MP Avinash Reddy : వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో ట్విస్టుల మీద ట్విస్టులు కొనసాగుతున్నాయి. సోమవారం ఉదయం నుంచి కర్నూలు వేదికగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో సహ నిందితుడిగా ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిని ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. నాలుగు రోజులుగా కర్నూలులోని విశ్వభారతి హాస్పిటల్ లో అవినాష్ ఉన్నారు. తల్లి శ్రీలక్ష్మికి అత్యవసర వైద్య అందిస్తుండడంతో విచారణకు హాజరుకాలేని సీబీఐకి లేఖ రాశారు.
సోమవారం తెల్లవారుజాము నుంచి ఆస్పత్రి దగ్గరికి సీబీఐ బృందాలు చేరుకున్నాయి. దీంతో అవినాష్ అరెస్ట్ తప్పదన్న టాక్ నడుస్తోంది. సుప్రీం కోర్టులో ముందస్తు బెయిల్ పిటీషన్ వేసినా న్యాయమూర్తులు విచారణకు నిరాకరించారు. మరోవైపు సీఆర్పీఎఫ్ బలగాలు, స్పెషల్ బెటాలియన్లు హైదరాబాద్ నుంచి కర్నూలు చేరుకుంటున్నాయి. దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దీంతో ఎప్పుడేం జరుగుతుందో అని వైసీపీలో టెన్షన్ మొదలైంది. కడప, కర్నూలు నుంచి పార్టీ శ్రేణులు భారీగా తరలివస్తున్నాయి. విశ్వభారతి హాస్పిటల్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పార్టీ శ్రేణులు వారిని వెనక్కి పంపిస్తున్నాయి. సమీపంలోని షాపులను సైతం మూసివేశారు.
మరోవైపు సీబీఐ అధికారులు ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఢిల్లీలోని కేంద్ర కార్యాలయానికి చేరవేస్తున్నారు. ఇప్పటికే కర్నూలు ఎస్పీ కృష్ణకాంత్ కు సీబీఐ అధికారులు రెండుసార్లు కలిశారు. అవినాష్ రెడ్డి అరెస్ట్ కు సహకరించాలని కోరారు. కానీ ఎస్పీ నేుంచి ఆశించిన స్పష్టత రావడం లేదు. డీజీపీ ఆదేశాల మేరకు నడుచుకుంటామని చెప్పినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో కేంద్ర సాయుధ బలగాలతోనైనా అవినాష్ ను అరెస్ట్ చేయాలని సీబీఐ సిద్ధపడినట్టు సమాచారం. అందుకే హైదరాబాద్ నుంచి సీఆర్పీఎఫ్ బలగాలు బయలుదేరాయి. మరో నాలుగు గంటల్లో కర్నూలు చేరుకున్నాయి. సాయంత్రం 6 గంటల తరువాత కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశముంది.
మరోవైపు విశ్వభారతి ఆస్పత్రి వద్దకు భారీగా వైసీపీ శ్రేణులు తరలివచ్చాయి. ముఖ్యంగా కర్నూలు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలంతా అనుచరులతో చేరుకున్నారు. ఆస్పత్రి ప్రధాన గేటు ఎదుట బైఠాయించారు. గేట్లు మూసివేశారు. అటువైపుగా ఎవరూ రాకుండా అడ్డుకుంటున్నారు. మరోవైపు అరెస్ట్ ను ఎలాగైనా తప్పించాలని అధికార పార్టీ నేతలు పీఎంవో వర్గాలతో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. అయితే విచారణకు పిలుస్తుంటే డుమ్మా కొడుతున్న నేపథ్యంలో ఎలాగైనా అవినాష్ ను అరెస్ట్ చేయాలన్న కృతనిశ్చయంలో సీబీఐ అధికారులు ఉన్నారు. దీంతో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా మారింది. కర్నూలు విశ్వభారతి ఆస్పత్రి వద్ద హైటెన్షన్ నెలకొంది.