Chandrababu Vs YS Jagan : దీపం ఉంగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అంటారు. అధికారంలో ఉన్నప్పుడే కదా ఎవరైనా నాలుగు రాళ్లు వెనకేసుకునేది. అందరూ అదే చేసేది. ప్రతిపక్షంపై నిందలు వేసే ముందు అధికారంలో ఉన్నవారు కూడా గతంలో అవే నిందలు మోశారనే విషయం గుర్తుంచుకోవాలి. చంద్రబాబు, నారాయణ క్విడ్ ప్రోకోకు పాల్పడ్డారన్నది సాక్షి ప్రతిక ప్రధాన అభియోగం. ఇదే విషయాన్ని సిట్ కూడా ఖరారు చేసింది. గతంలో వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే క్విడ్ ప్రోకో విషయంలో జగన్ అండ్ కో జైలుకు కూడా వెళ్లి వచ్చారు. ఇప్పుడు అసలు నిజాయితీపరులు ఎవరూ అంటే.. తేల్చడం చాలా కష్టమైన విషయమే.
ఇప్పుడిదే హాట్ టాపిక్..
చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత యథేచ్ఛగా భూ కుంభకోణాలకు పాల్పడ్డారని అధికార పార్టీ పత్రికలో ప్రధానంగా ప్రచురించింది. ఏపీకి రాజధాని అమరావతి అని కూడా చెప్పడానికి సంశయిస్తూ… సీడ్ క్యాపిటల్, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ పేరిట క్విడ్ ప్రోకోకు పాల్పడ్డారని స్పష్టం చేయడమే ఆ కథనం ముఖ్య ఉద్దేశ్యం. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత అమరావతిని రాజధానిగా ససేమిరా ఒప్పుకోవడం లేదు. దానిని నిర్వీర్యం చేయడమే ప్రధాన ఎజెండాగా పెట్టుకుంది. అధికారంలో ఉన్నప్పుడు చిన్న చిన్న మార్పులు చేసి పాలన చేయడం సాగించారే అనుకోండి.. అది అప్పటి అవసరాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అందులో తప్పులు జరిగి ఉండి ఉండవచ్చు. అధికారంలో ఉన్నాం కాబట్టి ఏం చేసినా ఎవరు చూస్తారనుకుంటే చట్టం తన పని తాను చేసుకుపోతుంది.
గతంలో జగన్ చేసిందేమిటి?
వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన తనయుడు జగన్ భారీగా క్రిడ్ ప్రోకోకు పాల్పడ్డారనే వార్తలు బాగా వినిపించాయి. ఊరు పేరు లేని కంపెనీలు సృష్టించి నల్లధనాన్ని వెనకేసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. సాక్షి పత్రిక, భారతి సిమెంట్ తదితర కంపెనీల షేరు మార్కెట్ ఒక్కసారిగా ఎలా పెరిగిందో అంతులేని ప్రశ్నగానే మిగిలిపోయింది. దీనిని అప్పటి చంద్రబాబు ప్రభుత్వం కూపీ బయటకు లాగి బహిర్గతం చేసింది. ఫలితంగా జగన్ జైలు ఊచలు లెక్కించాల్సిన దుస్థితి ఏర్పడింది. ఆ తరువాత ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన తరువాత తెలుగుదేశం పార్టీ నాయకుల అక్రమాలు బయటపెడుతున్నారు.
మరి సచ్చీలురు ఎవరు?
ఒకరి తప్పులు ఒకరు బయట పెట్టుకుంటూ నిజాయితీపరులంటే నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరు. అధికారం కోసం జగన్, చంద్రబాబు కిందా మీద పడుతున్నారు. ఒక్క అవకాశంతో జగన్ పై ఉన్న అన్ని ఆరోపణలకు సమాధానం దొరికినట్లయ్యింది. ఇది కాదనలేని సత్యం. చంద్రబాబు నిజాయితీని ప్రజలు శంకించాలన్నది ఆయన ప్రధాన లక్ష్యం. ఆ మోతాదు ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఎక్కువవుతుంది. మొత్తంగా చూసుకుంటే మూడో ప్రత్యామ్నాయంగా పవన్ కల్యాణ్ ఒక్కరే కనబడుతున్నారు. ఆయనను కూడా ఒక్కసారి ప్రజలు చూస్తే పాలనలో వైరుధ్యం కనబడుతుందనడంలో సందేహం లేదు. మరి ఓటర్లు రాబోవు ఎన్నికల్లో ఎలా తీర్పు ఇవ్వబోతున్నారో వేచి చూడాల్సిందే.