Kodali Nani
Kodali Nani: రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ నేతల అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ అరెస్ట్ అయ్యారు. రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయనపై కేసుల మీద కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. మరోవైపు నటుడు పోసాని కృష్ణ మురళి అరెస్టు జరిగింది. ప్రస్తుతం ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇంకోవైపు హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆయన సైతం అరెస్టు చేస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే దాదాపు ఈ నేతలంతా వివాదాస్పద వ్యక్తులే. కానీ అంతకుమించి వ్యవహరించిన చాలామంది నేతలు ఉన్నారు. అటువంటి వారి అరెస్టులు ఎప్పుడు జరుగుతాయా? అని ఆశగా ఎదురు చూస్తున్న వారు ఉన్నారు. అటువంటి నేతల్లో ముందుంటారు కొడాలి నాని. గత ఐదేళ్లుగా ఆయన వాడిన భాష, ఆయన వ్యవహార శైలి తెలుగు ప్రజలకు తెలియంది కాదు. అందుకే ఆయన అరెస్టును ఎక్కువమంది టీడీపీ శ్రేణులు కోరుకుంటున్నారు. ఎప్పుడు అరెస్టు చేస్తారా అని ఎదురుచూస్తున్నారు.
Also Read: మాజీ డిజిపికి అరుదైన చాన్స్.. ఎంతో నమ్మకంతో రెండు పదవులు ఇచ్చిన చంద్రబాబు!*
* టిడిపి ద్వారా పొలిటికల్ ఎంట్రీ
తెలుగుదేశం( Telugu Desam) పార్టీతోనే రాజకీయ అరంగేట్రం చేశారు కొడాలి నాని. 2004లో తొలిసారిగా గుడివాడ నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 2009లో సైతం అదే పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. కొద్ది రోజులకే టిడిపి నాయకత్వంతో విభేదించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014, 2019 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. 2024 ఎన్నికల్లో మాత్రం ఓడిపోయారు. ఓడిన నాటి నుంచి నియోజకవర్గానికి దూరమయ్యారు. ఇటీవల వల్లభనేని వంశీ మోహన్ అరెస్టు తర్వాత మీడియా ముందుకు వచ్చారు. అయితే గతం మాదిరిగానే ఆయన చేసిన వ్యాఖ్యలను జీర్ణించుకోలేకపోతున్నారు టిడిపి శ్రేణులు. ఆయనను ఎందుకు అరెస్టు చేయడం లేదన్నది టిడిపి శ్రేణుల బాధ.
* అంతకుమించి కామెంట్స్
వాస్తవానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, మద్దతుదారులు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకునే అరెస్టుల పర్వం నడుస్తోంది. ఈ లెక్కన కొడాలి నాని( Kodali Nani ) లెక్కకు మించి తప్పుడు వ్యాఖ్యలు చేశారు. నోరు తెరిస్తే చంద్రబాబుతో పాటు లోకేష్ పై విరుచుకు పడేవారు. చివరకు మెగాస్టార్ చిరంజీవి లాంటి వ్యక్తిని కూడా పకోడీగాళ్లతో పోల్చారు. సూపర్ స్టార్ రజినీకాంత్ శరీర ఆకృతిని సైతం ఎద్దేవా చేశారు. పైగా గుడివాడలో కెసినో, ఇతరత్రా క్లబ్బులు కూడా నిర్వహించారు. ఆయనను అరెస్టు చేయడం చాలా ఈజీ. కానీ ఎందుకనో కూటమి ప్రభుత్వం అరెస్టుకు మొగ్గు చూపడం లేదు.
* భారీ వ్యూహం..
అయితే ప్రభుత్వ వైఖరి చూస్తుంటే మాత్రం కొడాలి నాని చుట్టూ భారీ స్కెచ్( big sketch) గీస్తున్నట్లు కనిపిస్తోంది. పూర్తిస్థాయి ఆధారాలు సేకరించిన తరువాత కొడాలి నాని అరెస్టు ఉంటుందని ప్రచారం నడుస్తోంది. మంత్రిగా ఉన్నప్పుడు ఆయన అవినీతి, నియోజకవర్గంలో బెదిరింపులు, భూ కబ్జాలు వంటివి బయటకు తీసే పనిలో కూటమి ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. లేటుగా నైనా లేటెస్ట్ గా కొడాలి నాని అరెస్టు ఉండాలన్నది కూటమి ప్రభుత్వ అభిమతంగా తెలుస్తోంది. అయితే ఇవి తెలియని టిడిపి శ్రేణులు ఆయన అరెస్టు జరగకపోవడంతో నిరాశకు గురవుతున్నాయి.