Chandrababu- Pawan Kalyan: స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టు అయిన సంగతి తెలిసిందే. సిఐడి కోర్టు చంద్రబాబును 14 రోజులపాటు రిమాండ్ విధించింది. అయితే చంద్రబాబుది అక్రమ అరెస్టు అంటూ జనసేన అధ్యక్షుడు పవన్ పోరాట బాట పట్టారు. చంద్రబాబును పరామర్శించేందుకు హైదరాబాదు నుండి విజయవాడ వస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. చంద్రబాబును రిమాండ్ విధించిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అధికార వైసిపి పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా నేడు టిడిపి బంద్ కు పిలుపునిచ్చింది. దానికి జనసేన మద్దతు కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలో రకరకాల విశ్లేషణలు బయటకు వస్తున్నాయి.
తెలుగుదేశం పార్టీకి ఇది సంధి కాలం. చంద్రబాబుపై కేసులు మోపుతున్న నేపథ్యంలో పవన్ అండగా నిలవడం ఆ పార్టీకి ఉపశమనం కలిగించే విషయం. చంద్రబాబు విషయంలో స్పందించడం సంస్కారం అంటూ పవన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.అయితే తెలుగుదేశం పార్టీకి పవన్ మాత్రమే అండగా నిలవడం విశేషం. సుదీర్ఘ కాలం పాటు జాతీయ రాజకీయాల్లో సైతం ముద్ర వేసిన చంద్రబాబుకు అనుకూలంగా ఇంతవరకు ఒక్క నాయకుడు కూడా స్పందించలేదు. పవన్ ఒక్కరే ముందుకు వచ్చారు. చంద్రబాబు అరెస్ట్ ను తప్పు పట్టిన బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి సైతం వెనక్కి తగ్గారు. టిడిపి రాష్ట్ర బందునకు తమ మద్దతు లేదని ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు.
అయితే పవన్ కళ్యాణ్ దూకుడు ప్రదర్శించడంపై రకరకాల కథనాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం బిజెపికి, జనసేన మిత్రపక్షం. కానీ పవన్ బాహటంగానే చంద్రబాబుకు మద్దతు తెలుపుతున్నారు. బిజెపిలో ఉలుకూ పలుకు లేదు. ఆ రెండు పార్టీలు వేర్వేరు పద్ధతులతో వెళుతుండడంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు అయోమయానికి గురవుతున్నాయి. కేంద్రంలోని బిజెపి పెద్దలను అనుమతి లేనిదే జగన్ ఇంతటి చర్యకు దిగుతారా అన్న ప్రశ్న ఒకటి ఉత్పన్నమవుతోంది. ఇప్పుడు టిడిపి నిరసనలను బిజెపి భాగస్వామి కాకపోవడంతో ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుతోంది. అయితే మిత్రపక్షం బిజెపితో పని లేకుండా పవన్ మాత్రం బాహటంగానే మద్దతు ప్రకటించారు. చంద్రబాబు అరెస్టు కాగానే నేరుగా హైదరాబాదు నుండి విజయవాడ వచ్చే ప్రయత్నం చేశారు.
చంద్రబాబుపై కేసులు చుట్టుముడుతున్న నేపథ్యంలో టిడిపికి పవనే ఒక ఆశాదీపం గా మారారు. త్వరలో లోకేష్ అరెస్ట్ కూడా ఉంటుందని సిఐడి చీఫ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో పవన్ టిడిపి, జనసేన కూటమి బాధ్యతలు చూసే ఛాన్స్ ఉందని విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. కలిసివచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు చందంగా.. పవన్ కు అనుకూలంగా ఏపీ రాజకీయాలు మారబోతున్నాయని సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అధికార వైసిపి ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటుండగా.. ప్రతిపక్ష టీడీపీ కేసులతో ఉక్కిరి బిక్కిరి అవుతుంది. ఈ తరుణంలో ప్రత్యామ్నాయంగా ప్రజలు పవన్ వైపు చూస్తున్నారు. అటు పవన్ సైతం పరిస్థితులకు తగ్గట్టుగా పావులు కదుపుతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.