CM Chandrababu: ఏపీ రాజకీయాలు( AP politics) వేడెక్కుతున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని పూర్తిగా నిర్వీర్యం చేయాలని కూటమి ప్రయత్నిస్తోంది. అదే సమయంలో కూటమి వైఫల్యాలను ఎండగట్టాలన్న ప్రయత్నంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ధైర్యం కూడ తీసుకుని జగన్మోహన్ రెడ్డి బలంగా వస్తున్నారు. అయితే ఒక వైపు కూటమి బలంగా కనిపిస్తున్నా.. లోలోపల మాత్రం భయం వెంటాడుతోంది. గత అనుభవాలు టిడిపి కూటమిని వెంటాడుతున్నాయి. అందుకే చంద్రబాబు సైతం జాగ్రత్త పడుతున్నారు. పార్టీ శ్రేణులకు హితబోధ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇవ్వొద్దని.. ఇస్తే మూల్యం తప్పదని హెచ్చరిస్తున్నారు.
Also Read: మాజీ డిజిపికి అరుదైన చాన్స్.. ఎంతో నమ్మకంతో రెండు పదవులు ఇచ్చిన చంద్రబాబు!*
* చంద్రబాబు గట్టి హెచ్చరికలు..
తాజాగా టిడిపి ఎల్పీ( Telugu Desam legislative party meeting) సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. జగన్మోహన్ రెడ్డిని తక్కువగా అంచనా వేయవద్దని.. 2019లో అదే మాదిరిగా అంచనా వేసుకుని దెబ్బతిన్న విషయాన్ని ప్రస్తావించారు. అప్పట్లో వివేకానంద రెడ్డి హత్య అంశాన్ని టిడిపి మెడకు చుట్టింది జగన్మోహన్ రెడ్డి అని.. నాడు నిఘా వ్యవస్థ సైతం ఆ కుట్ర ఛేదించలేకపోయిన విషయాన్ని ప్రస్తావించారు చంద్రబాబు. చాలా జాగ్రత్తగా ఉండాలని.. అనవసర వ్యాఖ్యల జోలికి పోవద్దని హెచ్చరించారు. వివాదాస్పద అంశాలకు దూరంగా ఉండాలని కూడా ఆదేశించారు చంద్రబాబు. కొందరు నేతల తీరు అభ్యంతరకరంగా ఉందని.. అటువంటి వారి వివరాలను తెప్పించుకుంటున్నట్లు కూడా చెప్పుకొచ్చారు. ముఖ్యంగా కొందరు ఎమ్మెల్యేల తీరు సరిగా లేదని చంద్రబాబు క్లాస్ పీకినట్లు తెలుస్తోంది.
* ఒంటరిగానే భారీ సీట్లు
ఈ ఎన్నికల్లో తెలుగుదేశం( Telugu Desam) పార్టీ ఒంటరిగానే 135 సీట్లను సొంతం చేసుకుంది. పొత్తులో భాగంగా గతంలో ఎన్నడూ టిడిపి దక్కించుకొని ఓ పది నియోజకవర్గాలను సైతం గెలుచుకుంది. ముఖ్యంగా రిజర్వుడ్ నియోజకవర్గాల్లో సత్తా చాటింది. అయితే కొంతమంది ఎమ్మెల్యేల పనితీరుపై చంద్రబాబుకు ఫిర్యాదులు వస్తున్నాయి. అటువంటి వారిపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు చంద్రబాబు. ఎప్పటికీ అటువంటి ఎమ్మెల్యేలను వ్యక్తిగతంగా పిలిపించి మందలించారు. ఇప్పుడు పార్టీ లెజిస్లేటివ్ సమావేశంలో సుతిమెత్తగా హెచ్చరించారు. పనితీరు మార్చుకోవాలని సూచించారు. లేకుంటే మాత్రం భవిష్యత్తులో అవకాశాలు ఇవ్వనని కూడా సంకేతాలు ఇచ్చారు.
* జనంలోకి జగన్
త్వరలో వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉగాది నుంచి ఆయన జిల్లాల పర్యటన ఉంటుంది. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఆయన పర్యటన ఉండబోతోంది. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో వారంలో మూడు రోజుల పాటు జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తారు. నియోజకవర్గాల్లో పరిస్థితిని.. కూటమి పార్టీల ఎమ్మెల్యేల వ్యవహార శైలిని తెలుసుకుంటారు. స్థానికంగా ఉండే పరిస్థితిని తెలుసుకొని పార్టీ శ్రేణులను అప్రమత్తం చేస్తారు. ఎమ్మెల్యేల వైఫల్యాలను ఎండగట్టే అవకాశం ఉంది. అందుకే చంద్రబాబు ముందుగానే అప్రమత్తమైనట్లు సమాచారం.