Pavan Kalyan Birthday :పవన్ కళ్యాణ్ బర్త్ డే అంటే మామూలుగా ఉండదు. పార్టీ శ్రేణులు, అభిమానులు వేడుకగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. అయితే ఈసారి పవన్ కళ్యాణ్ బర్త్ డే ప్రత్యేకమైనదని చెప్పవచ్చు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆ పార్టీ మంచి విజయాన్ని అందుకుంది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు. కూటమి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. అందుకు ఈసారి బర్త్ డే వేడుకలకు సంబంధించి సన్నాహాలు ముందుగానే ప్రారంభమయ్యాయి. పార్టీ క్యాడర్ తో పాటు అభిమానులు ఉత్సాహంగా జరుపుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మెగా కుటుంబం నుంచి అరుదైన గౌరవం దక్కించుకున్నారు పవన్. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ద్వారా ఎంట్రీ ఇచ్చినా రాజకీయాల్లో అనుకున్న స్థాయిలో రాణించలేకపోయారు. కానీ పవన్ అలా కాదు. సుదీర్ఘకాలం పార్టీని నడిపారు. ప్రజలను మెప్పించారు. అధికారంలోకి రాగలిగారు. ఆ కుటుంబానికి సాధ్యపడని విషయాన్ని సుసాధ్యం చేశారు. మెగా అభిమానుల్లో ఒక రకమైన గర్వాన్ని నింపారు. అందుకే పవన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా చేయాలని అభిమానులు డిసైడ్ అయ్యారు.
* పాలనలో పవన్ ముద్ర
పవన్ డిప్యూటీ సీఎం తో పాటు నాలుగు కీలక మంత్రిత్వ శాఖలను దక్కించుకున్నారు. ముఖ్యంగా పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖతో పల్లెలను మార్చాలని భావించారు. అందుకే రాష్ట్రవ్యాప్తంగా అన్ని పంచాయితీల్లో గ్రామసభలను ఏర్పాటు చేశారు. ప్రజలకు అవసరమైన పనులను వారి నుంచే అభిప్రాయాలను సేకరించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రామసభలను ఏర్పాటు చేయడంతో ప్రజలు కూడా సంతోషించారు. తమకు అవసరమైన పనులు చేపట్టాలని సూచించారు.
* గ్రామసభల ఆలోచన పవన్ దే
గ్రామసభల ఆలోచన పవన్ కళ్యాణ్ దేనని సీఎం చంద్రబాబు కూడా చెప్పుకొచ్చారు. ఇప్పుడు గ్రామ సభలకు వచ్చిన ఆదరణ చూసిన జనసైనికులు మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. సెప్టెంబర్ 2న పవన్ పుట్టినరోజు రాష్ట్రవ్యాప్తంగా మొక్కలు నాటాలని నిర్ణయించారు. దీనికి క్లీన్ ఆంధ్ర, గ్రీన్ ఆంధ్ర అని పేరు పెట్టారు. జనసేన క్యాడర్ విధిగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు.
* జనసేన ప్రత్యేక ప్రకటన
జనసేన ప్రత్యేక ప్రకటన చేసింది. మొక్కల నాటే కార్యక్రమం వెనుక ఉన్న ఉద్దేశాన్ని చెప్పుకొచ్చింది. ఒక మొక్క రెండు తరాలకు సరిపడే ఆక్సిజన్, పండ్లు, ఔషధ ఫలాలను అందిస్తుందని, పర్యావరణాన్ని సమతుల్యం చేస్తుందని జనసేన పేర్కొంది. పవన్ కళ్యాణ్ కు పాము ఇచ్చే నిజమైన జన్మదిన బహుమతి అదేనని, భావితరాలకు స్వచ్ఛమైన ప్రకృతిని అందిద్దామని కోరింది. సగటు మనిషి జీవితకాలం 67 సంవత్సరాలు కాగా.. ఉసిరి చెట్టు 70, నేరేడు చెట్టు 100, చింత చెట్టు 100, వేపచెట్టు 200, రావి చెట్టు 2500 సంవత్సరాల పాటు జీవించగలుగుతాయని వివరించింది.అందుకే పవన్ పుట్టినరోజు నాడు మొక్కలు నాటాలని సూచించింది.