https://oktelugu.com/

AP Politics : బాబు, కవిత హీరో అయ్యారు.. జగన్ అందుకే విలన్ అయ్యాడు

రాజకీయాలు ఎలాగైనా ఉంటాయి.. రాజకీయాలు చేసే నాయకులు ఎలాగైనా తమ అడుగులు వేస్తుంటారు. తమకు అనుకూలంగా ఉన్నప్పుడు ఒక విధంగా.. తమకు ఇబ్బంది ఏర్పడినప్పుడు మరో విధంగా వ్యవహరిస్తూ ఉంటారు. అందువల్లే వ్యవస్థలు వారికి సాగిల పడుతుంటాయి. ప్రతి విషయంలోనూ మోకారిల్లుతూ ఉంటాయి..

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : August 29, 2024 / 10:40 PM IST

    Chandra Babu Kavitha ys Jagan

    Follow us on

    AP Politics : ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొని.. ఐదు నెలల పాటు జ్యూడిషియల్ కస్టడీ ఎదుర్కొన్న భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. ఇటీవల సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో విడుదలయ్యారు. సహజంగానే తెలంగాణలో భారత రాష్ట్ర సమితి సోషల్ మీడియా విభాగం బలంగా ఉంటుంది. గత ఎన్నికల్లో చాలావరకు యూట్యూబ్ ఛానల్స్, ఇతర వెబ్ సైట్ లను ఆ పార్టీ కొనుగోలు చేసిందని ఆరోపణలు వినిపించాయి. కవిత బెయిల్ కు సంబంధించిన విచారణ సుప్రీంకోర్టులో ఉందనగానే.. అంతకు ముందు రోజు భారత రాష్ట్ర సమితి అనుకూల సోషల్ మీడియా విభాగాన్ని పర్యవేక్షించేవారు ఢిల్లీ వెళ్ళిపోయారు. ఆ తర్వాత కవిత విడుదల కాగానే ఆమెను “డాటర్ ఆఫ్ ఫైటర్” కీర్తించడం మొదలుపెట్టారు.”న్యాయం గెలిచింది. ధర్మం నిలబడింది” అంటూ నినాదాలు చేయడం మొదలుపెట్టారు. సోషల్ మీడియాలో రీల్స్ కైతే ఇక అంతూ పొంతూ లేదు. వాస్తవానికి కింది కోర్టులు తిరస్కరిస్తే ఆమె తప్పనిసరి పరిస్థితుల్లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు pmla 45 f ఆర్టికల్ కింద ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. కానీ ఈ విషయాన్ని భారత రాష్ట్ర సమితి అనుకూల సోషల్ మీడియా విభాగం దాచిపెడుతోంది. ఆమె మద్యం కుంభకోణంలో నిందితురాలు కాదని, సుప్రీంకోర్టులో న్యాయాన్ని గెలిపించి వచ్చారనే రేంజ్ లో ఎలివేషన్లు ఇస్తోంది. బెయిల్ ఇచ్చే క్రమంలో సుప్రీంకోర్టు ఆమెకు అనేక షరతులు విధించింది. పాస్ పోర్ట్ మెజిస్ట్రేట్ స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు సంస్థలు ఎప్పుడు విచారణకు పిలిచినా రావాలని కోర్టు ఆదేశించింది. కోర్టు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లకూడదని స్పష్టం చేసింది. కానీ ఈ విషయాలను అటు భారత రాష్ట్ర సమితి, దాని అనుబంధ సోషల్ మీడియా విభాగం బయట పెట్టడం లేదు.

    స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు

    ఇక స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్టయ్యారు. చాలా రోజులపాటు ఆయన రాజమండ్రి జైల్లో ఉన్నారు.. చివరికి ఆయన అనారోగ్య కారణాలను దృష్టిలో ఉంచుకొని హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇటు కవిత విషయంలో, అటు చంద్రబాబు విషయంలో కోర్టులు కేవలం బెయిల్ మాత్రమే ఇచ్చాయి. అంతేతప్ప వారిద్దరిని పులు కడిగిన ముత్యాలు అని చెప్పలేదు. పైగా వారి ఎదుర్కొంటున్న కేసులను న్యాయస్థానాలు కొట్టేయలేదు.. కానీ అటు కవిత, ఇటు చంద్రబాబుకు బలమైన మీడియా మద్దతు ఉంది. సోషల్ మీడియా కూడా ఉంది. అందువల్లే వారు ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పటికీ.. బెయిల్ పై జైలు నుంచి విడుదలైన తర్వాత గొప్ప వాళ్ళుగా ప్రొజెక్టవుతున్నారు.

    బెయిల్ వచ్చినప్పటికీ నేరస్తుడే

    ఇక ఏపీ రాష్ట్రానికి మొన్నటిదాకా ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్ కూడా అక్రమాస్తుల కేసులో బెయిల్ పై బయట ఉన్నారు. గత పది సంవత్సరాలుగా ఆయన బెయిల్ పైనే బయట ఉన్నారు. ఆయన అనుకూల మీడియా గొప్పగా కీర్తిస్తున్నప్పటికీ.. ఓవర్గం ప్రజల్లో ఇంకా జగన్ ఆర్థిక నేరస్తుడు అనే అభిప్రాయమే ఉందని టిడిపి మీడియా ప్రచారం చేస్తూ ఉంటుంది. అంతేకాదు టిడిపి అనుకూల మీడియా, దాని అనుబంధ సోషల్ మీడియా జగన్మోహన్ రెడ్డిని ఇప్పటికి నేరస్తుడిగానే పరిగణిస్తోంది. వాస్తవానికి చంద్రబాబు విషయంలో స్కిల్ స్కామ్ కేసు అక్రమంగా కనిపించిన ఆ మీడియాకు.. జగన్ విషయంలో మాత్రం న్యాయంగా కనిపిస్తోంది. అందువల్లే జగన్మోహన్ రెడ్డిని ఇప్పటికీ నేరస్థుడు గానే పరిగణిస్తుంది. అలానే వార్తలు రాస్తుంది.. ఈ పరిణామాలను చూసిన తర్వాత మనదేశంలో అక్రమాలు చేసినా, దందాలకు పాల్పడినా.. బలమైన మీడియా ఉంటే చాలు గొప్పవాళ్ళు అయిపోవచ్చు.. న్యాయ, ధర్మ పరిరక్షకులుగా చెలామణి కావచ్చు.