https://oktelugu.com/

Central budget  : విభజనకు పదేళ్లు.. ఎట్టకేలకు కేంద్ర సాయం.. చంద్రబాబుకు బిగ్ రిలీఫ్

రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారిగా.. కేంద్రంలో ఏపీకి గుర్తింపు లభించింది. అమరావతి రాజధాని తో పాటు విభజన చట్టంలో పొందుపరచిన అంశాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. బడ్జెట్లో భారీ కేటాయింపులు చేసింది.

Written By:
  • Dharma
  • , Updated On : July 23, 2024 1:51 pm
    Follow us on

    Central budget : ఏపీ సీఎం చంద్రబాబు కృషి ఫలించినట్టు కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 45 రోజులు అవుతోంది. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు రెండుసార్లు ఢిల్లీ వెళ్లి వచ్చారు. ప్రధాని మోదీ తో పాటు కేంద్ర మంత్రులను కలిశారు. బడ్జెట్లో ఏపీకి ఎక్కువ కేటాయింపులు ఉండేలా చూడాలని.. అమరావతి, పోలవరం ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలని ఆయన కోరారు. పూర్తిస్థాయి నివేదికలతో ఢిల్లీ వెళ్లి విజ్ఞప్తి చేశారు. తాజాగా బడ్జెట్లో ఏపీకి పెద్ద ఎత్తున నిధులు కేటాయించడంతో.. చంద్రబాబు విన్నపాన్ని కేంద్ర పెద్దలు పరిగణలో తీసుకున్నట్లు అర్థమయింది.ఏపీవిషయంలో ప్రత్యేక దృష్టితో ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం సంకేతాలు పంపించింది.

    * అన్ని అంశాలకు మోక్షం
    కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఏపీకి గుడ్ న్యూస్ చెప్పారు. ఈరోజు ఆమె పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. కేంద్ర సాయాన్ని ప్రకటించారు. ఏపీ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని.. విభజన చట్టంలోని అన్ని అంశాలను అమలు చేస్తామని ప్రకటించారు.అమరావతి రాజధాని నిర్మాణానికి 15 వేల కోట్ల రూపాయలు కేటాయించినట్లు వెల్లడించారు.పోలవరం,రోడ్లు, రైల్వేలకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. పూర్వోదయ పథకంలో ఏపీ ని కూడా చేర్చారు. బీహార్, జార్ఖండ్, బెంగాల్, ఒరిస్సా తో పాటు ఏపీకి ఈ పథకం కింద ప్రత్యేక ప్రాజెక్టులను ప్రకటించారు.

    * ఈసారి వెనుకబడిన జిల్లాలకు నిధులు
    వైసిపి ప్రభుత్వ హయాంలో కేంద్రం నుంచి రావాల్సిన వెనుకబడిన జిల్లాల నిధులు నిలిచిపోయాయి. వాటిని పునరుద్ధరిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గతంలో ఉత్తరాంధ్రతో పాటు రాయలసీమ జిల్లాలను వెనుకబడిన జాబితాలో చేర్చి.. పెద్ద ఎత్తున నిధులను విడుదల చేసేది కేంద్రం. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు ఈ నిధులు ఎంతగానో ఉపయోగపడేవి. కానీ జగన్ హయాంలో.. ఈ నిధులను సైతం దారి మళ్లించారు. వేరే అవసరాలకు కేటాయించారు. కానీ చంద్రబాబు విజ్ఞప్తి మేరకు.. ఇప్పుడు వెనుకబడిన జిల్లాలకు నేరుగా నిధులు కేటాయిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ, ప్రకాశం జిల్లాలకు ఈ నిధులు వర్తింపజేయనున్నట్లు చెప్పుకొచ్చారు.

    * పోల’వరం’
    పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి పూర్తిస్థాయి సాయం అందిస్తామని సభలో ప్రకటించారు నిర్మలా సీతారామన్. విశాఖ- చెన్నై, ఓర్వకల్లు- బెంగళూరు మధ్య ఇండస్ట్రీ కారిడార్లుఏర్పాటు చేస్తామని.. ఇందుకోసం భారీగా నిధులు కేటా ఇస్తామని కూడా ప్రకటించారు. అవసరాన్ని బట్టి బహుళ సంస్థల ద్వారా ఏపీకి రుణాలు ఇస్తామని స్పష్టం చేశారు. విభజన చట్టం ప్రకారం పరిశ్రమల ఏర్పాటుకు అన్ని విధాల చేయూత అందిస్తామని కూడా హామీ ఇచ్చారు. అయితే సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చంద్రబాబు రెండుసార్లు ఢిల్లీ వెళ్లారు. తన వెంట ఎన్డీఏ ఎంపీలను కూడా తీసుకెళ్లారు. పూర్తిస్థాయి ప్రతిపాదనలు కేంద్రం ముందు పెట్టారు. వాటిని పరిగణలో తీసుకున్న కేంద్రం భారీ కేటాయింపులు చేసింది. దీనిపై హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.

    * జగన్ కు మైనస్
    గత 45 రోజులుగా కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారాయంటూ జగన్ ఉద్యమిస్తున్నారు. ఢిల్లీ వేదికగా ఆందోళనలకు శ్రీకారం చుట్టారు. ఇటువంటి తరుణంలో ఏపీకి భారీ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం కేటాయింపులు చేసింది. ఇది ఒక విధంగా జగన్ కు మైనస్. గత ఐదేళ్ల కాలంలో ఈ తరహా కేటాయింపులు చేయలేదు. ఇప్పుడు ఆ క్రెడిట్ చంద్రబాబు ఖాతాలో పడనుంది.