Homeఆంధ్రప్రదేశ్‌Chandrababu And Pawan Kalyan: అయోధ్యకి బాబు, పవన్ లకే ఆహ్వానం ! ఇది దేనికి...

Chandrababu And Pawan Kalyan: అయోధ్యకి బాబు, పవన్ లకే ఆహ్వానం ! ఇది దేనికి సంకేతం?

Chandrababu And Pawan Kalyan: అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం, బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట వేడుకలు అంబరాన్ని తాకాయి. ఈ వేడుకలకు దేశంలోని సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. దాదాపు 8,000 మంది అతిథులను శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆహ్వానించింది. వీరిలో ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు, పీఠాధిపతులు, సాధువులు ఉన్నారు. కొందరు విపక్ష నేతలు కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. మన రాష్ట్రానికి సంబంధించి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు హాజరయ్యారు. సీఎం జగన్ మాత్రం హాజరు కాలేదు. దీనిపై భిన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

అసలు జగన్ కు ఆహ్వానం అందిందా? అందలేదా? అందినా ఆయన వెళ్లలేదా? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. రానున్న కాలంలో అందరూ కలిసి పోతారని ఇటీవల జగన్ అన్ని సభల్లో చెబుతూ వచ్చారు. అటు బిజెపి సైతం టిడిపి, జనసేన కూటమిలో చేరుతుందని వార్తలు వస్తున్నాయి. అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం అనంతరం పొత్తులపై బీజేపీ స్పష్టమైన ప్రకటన చేస్తుందని అంతా అనుకుంటున్నారు . సరిగ్గా ఇటువంటి సమయంలోనే చంద్రబాబుతో పాటు పవన్ లకు కార్యక్రమానికి ఆహ్వానించడం విశేషం. అయితే జగన్ విషయంలో ఏం జరిగి ఉంటుందన్నది అనుమానం. దాదాపు దేశవ్యాప్తంగా ఎనిమిది వేల మంది అతిథులను పిలిచి.. ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన జగన్ కు పిలవకుండా ఉంటారా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కచ్చితంగా పిలిచి ఉంటారని.. వివిధ కారణాలు చెబుతూ జగన్ హాజరు కాలేదని తెలుస్తోంది. అటు అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం కార్యక్రమానికి మద్దతుగా వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్స్ పెట్టారు.

ఓ విషయంలో భయపడే జగన్ ఈ కార్యక్రమానికి హాజరు కాలేదని తెలుస్తోంది. ఏపీ సీఎం జగన్ కుటుంబ సభ్యులు క్రిస్టియన్ మతస్థులు. జగన్ సీఎం అయిన తర్వాత కుటుంబ సమేతంగా తిరుపతి వెళ్లడం అరుదు. ఆయన భార్య భారతీ రెడ్డి తిరుపతిని సందర్శించిన సందర్భాలు చాలా తక్కువ. ఈ విషయంలో హిందూ ధార్మిక సంఘాలు సైతం తప్పుపడుతుంటాయి. గత నాలుగు సంవత్సరాలుగా సంక్రాంతి సంబరాలు జరగలేదు. కానీ ఎన్నికల ఏడాది కావడంతో తాడేపల్లి ప్యాలెస్ ప్రాంగణంలో సంక్రాంతి సంబరాలను ఏర్పాటు చేశారు. హిందూ సంప్రదాయం ప్రకారం సీఎం సతీమణి భారతి రెడ్డి వేడుకల్లో పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు చేశారు. తీర్థప్రసాదాలు స్వీకరించారు. అయితే అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవ వేడుకలకు మాత్రం హాజరు కాలేదు. అటు తిరుపతి లాంటి ప్రాచీన ఆలయానికి కుటుంబ సమేతంగా వెళ్లలేదు. బహుశా ఒంటరిగా వెళ్లేందుకు ఇష్టపడక జగన్ గైర్హాజరైనట్లు తెలుస్తోంది.

వైసీపీకి ఎస్సీ, ఎస్టి, క్రిస్టియన్, మైనారిటీ ఓటు బ్యాంకు అధికం. వారు బిజెపి చర్యలపై కోపంగా ఉంటారు. బిజెపితో అంటగాకినట్లు తెలిస్తే దూరమవుతారని జగన్ లో ఆందోళన. అందుకే ఈ కార్యక్రమానికి గైర్హాజరయ్యారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అదే సమయంలో బిజెపి తన ప్రత్యర్థులకు దగ్గరవుతుందన్న అనుమానం కూడా జగన్ లో ఉంది. త్వరలో పొత్తు ప్రకటన వస్తుందని సమాచారం ఉంది. పైగా చంద్రబాబుతో పాటు పవన్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ముందుగానే వెళ్తున్నట్లు ప్రకటించారు. అందుకే జగన్ వెనక్కి తగ్గారని తెలుస్తోంది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థుల మార్పుపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే ముందు కీలక పథకాలకు శ్రీకారం చుట్టాలని భావిస్తున్నారు. అందుకే క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఈ కారణాలతోనే ఆయన అయోధ్య వెళ్లలేదని.. ఒక ముఖ్యమంత్రిగా ప్రత్యేక ఆహ్వానం ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే దేశవ్యాప్తంగా హిందువులు పరమ పవిత్రంగా భావించిన అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ వేడుకలకు జగన్ వెళ్లకపోవడం ఆ వర్గంలో విమర్శలకు దారితీస్తోంది. మైనారిటీల ఓట్ల కోసమే జగన్ ఈ విధంగా వ్యవహరించారన్న ఆరోపణలు వస్తున్నాయి. దీనిని ఆయన ఎలా అధిగమిస్తారో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular