతి వెళ్ళాక అదే టిక్కెట్టు తిరుమలకు రాకపోకలు సాగించే సదుపాయం కల్పించారు. తిరుపతి చేరుకున్న సమయం నుంచి 72 గంటల పాటు తిరుపతి, తిరుమల మధ్య టిక్కెట్ చెల్లుబాటు కానుంది. గత కొద్దిరోజులుగా ఈ విధానం అమలవుతూ వస్తోంది. తాజాగా ఏపీఎస్ఆర్టీసీ మరో నిర్ణయం తీసుకుంది.
రూ. 300 అదనంగా చెల్లిస్తే..
తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది ఏపీఎస్ఆర్టీసీ. సుదూర ప్రాంతాల నుంచి తిరుపతికి ఆర్టీసీ బస్సుల్లో వచ్చే ప్రయాణికులకు ప్రతిరోజు 1000 దైవ దర్శనం టికెట్లను టీటీడీ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆర్టీసీ బస్సుల్లో తిరుపతి వెళ్లే ప్రయాణికులు.. బస్సు చార్జీతో పాటు రూ. 300 అదనంగా చెల్లించి.. వెంటనే శీఘ్ర దర్శనం టికెట్ ను పొందవచ్చు. వీరి కోసం ప్రతి రోజు ఉదయం 11 గంటలకు, సాయంత్రం నాలుగు గంటలకు శీఘ్ర దర్శనం ఏర్పాటు చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం.
* ప్రముఖ దేవస్థానాల సందర్శనకు బస్సులు
ఇప్పటికే సీజన్ల వారీగా ప్రముఖ దేవస్థానాల సందర్శనకు ప్రత్యేక బస్సు సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది ఏపీఎస్ఆర్టీసీ.కార్తీక మాసంలో ప్రత్యేకంగా వందలాది ట్రిప్పులను నడిపింది. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్లే భక్తుల కోసం ఈ సరికొత్త నిర్ణయాన్ని అమలు చేస్తోంది. ఈ విషయంలో టీటీడీతో ఒప్పందం చేసుకుంది ఆర్టీసీ. పరస్పర ఒప్పందంతోనే రోజుకు 1000 దర్శన టిక్కెట్లు ఆర్టీసీకి జారీ చేస్తోంది టిటిడి.దీనినిప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఏపీఎస్ఆర్టీసీ అధికారులు కోరుతున్నారు.