AP BJP :  బీజేపీ సీనియర్లకు గట్టి షాక్ ఇచ్చిన చంద్రబాబు.. ఇలా చేస్తాడనుకోలేదు

ఎన్నికలకు ముందు తెలుగుదేశం అంటేనే బిజెపి అంత దూరం ఉండేది. అంతలా ఉండేది ఆ రెండు పార్టీల మధ్య గ్యాప్.కానీ ఎన్నికల అనంతరం సీన్ మారింది. టిడిపి తో పాటు చంద్రబాబు ప్రాధాన్యత కేంద్రంలో పెరిగింది. దీంతో బిజెపి సైతం చంద్రబాబుకు స్వేచ్ఛ ఇచ్చింది.

Written By: Dharma, Updated On : September 25, 2024 10:17 am

Nominated Post List

Follow us on

AP BJP : బిజెపిలో సీనియర్ల పరిస్థితి ఏంటి?వారికి నామినేటెడ్ పదవులు ఎందుకు దక్కలేదు? మొన్నటి ఎన్నికల్లో టికెట్లు ఇవ్వలేదు.ఇప్పుడు కనీసం పరిగణలోకి తీసుకోలేదు. ఏపీలో నామినేటెడ్ పోస్టులను ప్రకటించిన సంగతి తెలిసిందే. బిజెపి కి సంబంధించి ఒక్క లంక దినకర్ కు మాత్రమే పదవి దక్కింది. మిగతా వారికి మొండి చేయి చూపారు. దీంతో ఈ ఐదేళ్లపాటు వారికి కష్టమే నన్ను ప్రచారం సాగుతోంది. ఈ ఎన్నికల్లో బిజెపి సీనియర్లు చాలామంది టిక్కెట్లు ఆశించారు. సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి, జివిఎల్ తదితరులు ఎన్నికల్లో పోటీ కోసం చివరి వరకు ప్రయత్నించారు. కానీ వారి టిక్కెట్లు దక్కలేదు. పొత్తులో భాగంగా బిజెపికి ఆరు పార్లమెంట్ స్థానాలు, పది అసెంబ్లీ సీట్లు దక్కాయి. కానీ మెజారిటీ స్థానాలను బిజెపిలోని పూర్వ టిడిపి నాయకులు దక్కించుకున్నారు. టిడిపికి వ్యతిరేకులుగా ముద్రపడిన బిజెపి నేతల్లో ఒక్కరికి కూడా సీటు దక్కలేదు. కనీసం రాష్ట్రస్థాయి నామినేటెడ్ పదవులైన వారికి కేటాయిస్తారని ప్రచారం సాగింది. కానీ ఈ జాబితాలో కూడా చోటు దక్కకపోవడం విశేషం.

* ప్రొవైసీపీ నేతలుగా ముద్ర
కేవలం ప్రో వైసీపీ నేతలుగా ముద్రపడడంతోనే వారికి టిక్కెట్లు దక్కలేదని అప్పట్లో ప్రచారం జరిగింది. వీరంతా వైసిపికి అనుకూలంగా పని చేసినట్లు టాక్ నడిచింది. పురందేశ్వరి కి ముందు ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు ఉండేవారు. అప్పట్లో అధికారపక్షంగా వైసిపి ఉండేది. విపక్షంగా టిడిపి కొనసాగేది. సాటి ప్రతిపక్షంగా టిడిపి తో జతకట్టేందుకు సోము వీర్రాజు వెనుకడుగు వేసేవారు. పైగా తిరిగి టిడిపి తో పాటు చంద్రబాబు పై విమర్శలు చేసేవారు. సహజంగానే ఈ చర్య వైసీపీకి అనుకూలమని అర్థం అవుతుంది. అందుకే ఈ ఎన్నికల్లో సోము వీర్రాజును తప్పించారని టాక్ నడిచింది. ఆయన రాజమండ్రి ఎంపీ సీటును ఆశిస్తే.. అదే స్థానంలో పురందేశ్వరి కి టికెట్ ఇచ్చారు.

* బాహటంగానే వ్యతిరేకించిన విష్ణువర్ధన్ రెడ్డి
విష్ణువర్ధన్ రెడ్డి ది అదే పరిస్థితి. ఆయన టిడిపిని బాహటంగానే వ్యతిరేకించేవారు. ఏకంగా టీవీ డిబేట్ లలో సైతం విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి. వైసిపి చర్యలను సమర్ధించిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎన్నికలకు ముందు టిడిపి తో పొత్తు అంటేనే విష్ణువర్ధన్ రెడ్డి విరుచుకుపడేవారు. ఏపీలో సగానికి పైగా సీట్లు ఇస్తేనే బిజెపి పొత్తుకు ఒప్పుకుంటుందని చెప్పుకొచ్చేవారు. తెలుగుదేశం పార్టీతో కలిసే ప్రసక్తి లేదని తేల్చి చెప్పేవారు. దీంతో ఆయనపై ప్రో వైసిపి ముద్ర పడిపోయింది. అందుకే ఈ ఎన్నికల్లో ఛాన్స్ దక్కలేదు. కనీసం నామినేటెడ్ పోస్ట్ కూడా కేటాయించలేదు.

* జీవీఎల్ కు కేంద్రంలో పరపతి
అయితే ఆ ఇద్దరి నేతలకంటే జీవీఎల్ పరిస్థితి భిన్నం.ఆయనకు కేంద్రంలో పలుకుబడి ఉంది. ఆపై విధానపరంగా ముందుకు వెళ్తారని ముద్ర ఉంది. పైగా ఎన్నికలకు ముందు ఆయన సైలెంట్ అయ్యారు. పొత్తును వ్యతిరేకించలేదు. టిడిపి పై ఎటువంటి విమర్శలు చేయలేదు. పైగా ఎన్నికలకు ముందు, తరువాత మీడియా ముందుకు వచ్చారు. వైసీపీ విధానాలను తప్పుపట్టారు. ఈయన విషయంలో టిడిపి సైతం సానుకూలంగా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. కేంద్రంలో పలుకుబడి ఉండడంతో ఏదో ఒక చోట ఈయనకు పదవి సర్దుబాటు చేస్తారని టాక్ నడుస్తోంది. మొత్తానికి అయితే నామినేటెడ్ పదవుల్లో బిజెపి నేతలకు చోటు దక్కకపోవడం విశేషం.