MP Midhun Reddy : ఏ క్షణమైనా ఎంపీ మిధున్ రెడ్డి అరెస్ట్.. మద్యం దందాలో ట్విస్ట్

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 80 రోజులు అవుతోంది. గత ప్రభుత్వ నిర్ణయాలను సమీక్షిస్తోంది. ముఖ్యంగా నాటి వైసిపి నేతల అవినీతిని బయట పెట్టే ప్రయత్నం చేస్తోంది.

Written By: Dharma, Updated On : August 27, 2024 12:55 pm

AP Liquor scam

Follow us on

MP Midhun Reddy :వైసీపీ హయాంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలకంగా వ్యవహరించారు. సీనియర్ మంత్రిగా ఉంటూ రాయలసీమ బాధ్యతలను చూసుకున్నారు. రాయలసీమ నూతన కనుసైగలో శాసించారు. ఇక ఆయన కుమారుడు పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి అయితే.. జగన్ కు కుడి భుజం గా నిలిచారు. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల ఎంపిక, వడబోత అంతా మిధున్ రెడ్డి చూశారు. సజ్జల రామకృష్ణారెడ్డి తో కలిసి అంతా చక్కబెట్టారు. కుప్పంలో చంద్రబాబును, హిందూపురంలో బాలకృష్ణను ఓడించే బాధ్యతను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీసుకున్నారు. పిఠాపురంలో పవన్ ను ఓడించే బాధ్యత మాత్రం యువ నేత మిధున్ రెడ్డి పై పెట్టారు జగన్. దీంతో రాయలసీమ మనుషులను పిఠాపురం పంపించారు మిథున్ రెడ్డి. ఇదే విషయాన్ని ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించారు పవన్. మరి అటువంటి పెద్దిరెడ్డి తండ్రి కొడుకులను కూటమి ప్రభుత్వం విడిచిపెడుతుందా? కచ్చితంగా వారిపై ఫోకస్ పెడుతుంది. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దగ్ధం తర్వాత.. తండ్రీ కొడుకుల పై పూర్తిగా దృష్టి పెట్టింది కూటమి ప్రభుత్వం. అడ్డగోలుగా సాగించిన భూవ్యవహారాలు, మద్యం దందా వంటి వాటిపై పూర్తి ఆధారాలు సేకరించింది సిఐడి. ఇప్పుడు అన్ని ఒక కొలిక్కి రావడంతో ఈ క్షణంలోనైనా ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డిని అరెస్టు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

* ఫైళ్ల దహనం తర్వాత
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్లను పోగుచేసి దహనం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసు దర్యాప్తులో ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. వందల కోట్ల లావాదేవీలకు సంబంధించి దందా బయటపడింది. ఆ నగదంతా మద్యం స్కామ్ లోనిదేనని తేలింది. అందుకే సిఐడి అధికారుల సైతం రంగంలోకి దిగారు. రాష్ట్రంలో మద్యం దందా ఆ నలుగురే చేశారన్నది అందరికీ తెలిసిన విషయమే. సీఎంఓలో కీలకంగా వ్యవహరించిన ఆ నలుగురే మద్యం దందాలో సూత్రధారులన్న ఆరోపణలు ఉన్నాయి.

* తండ్రీ కొడుకుల పేర్లు
ఏపీలో మద్యం స్కాం అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు మిధున్ రెడ్డి పేర్లు బలంగా వినిపిస్తాయి. డిస్టలరీలను బలవంతంగా లాక్కోవడం, విచిత్రమైన బ్రాండ్లను ప్రవేశపెట్టడం, కమీషన్లను కొట్టేయడం వరకు.. చాలా రకాల దందాలు జరిగాయి. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ళ దహనం తర్వాత.. అంతా పెద్దిరెడ్డి కుటుంబం వైపే చూశారు. దర్యాప్తులో భాగంగా పెద్దిరెడ్డి సన్నిహితుల ఇళ్లలో తనిఖీలు చేశారు. అప్పుడే కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అక్కడే మద్యం దందాకు సంబంధించిన సాక్ష్యాలు బయటపడినట్లు తెలుస్తోంది.

* పూర్తి ఆధారాల సేకరణ
ఏపీ బేవరేజెస్ చైర్మన్ గా వాసుదేవరెడ్డి ఉండేవారు. ఇప్పటికీ ఆయనను సిఐడి విచారించింది. వారి నుంచి వాంగ్మూలం తీసుకుంది. అలాగే డిస్టలరీలు పోగొట్టుకున్న పాత యజమానుల నుంచి వాంగ్మూలాలు రికార్డ్ చేశారు. ఈ స్కామ్ లో జరిగిన లావాదేవీల గురించి పూర్తిగా ఆరా తీశారు. ముఖ్యంగా మిథున్ రెడ్డి పాత్ర పై పూర్తిస్థాయిలో ఆధారాలు సేకరించారు. అందుకే ఆయనకు నోటీసులు ఇవ్వడమో.. లేకుంటే అరెస్టు చేయడమో చేస్తారని తెలుస్తోంది.