https://oktelugu.com/

Nominated posts : మాకంటే మాకు.. ఇంత కాంపిటీషన్ ఏంటి? చంద్రబాబునే ఇబ్బంది పెడుతున్నారు..

అదిగో ఇదిగో అంటూ వస్తున్న నామినేటెడ్ పదవుల సందడి ప్రారంభమైంది. మరో మూడు వారాల్లో భర్తీ చేయాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంతో మూడు పార్టీల శ్రేణులు ఆశలు పెంచుకుంటున్నాయి.

Written By:
  • Dharma
  • , Updated On : August 29, 2024 / 07:02 PM IST

    Namineted Posts

    Follow us on

    Nominated posts : ఏపీలో నామినేటెడ్ పోస్టుల సందడి ప్రారంభమైంది. 20 రోజుల్లో నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయడానికి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. దీంతో ఆశావహుల్లో ఆశలు చిగురించాయి. ఇప్పటికే నామినేటెడ్ పోస్టుల కోసం వేలాది మంది దరఖాస్తు చేసుకున్నారు. పదవులు వందల్లో ఉంటే.. వేలల్లో దరఖాస్తులు వచ్చాయి. మూడు పార్టీల శ్రేణులు పదవులపై ఆశ పెట్టుకున్నాయి. దీంతో నామినేటెడ్ పదవుల పంపకం కత్తి మీద సాము కానుంది. మూడు పార్టీల కూటమి నేపథ్యంలో.. నామినేటెడ్ పదవుల్లో సైతం తమకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆ రెండు పార్టీలు కోరుతున్నాయి. జనసేన అయితే 100% విజయంతో దూకుడుగా ఉంది. కేవలం 21 స్థానాల్లో పోటీ చేసి.. అన్ని స్థానాలను కైవసం చేసుకుంది. మిగతా చోట్ల కూటమి గెలుపునకు కృషి చేసింది. అందుకే నేతల కృషిని గుర్తించి ఎక్కువ శాతం నామినేటెడ్ పదవులు కేటాయించాలని ఆ పార్టీ కోరుతోంది. మరోవైపు బిజెపి సైతం ఇదో చక్కటి అవకాశంగా భావిస్తోంది. ఏపీలో బలపడాలన్న ఆకాంక్షతో ఉన్న బిజెపి వీలైనంత ఎక్కువగా నామినేటెడ్ పోస్టులు తీసుకోవాలని చూస్తోంది. ఆ రెండు పార్టీల ఒత్తిడితో చంద్రబాబు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.

    * ప్రకటనలో జాప్యం
    వాస్తవానికి ఆగస్టు 17 నాటికి నామినేటెడ్ పదవులను ఖాయం చేస్తారని ప్రచారం సాగింది. టీటీడీ అధ్యక్ష పదవి నుంచి మార్కెట్ కమిటీల వరకు అన్ని ఒకేసారి ప్రకటిస్తారని టాక్ నడిచింది. కానీ ఎందుకో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. మూడు పార్టీల మధ్య సయోధ్య కుదరక నిలిపివేసినట్లు ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు మరోసారి కదలిక వచ్చింది. 20 రోజుల్లో నామినేటెడ్ పదవులను ప్రకటిస్తారని తెలుస్తోంది.

    * ఆశావహులు అధికం
    అయితే మూడు పార్టీల్లో ఆశావాహులు అధికంగా ఉన్నారు. పొత్తులో భాగంగా టిడిపి 31 అసెంబ్లీ స్థానాలను వదులుకుంది. అలాగే 8 పార్లమెంట్ స్థానాలను సైతం విడిచిపెట్టింది. చివరి నిమిషంలో అక్కడ నేతలు సీట్లు వదులుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు వారందరికీ నామినేటెడ్ పదవులు కేటాయించాల్సిన అనివార్య పరిస్థితి ఎదురయింది. తొలి ప్రాధాన్యంగా వారికే పదవులు కేటాయించనున్నట్లు తెలుస్తోంది.

    * తమకే ప్రాధాన్యం అంటున్న జనసేన
    మరోవైపు జనసేన పార్టీలో సైతం ఒక రకమైన అసంతృప్తి ఉంది. తమ బలానికి తగ్గట్టు అసెంబ్లీ సీట్లు కేటాయించలేదని జనసైనికుల వాదన. జనసేనకు ఎన్ని సీట్లు కేటాయించి ఉన్నా.. అన్ని స్థానాలను గెలిచేవారమని వారు చెబుతున్నారు. కూటమి విజయంలో తమ పాత్ర కీలకమని.. అందుకే తమ పార్టీ క్యాడర్ కు నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యం ఇవ్వాలని వారు కోరుతున్నారు.కీలక పోస్టుల్లో తమ వారిని నియమించాలని డిమాండ్ చేస్తున్నారు.

    * పదవులు ఆశిస్తున్న బిజెపి
    అయితే జాతీయ పార్టీగా ఉన్న బిజెపి సైతం నామినేటెడ్ పదవులను ఆశిస్తోంది. ఏపీలో బిజెపి బలోపేతానికి అవసరమైన చర్యల్లో భాగంగా పదవులు కీలకమని భావిస్తోంది. పైగా మొన్నటి ఎన్నికల్లో టికెట్లు దక్కించుకున్న వారంతా చంద్రబాబు అస్మదీయులేనని ప్రచారం ఉంది.పూర్వం నుంచి బిజెపిలో ఉన్నవారికి టికెట్లు దక్కలేదు. అటువంటి వారంతా ఇప్పుడు నామినేటెడ్ పదవులు కోరుకుంటున్నారు. అందుకే మూడు పార్టీల నేతలతో నామినేటెడ్ పదవుల జాబితా ప్రకటనకు చంద్రబాబు కిందా మీదా పడుతున్నారు.