Chandrababu Vs Jagan: కూటమి( Alliance) అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతోంది. 2024 ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించింది టిడిపి కూటమి. ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమం పై దృష్టి సారించింది. ప్రజల నుంచి సానుకూలత ఉంది. ఇదే ఊపుతో 2029 ఎన్నికలకు వెళ్లాలని భావిస్తోంది కూటమి. అయితే ఎట్టి పరిస్థితుల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపడకుండా చూడాలని చూస్తోంది. అందుకు అన్ని మార్గాలను అన్వేషిస్తుంది. ముఖ్యంగా రాయలసీమలో వైసీపీ పటిష్టం కాకుండా చూడగలిగితే టిడిపి అనుకున్నది సాధించగలుగుతుంది. అందుకే బలమైన నేతలను రాయలసీమలో నిలబెట్టాలని చూస్తోంది. అందులో భాగంగా పులివెందులకు చెందిన బీటెక్ రవికి ప్రాధాన్యం ఇవ్వాలని చూస్తోంది. ఇటీవల పులివెందుల జడ్పిటిసి ఉప ఎన్నికల్లో తన భార్యను గెలిపించుకోవడంలో కీలక పాత్ర పోషించారు బీటెక్ రవి.
* వైయస్ కుటుంబ ప్రత్యర్థిగా..
వైయస్ కుటుంబానికి వ్యతిరేకంగా నిలవడంలో బీటెక్ రవి( BTech Ravi ) దూకుడుగా ఉంటారు. తొలిసారిగా 2011లో జరిగిన పులివెందుల ఉప ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేశారు బీటెక్ రవి. 2017లో వైయస్ వివేకానంద రెడ్డి పై స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పోటీ చేసి విజయం సాధించారు. వైసిపి హయాంలో శాసనమండలిలో ఎమ్మెల్సీగా ఉన్న నారా లోకేష్ పై అధికార పార్టీ మాటల దాడిని సమర్థవంతంగా తిప్పికొట్టారు బీటెక్ రవి. అలా నారా లోకేష్ కు దగ్గర అయ్యారు. ప్రతికూల పరిస్థితుల్లో సైతం పులివెందుల నియోజకవర్గంలో పట్టు బిగించారు. పులివెందుల జడ్పిటిసి ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా రాకుండా చేయడంలో బీటెక్ రవి సక్సెస్ అయ్యారు.
* మంత్రివర్గంలో స్థానం..
అయితే వచ్చే ఎన్నికల్లో కడప జిల్లాలో( Kadapa district) ఇదే ఊపును కొనసాగించాలంటే బీటెక్ రవి లాంటి నేతకు కీలక పదవి ఇవ్వడం అనివార్యంగా మారింది. బీటెక్ రవిని ఎమ్మెల్సీగా చేసి.. తరువాత మంత్రివర్గంలోకి తీసుకుంటారని ప్రచారం నడుస్తోంది. ఇప్పటికే కడప జిల్లాకు చెందిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఉన్నారు. మంత్రివర్గ విస్తరణలో ఆయనను తప్పించి అదే సామాజిక వర్గానికి చెందిన బిటెక్ రవికి అప్పగిస్తే బాగుంటుందన్న నిర్ణయానికి వచ్చారు. తద్వారా వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి గట్టి షాక్ ఇవ్వొచ్చని చంద్రబాబు భావిస్తున్నారు. త్వరలో భర్తీ అయ్యే ఎమ్మెల్సీ పదవుల్లో ఒకటి బీటెక్ రవికి ఖాయమని ప్రచారం జరుగుతోంది. బీటెక్ రవి మరింత దూకుడుగా ముందుకెళ్లే అవకాశం ఉంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లో లోన ఆందోళన చెందుతోంది అందుకే. చూడాలి మరి ఏం జరుగుతుందో?